Saturday 5 September 2020

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

 


నానీ విలన్, సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట/ వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి కుర్రాడులా కనిపిస్తాడు. ఒక్కసారిగా విలన్ అనేసరికి కొంత అంచనాలు పెంచాయన్న మాట నిజం.

నిజానికి కథ కొత్తదేమీ కాదు. హీరోయిన్ ను ఎవరో చంపడం.. హీరో వారిపై పగ తీర్చుకోవాలనుకోవడం.. ఈ క్రమంలో ఒకవేళ అతన్ని ఎవరైనా పట్టించుకోవాలని ప్రయత్నించినా చివరికి తన మంచితనం తెలిసి అవతలి వాళ్లు సాయం చేయడం.. ఈ తరహా కథలు ఇప్పటికే చాలాసార్లు వచ్చాయి. కానీ ఇక్కడ నానీ విలన్ పాత్రలో కనిపించడం, సినిమా టైటిల్ కొంత ఆసక్తిని రేపాయి. అయితే సినిమా కొంత భాగం పూర్తయ్యేసరికే ఈ రెండు మిస్టరీలు విడిపోతాయి. ఒకరకమైన కథలు రావడం మనకు కొత్తేమీ కాదు. కానీ స్క్రీన్ ప్లే మార్కుతో విజయం సాధించినవారున్నారు. ఇక్కడ ఆ మ్యాజిక్ మిస్ అయ్యింది.

మొదట్నుంచీ ఇద్దరు సమఉజ్జీలుగా కథ మొదలు పెట్టి చివరికి నానీనే హీరోగా చేసేస్తారు. ఇలాంటప్పుడు సుధీర్ పాత్రని హీరోగా చూడలేం. సైడ్ క్యారెక్టర్ గానే చూడగలుగుతాం. ఎంతసేపూ ఇద్దరి మధ్యా పోటీపోటీగా కాకుండా సుధీర్ బాబు పాత్ర ఎంతసేపూ నాని వెనక పరుగెడుతూ..అతను ఇచ్చిన క్లూలని పరిష్కరించడంతోనే సరిపోతుంది. ఇంత చేసినా.. చివరికి నానీని మిస్ చేస్తూనే ఉంటాడు. ఇది కొంచెం అసంతృప్తిని కలిగిస్తుంది. నానీ విలన్ అనుకుని సినిమా మొదలుపెడితే కొంత విలన్ షేడ్ మాత్రమే ఉందని అర్థమవుతుంది. నిజానికి సినిమా మొత్తానికి ఏకైక హీరో నానీగా మిగులుతాడు.

నటన పరంగా నానీ తన నేచురల్ స్టార్ స్టేటస్ ను కొనసాగించాడు. కాకపోతే ప్రతిసారిలా కాకుండా నెగెటివ్ పాత్రలోనూ తన సహజత్వాన్ని చూపించగలిగాడు. సుధీర్ నటనలో చాలా మెరుగుదల కనిపిస్తుంది. డ్యాన్స్ కూడా బాగా చేశాడు. తనను బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నానిపిస్తుంది. ఇక హీరోయిన్లు నివేదా థామస్, అదితీరావు హైదరీ.. ఇద్దరు మంచి నటీమణులు ఉన్నపుడు ఎంతో కొంత మ్యాజిక్ ఆశిస్తాం. వాళ్ల పరిధి చాలా తక్కువ. మొదటి హత్య జరిగినపుడు దర్శకుడు తనపై కొంత అనుమానం కలిగేలా చూస్తాడు. కానీ తరువాతి సీన్ లోనే అది తేలిపోతుంది. అదితీ రావు హైదరీది ప్రాధాన్యమున్న పాత్రే. కానీ సమయం సరిపోకో, పగకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చో సరిగా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. స్క్రీన్ ప్లే పరంగా పేరున్న ‘ఇంద్రగంటి’ మార్కు మిస్ అయ్యిందని చెప్పొచ్చు.

రెండు పాటలు- చూస్తున్నా.. చూస్తూ ఉన్నా..; మనసు మరీ వినడానికీ, చూడటానికీ కూడా బాగుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫర్లేదు.

సినిమా విషయంలోనూ చాలా లోపాలు కనిపిస్తాయి. ఉదాహరణకు- నానీ విషయంలో లుక్ మీద ఎక్కువ ఫోకస్ ఉండదు. విలన్ పాత్రలో సరే. సహజంగానే ఉన్నాడు. సైనికుడి పాత్రకు వచ్చేసరికి మామూలుగా ఆ లుక్ ఇవ్వలేకపోయారు. ఎందుకో అర్థం కాలేదు.

మళ్లీ మళ్లీ చూడాలనిపించదు. మరీ మధ్యలో లేచి పోవాలనిపించే బోరింగ్ సినిమా కూడా కాదు. మనసులో ముద్ర వేసేంత కథా, సీన్లూ లేవు. కానీ చివరి వరకూ చూడగలుగుతాం. బహుశా నటీనటుల నటన కారణమై ఉండొచ్చు.

మొత్తంగా ఓటీటీగా చూడొచ్చు. సినిమా కోసం తపించేవారూ చూస్తారు. కానీ.. థియేటర్ లో విడుదల చేసుంటే.. ఎంతవరకూ రప్పించగలిగేవారన్నది మాత్రం అనుమానమే.

- నీరుకొండ అనూష

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...