Thursday 17 October 2013

నేను తీసిన ఫొటో..!


తెల్లవారుజాము.. అప్పుడే భూమిపై ప్రసరిస్తున్న సూర్యకిరణాలు.. ఆ లేత కిరణాలు భూమిని చేరుతోంటే తొలిగిపోతున్న మంచుతెరలు..  భానుడికి స్వాగతమన్నట్లగా పిల్లగాలికి హొయలు పోతున్న చెట్లు.. ఇలా ఉంటుంది కదా ఏ కవి సూర్యోదయ వర్ణనైనా.. ఈ ఫొటో కూడా ఆ వర్ణనకు తగ్గట్టుగానే ఉందనిపిస్తోంది కదూ! కానీ ఇది మాత్రం సూర్యాస్తమయంలో తీసినది.
 
క సాయంత్రం ఖమ్మం పక్కన ఉన్న ఊరెళ్లాను.. రిపోర్టింగ్ పనిలో భాగంగా.. అప్పుడు  ఈ దృశ్యం కనిపించింది. అంతే.. నా ఫోన్ లో బంధించాను.  

కొబ్బరి చెట్ల మధ్య అస్తమిస్తున్న సూర్యుడు.. అచ్చం కోనసీమను తలపిస్తోంది కదూ...!


బొమ్మ కొంచెం.. భావం అనంతం!

చిన్నప్పటి నుంచి నాకు కార్టూన్లంటే చాలా ఇష్టం.. నాకు గుర్తున్నంత వరకు నేను మొదట చూసిన కార్టూన్ శ్రీధర్ గారిదే.. కార్టూన్ అనగానే గుర్తొచ్చేదీ ఒకటే.. అదే.. ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చే గుండు గాడి కార్టూన్.. దీనిని చూడడానికి వారమంతా వేచి ఉండేదాన్ని.. (మా ఇంట్లో తెప్పించే వారు కాదు కానీ.. పక్కన వాళ్లది తీసుకుని చూసేదాన్ని)



కానీ విచిత్రమేమిటంటే.. అది వేసేది శ్రీధర్ గారేనని నాకు చాలాకాలం వరకు తెలీదు. దీన్ని ఆయన గత 25 సంవత్సరాలుగా వేస్తున్నారు. దేన్నైనా కొంతకాలం చూశాక బోర్ కొట్టడం మామూలే. కానీ, అదేమిటో..  ఇప్పటికీ అదంటే నాకు చాలా ఇష్టం.  ఇప్పుడు ఆ గుండు గాడి వయస్సు పాతిక సంవత్సరాలు. అయినా వాడు ఇప్పటికీ అలానే  నేను చిన్నప్పుడు చూసినట్లుగానే..ఉన్నాడు. అసలు వాడి రూపంలోనే ఉందనుకుంటా మాజిక్.. ఒక గుండు.. గుండు మీద మూడంటే.. మూడే వెంట్రుకలు.. రెండు కళ్లు.. ఒక చిన్న ముక్కు.. నోరు. ఇంకోటి నేను గమనించిందేంటంటే.. వాడెక్కువగా నిక్కరులోనే ఉంటాడు.. చొక్కా ఉండదు.

నా ఎనిమిదో తరగతిలో అనుకుంటా.. తర్వాత నచ్చిన కార్టూన్ బుడుగుది.  బుడుగు గాడిని తెలుగు పాఠంలో భాగంగా చూశా.. వాడూ అచ్చం శ్రీధర్ గారి గుండుగాడిలానే ఉన్నా.... వాడూ అంతే.. విచిత్రమైన సందేహాలు.. అదే నిక్కరు.. కానీ అందగాడు.. జుట్టు కూడా బోలెడుంటుంది.





కార్టూన్లను చూస్తే.. ఆ.. కార్టూనేగా అనుకుంటాం గానీ.. ఒక చిన్న బొమ్మ ద్వారా ఒక పరిస్థితిని హాస్యాత్మకంగా.. విమర్శాత్మకంగా.. వివరించడం కేవలం కార్టూన్ కే సాధ్యమేమో.. పైగా దీనికి వయసుతో సంబంధముండదు. అందరినీ ఆకట్టుకుంటుంది.





పై కార్టూన్ చూడండి.. దీనిని చూస్తే ఎన్టీఆర్ చనిపోయినప్పటిది అని అర్థమవుతుంది. అలాగే ఏ తెలుగువాడి గుండె చీల్చినా ఎన్టీవోడే కనపడతాడని సులువుగా తెలిసిపోతుంది. ఇక్కడ అభిమానం ఆయన నటించిన సినిమాల వల్లా కావచ్చు.. ఆయన పాలన ఫలితమూ అవ్వొచ్చు.





ఈ కార్టూన్ చూస్తే.. మొదటి కార్టూన్ కి కొనసాగింపుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ ప్రజల్లో ఎంతో పేరు తెచ్చుకుంటే.. మిగతా నాయకులు ప్రజలకు మొహం చాటేస్తున్నట్లు.. దోచుకొంటున్నట్లూ ఉంటుంది. ఇందులో కనిపించని విమర్శా దాగుంది!



ఇక ఈ గుండుగాడి కార్టూన్లు సరే సరి.. చిన్న పిల్లలకు వచ్చే సందేహాలూ.. వగైరా.. వగైరా..




స్కూలుకెళ్లడానికి మొరాయించే పిల్లలు అప్పట్లో చేసే పని పలక పగలకొట్టడం.. (ఇప్పటి పిల్లలకు ఆ అవకాశమే లేదు.. అంతా ప్లాస్టిక్ మయం.. లేదా నోట్ పుస్తకాల్లో హోం వర్కూ.. అదీ కాదంటే.. ఉన్నాయిగా కంప్యూటర్లు..) ఆ సమయంలో నాన్న షాపుకు తీసుకెళ్లడం.. కొత్త పలక కొనివ్వడం షరా మామూలే.. సాధారణంగా షాపుకెళ్లినపుడు దుకాణదారుడు ఏ వస్తువునైనా.. దీనికంటే గొప్పది మరోటి లేదని చెబుతుండడం గమనించొచ్చు.. ఈ రెండు సంఘటనలూ ప్రతిబింబించేలా వేసిన బాపు గారి కార్టూనిది.

మరికొన్ని...





Sunday 6 October 2013

కదిలించే ప్రేమకథ

యుక్త వయసు ప్రేమ అందరికీ ఆసక్తికరమే. ప్రతి ఒక్కరి ప్రేమ ప్రయాణం ప్రేమ అంటే ఏమిటీ? సరైన జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలీ అనే ప్రశ్నలతోనే మొదలవుతుంది. తమకు కావాల్సిన అంశాలు ఎదుటివారిలో ఉన్నాయని తెలుసుకున్నపుడు వారిపై ఆసక్తి కలగడమూ సహజమే. ఈ పుస్తకంలోనూ రచయిత రవీందర్ సింగ్ ప్రేమ కథ కూడా అలానే మొదలవుతుంది.


I too had a love story అనే ఆంగ్ల నవల అనువాదమే ఈ ‘నాకూ ఓ ప్రేమ కథ’.  రచయిత ఆంగ్లంలో రచించగా జి.ఎస్.ఎల్. హేమలత తెలుగులోకి అనువదించారు. ఇది ఈయన మొదటి నవలే అయినప్పటికీ ఆ భావన ఎక్కడా కలిగించదు. తెలుగు నుడికారానికి భిన్నంగా  సాగిన అనువాదం మాత్రం పాఠకులను అక్కడక్కడా ఇబ్బంది పెడుతుంది.  

దీనిలో కథ కళాశాల జీవితం, మంచి ఉద్యోగం.. దానిలో ఉన్నతస్థాయికి ఎదగడం వరకు ఉన్న జీవితం, తరువాత తన జీవితంలో  ప్రేమ చిగురించడం, ప్రణయం, విరహం, జీవితంలో కొత్తగా రాబోయే మార్పుల గురించి కలలతో సాగుతుంది. ఇలాంటి సమయంలో అనుకోని సంఘటన వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ పుస్తకంపై ది ఇండియన్ ఎక్స్ ప్రెస్, ది ట్రిబ్యూస్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, మెట్రోన్యూస్ ల వ్యాఖ్యలు చదవడానికి ఆసక్తిని కలిగిస్తాయి. పుస్తకం మొదట్లో ఒక్కో సంఘటన యుక్త వయసు దాటిన ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో జరిగిన ఏదో ఒక సంఘటనను గుర్తుకు తెస్తుంది. ఆఖరి పేజీలు మాత్రం గుండె బరువయ్యేలా చేస్తాయి.

పుస్తకం పేరు: నాకూ ఓ ప్రేమకథ
రచయిత: రవీందర్ సింగ్
అనువాదం : జీఎస్ఎల్ హేమలత
పేజీలు: 217  వెల: రూ.135
ప్రతులకు: బీఎస్.సీ పబ్లిషర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్
కె.డి.హౌజ్, 3-5-121/E/1/16
షాలిమార్ ఫంక్షన్ హాల్ దగ్గర, రామ్ కోఠి, హైదరాబాద్-500001.

Thursday 3 October 2013

నాకే ఎందుకిలా......!



దయం లేచేసరికే 8 అయ్యింది. ఆ.. అయినా ఆఫీస్ రెండింటికి కదా అని ఏదో పనిచేస్తూ కూర్చున్నా.. అంతే.. గడియారం గిరాగిరా తిరిగేస్తోంది.. ( నాకిష్టం లేని సినిమానో.. సీరియల్లో వస్తున్నపుడు సమయం తొందరగా గడవదని తిడుతూ ఉంటాలే..!) ఈరోజు కచ్చితంగా నా మీద  పగ పట్టినట్లే ఉంది.  నువ్వేనా తిరిగేది.. నేను నీ కంటే మొండిదాన్ని.. కచ్చితంగా రెండు గంటల్లోపు (2.15 కల్లా ఉండొచ్చులే కానీ ముందే ఉండాలని నా కోరిక) ఆఫీసులో ఉంటా చూడని దాన్ని చాలెంజ్ కూడా చేశా.. దాని కోపం నషాళానికంటినట్టుంది. ఇంకా వేగంగా తిరిగేస్తోంది.

ఇలా కాదని బాత్రూంలో దూరా.. తిరిగొచ్చేసరికి 12 అయ్యింది. తల చూస్తే నీళ్లు కారుతోంది. అదేమో తొందరగా ఆరదు.. గడియారమేమో తిరగడం ఆగదు. 12.20కేమో బస్సు.. దేవుడా కష్టాలన్నీ నాకే పెట్టావేమయ్యా అని దేవుడిని కొంచెం గుర్రుగా చూసి, జడకు రబ్బరు బాండు తగిలించి గబగబా బస్ స్టాండ్ కుపోతే.. బస్సులేదు.

సగం దూరమైనా వస్తుంది కదా అని కొండాపూర్ బస్సెక్కా.. ఆ డ్రైవరు మరీ మంచోడులా ఉన్నాడు ఎవరు చెయ్యెత్తినా బస్సు ఆపుతున్నాడు.. ప్రయాణ బడలిక తెలియొద్దని నెమ్మదిగా పోనిస్తున్నట్టున్నాడు పాపం.. పైగా కండక్టరు తిడుతున్నా పట్టించుకోకుండా ఎవరెక్కడ ఆపమన్నా ఆపేస్తున్నాడు.. మాములుగా అతను నా విషయంలో అలా ఆపుంటే మంచివాడని మెచ్చుకునుండేదాన్నే కానీ.. నా విషయంలో జరగలేదు. పైగా నాకు ఆలస్యమవుతోంది మొర్రో అంటుంటే.. అపుడే తన జాలి గుణాన్ని ప్రదర్శిస్తున్నాడాయే..

ఈరోజు డ్రైవర్ తోపాటు ట్రాఫిక్ వాళ్లూ  నాపై పగ పట్టారేమో అనిపిస్తోంది. బస్సు బయలుదేరింది మొదలు ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరా రెడ్ లైటే. పోని  కొన్నిచోట్ల  సిగ్నళ్లు లేవు కదా అని సంతోషపడదామంటే.. ట్రాఫిక్ పోలీసు ఈల వేస్తూ.. చేయి చూపించి మరీ బస్సు ఆపుతున్నాడు.. టైమ్ చూస్తే 1.40. బస్సేమో ఇంకా కోఠి కూడా  దాటలేదు.  నాకేమో.. టెన్షన్.. కోపం పెరుగుతోంది. ఈ కోఠిలో ఇంతమంది జనం రోజూ ఏం చేస్తారో.. అని తిట్టుకున్నాను. నేను వెళ్లే బస్సుకు అడ్డంగా ఎవరొచ్చినా వారివైపు కోపంగా ఓ లుక్కేస్తున్నా.. వారికి కనపడదని తెలిసినా.. (ఎందుకంటే నేను మెట్రో డీలక్స్ బస్సెక్కాను దాంట్లో కొండపైనెక్కి కూర్చున్నట్లు నాలుగు సీట్లుంటాయిగా.. వాటిల్లో డ్రైవర్ వెనక సీట్లో కూర్చున్నాలే..)

పాపం మా డ్రైవర్ కి నా గొణుగుడు వినిపించిందో ఏమో.. బస్సు స్పీడు పెంచాడు. హమ్మయ్య అనుకుని ప్రశాంతంగా ఫీలయ్యా.. 2.00 కల్లా లకిడీకపూల్ లో దింపాడు. దిగుతూ దిగుతూ డ్రైవర్ వైపు కోపంగా లుక్కిచ్చి మరీ దిగా.. కోపాన్ని ఎవరిపైనో ఒకరిపై ప్రదర్శించాక ప్రశాంతంగా అనిపించి, ఆ.. ఈరోజుకి ఆ extra పదిహేను  నిమిషాలు వాడుకుందాంలే అనుకుని సరిపెట్టుకున్నా.. బస్సు కూడా వెంటనే వచ్చింది. సాధారణంగా ఒక మామూలు స్థాయి ట్రాఫిక్ ఉన్నా 5- 6 నిమిషాల్లో ఖైరతాబాద్ చేరుకోవచ్చు. కానీ అదేంటో ఈరోజు ట్రాఫిక్ ఉందండీ.. అబ్బబ్బబ్బా.. దాన్ని వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు. ఇక లాభం లేదని దిగి గబగబా నడుచుకుంటూ ఎలాగోలా ఆఫీసుకు చేరుకునే సరికి  2. 13 అయింది. ఫర్లేదులే రెండు నిమిషాల్లో పంచ్ కొట్టొచ్చని చూస్తే.. పంచింగ్ కోసం క్యూ.. (లోపలుండేది పాడైందిలెండి.. అందుకే అందరూ ఇక్కడ క్యూ కట్టారు).. ఇక నామీద నాకు జాలేసింది చూడండి.. దీనంగా పెట్టానిక ఫేసు..

ఇంతలో ఒకాయన నువ్వు పంచ్ కొట్టమ్మా అంటే.. 2.14 కొట్టి లోపలికి వచ్చా లిఫ్ట్ కోసం.. ఒకటే పనిచేస్తోంది.. అక్కడా క్యూనే...!

Wednesday 2 October 2013

ఇది నా తొలి అడుగు...



 
డియర్ ఫ్రెండ్స్...

ఇది నా బ్లాగులో తొలి పోస్టు...

నా భావాలను పంచుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించాను. దీనిలో నాకు తోచింది ఏదో రాస్తుంటాను.

బాగుంటే... పోనీ బాగా లేకపోయినా సరే,   దాన్ని మీ   కామెంట్  ద్వారా  నాకు  చెప్పండి.

సరేనా?

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...