Thursday 25 December 2014

ఆవు పాఠం..

జంతువులకూ, మనకూ అంటే మనుషులకూ కొన్ని పోలికలున్నాయని చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాళ్ల మాటలను మనం పట్టించుకోవట్లేదనుకుందో ఏమో! ఈ ఆవు రుజువు చేసి చూపెడుతోంది.


కటక్ లో ఒక ఆవు.. దాహమేస్తే.. కొళాయిని తిప్పి తన దాహాన్ని తీర్చుకుని మళ్లీ కట్టేసిందట. ఎంత విచిత్రం. పైగా దాన్ని పరీక్షించడానికి ఎవరో దాన్ని తిప్పి వచ్చేస్తే మళ్లీ ఆపేసిందట. ఒక మూగజీవి ఇంత క్రమశిక్షణగా ఉండడం హర్షించదగ్గ విషయమే.. కదూ..!


అయినా జంతువులకూ.. మనకూ మెదడు విషయంలోనే పోలిక. చేసే పనులలో కాదు.


అది కాబట్టి తాగి మళ్లీ కట్టేసింది.. అదే మనమైతే.., అలాగే వదిలేసేవాళ్లం. ఎంతైనా మనుషులం కదా..! కాబట్టి తేడా తేడానే.


Tuesday 28 October 2014

ఫస్ట్ క్రష్...

 



మా ఫ్రెండ్ వాళ్ల అక్క పెళ్లి.. కాలేజికి రెండు రోజులు డుమ్మా కొట్టి ... ఫ్రెండ్స్ అందరం బయల్దేరిపోయాం. మిగతా వాళ్లందరూ చేరిపోయారు. నేనూ, నందుగాడు తప్ప.


వాళ్లేమో.. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాం.. రండ్రా అని ఒకటే ఫోన్లు.. వీడేమో.. నన్నిక్కడ బస్టాండ్ లో నిలబెట్టి ఎంతకీ రాడు...

పోనీ నేనూ వాడితోపాటు వాడింటికి వెళదామా అంటే.. వాడు- బాబ్బాబు.. వద్దురా.. నువ్వూ వస్తే మా నాన్న మార్కుల చిట్టా అడుగుతాడు. నేనేమో ఏదో చెప్పుంటా.. నవ్వొచ్చి ఏదో మాట్లాడావో.. ఇద్దరికీ క్లాస్ పీకుతాడు.. పాకెట్ మనీ కూడా కట్ చేస్తాడు. ప్లీజ్ రా.. పదంటే.. పదే నిమిషాల్లో వస్తాను. అంటూ ఈ బస్టాండ్ లో ఉంచాడు.

గంటైంది వెళ్లి. ఇంకా రాడు. నిల్చొని నిల్చొని చిరాకొస్తోంది.. వదిలేసి వెళదామా అంటే ఏడ్చిచస్తాడు వెధవ.

గల్.. గల్.. గల్.. గజ్జెల చప్పడు..

ఏంటీ చప్పుడు చిరాగ్గా.. ఎందుకు పెట్టుకుంటారో ఈ ఆడవాళ్లు.. ఇలా గణ గణా మోగేవి...

పరమచిరాకేసింది. కానీ ఆ అమ్మాయిని చూడగానే దెబ్బకు మాయమైంది.

భలే ఉందే.. పెద్ద పెద్ద కళ్లు.. కాటుక పెట్టుకుంది. నుదుట ఒకే రాయితో బొట్టు బిళ్ల.. జుట్టు వదిలేసింది. లేత గులాబీ రంగు డ్రెస్. గౌనులా ఉంది. పై నుంచి కిందకు పొడుగ్గా.. కొద్దిగా.. చాలా కొద్దిగా ప్యాంటు కనిపిస్తోంది. చున్నీ పక్కకు వేసింది. మెడలో చిన్న చైను. ఎస్ అని అక్షరంతో లాకెట్. పేరు ఎస్ తో మొదలవుతుందన్నమాట! మొత్తం మువ్వలతో పట్టీలు.. ఫ్లాట్ చెప్పులు.

డ్రెస్ వల్ల కొంచెం పొడుగ్గా కనిపిస్తోంది. కానీ, కొంచెం పొట్టే.. నా ఎత్తుతో పోలిస్తే!

చూడగానే ఫ్లాట్ అయ్యేలా లేదులే. మా కాలేజీలో ఇంతకంటే బాగుంటారు. మోడ్రన్ గా కూడా ఉంటారు. కానీ ఎందుకో చాలా బాగున్నట్టుంది.  నా ముందు నుంచే వెళ్తోంది. జేబులోని చేతులు ఆటోమాటిక్ గా జుట్టును సరిచేసుకున్నాయి. పక్కనే ఎవరో ఉన్నారు. పెద్దాయనే.. బహుశా వాళ్ల నాన్నేమో! ఇంకొక చిన్న అమ్మాయి. మరీ చిన్నది కాదు.. ఆమె కంటే మాత్రం చిన్నది. గౌను వేసుకుని ఉంది. ఆమె చేయి పట్టుకుని నడుస్తోంది.

హ్మ్.. ఇక మెదడులోంచి నందు గాడు డిలీట్ అయ్యి ఈమె చేరింది. ఆ అమ్మాయినే గమనిస్తూ ఉన్నాను.

నా ముందు ప్లాట్ ఫాం దగ్గర దిమ్మె ఉంటే అక్కడ కూర్చుంది. అప్పుడప్పుడు జుట్టు సరిచేసుకుంటోంది.. టైం చూసుకుంటోంది.. ఫోను చూసుకుంటోంది..

అబ్బాయిలందరూ అలర్ట్ అయినట్టు ఆమెనే చూస్తున్నారు. ఈమె మాత్రం ఎవరినీ చూడట్లేదు. మిగతా వాళ్లతో పోలిస్తే నేనే బాగున్నాను. దగ్గరలో కూడా!

ఆమె వినాలని దగ్గినట్టు చేశాను. చూసింది. కానీ మళ్లీ చూడట్లేదే..

అబ్బో అస్సలు చూడనట్టే చేస్తోంది. కానీ నాకు తెలుసు గమనిస్తోందని.. ఎన్నిసార్లు నేనూ ఇలా ఫోజు కొట్టి ఉంటాను!

నేనేం తక్కువా.. నేనూ గమనించనట్టే ఫోన్ వైపు చూస్తూ.. చూస్తోందో లేదో తెలుసకోవడానికి కెమెరా ఆన్ చేశాను.

చూసింది...  హ హ్హ హ్హ చెప్పానా.. ఒకటి కాదు.. రెండుసార్లు..

రెక్కలు వచ్చాయన్న ఫీలింగ్..

ఈసారి నేనూ చూశాను. చిన్న స్మైల్ తో...  అంతే! ఆ చిన్నమ్మాయి చెవిలో ఏదో గుసగుసలాడడం.. ఆ అమ్మాయేమో చటుక్కున నా వైపు చూడడం.. నేనేమో వెంటనే ఏదో చూస్తున్నట్టు నటించడం అన్నీ టకా టకా జరిగిపోయాయి..

బహుశా.. నేను ఆమెను చూస్తున్నట్లు చెబుతోందేమో!

పిల్లా నువ్వు లేని జీవితం.. అంటూ ఫోన్ మోగుతోంది.. నాదే.

చూస్తే.. నందుగాడు..

ఆ నేనే... శ్రవణ్ నే మాట్లాడుతున్నా.. చెప్పరా అన్నాను.

‘తెలుసులేరా.. నీ ఫోన్ చేస్తే నువ్వు కాకుండా ఎవరు ఎత్తుతారు?’ అన్నాడు వాడు

సర్లే ముందు ఎందుకు చేశావో చెప్పు.. వెటకారాలు ఎదవకి!

ఇంకో పది నిమిషాలేరా.. వస్తాను.. ప్లీజ్ రా..

నేనేమో శాంతమూర్తిలా ఫర్లేదు రా.. హాస్టల్ నుంచి చాలారోజులకు వచ్చావుగా ఇంటికి.. చిన్నగానే రా అని అభయహస్తం ఇచ్చి ఆమె వైపు చూద్దును కదా...

ఒక చిన్నపిల్లాడు.. అడుక్కుంటూ వచ్చాడు. అక్కా.. అక్కా... అంటూ అడుగుతున్నాడు. ఆమె వాడిని కసిరించుకుంటోంది.. వాడు మరీ జాలిగా అడుగుతున్నాడు..

అరె.. ఈమె మాత్రం ససేమిరా అంటోంది.

ఈమె మరీ పిసినారిలా ఉందిరా బాబు.. ఒక్క రూపాయి ఇవ్వడానికి చస్తోందే.. ఈమె తయారవడానికి పెట్టిన వాటిలో రూపాయెంత?

అందంగా ఉంది కానీ.. అస్సలు జాలి లేదు. కొంచెం పొగరు అనుకుని ఆమె వైపు చూడకుండా నిల్చున్నాను. కానీ గమనిస్తూనే ఉన్నాను.

అదే పిల్లాడు ఈసారి నాదగ్గరికొచ్చాడు.

నేను ఆమె చూసేలా పదిరూపాయలు ఇచ్చాను. కొంచెం పొగరుగానే ‘చూశావా.. నువ్వివ్వలేదు.. నేనిచ్చాను’ అన్నట్లు చూశాను. కానీ ఆమె ఏం పట్టించుకోనట్టే ఉంది.

ఇంతలో విజయవాడ బస్సు వస్తే.. ఆమె వాళ్లవాళ్లతో కలిసి వెళ్లిపోయింది.

ఇక అప్పుడు నందుగాడు మళ్లీ ఎంటరయ్యాడు.. వీడసలు.. ఎంతసేపు వెయిట్ చేయాలి? 
రాడే దరిద్రుడు..

ఏంతోచక.. అటూ ఇటూ తిరుగుతుంటే.. మళ్లీ ఆమె కనిపించింది. విజయవాడ సూపర్ డీలక్స్ బస్సులో విండోసీటు. ఆమెకు కొద్దిగా కనిపించేలా కూర్చుని బ్యాగులో సితార ఉంటే తిరిగేస్తూ కూర్చున్నా.

ఆమె కూర్చున్న సీటు విండో దగ్గరికి ఒక ముసలావిడ వచ్చింది. అడుక్కుంటోంది.

ఆమె ఇవ్వదులే.. అనుకున్నా...

నేను మాత్రం పర్సులో చిల్లర చూసుకున్నాను.

తను మాత్రం తన బ్యాగులోంచి రెండు అరటిపళ్లు తీసి ఇచ్చింది. వాళ్ల నాన్ననడిగి చిల్లర కూడా తీసుకుని ఇచ్చింది. 

అదేంటి? ఇందాక ఆ పిలగాడు అడిగితే ఇవ్వలేదు కానీ.. ఈమెకిచ్చింది? ఏం అర్థం కాలేదు. అలాగే నోరు తెరిచి ఉండిపోయా.

థాంక్స్ రా...

నందుగాడు వచ్చాడు..

ఏంట్రా ఇంత లేటు?

పెళ్లి నుంచి డైరెక్టుగా హాస్టల్ కే వెళ్లిపోతానని అమ్మ ఏవేవో సర్దిందిరా.. పదా వెళదాం.. అన్నాడు.

బస్సు లేదుగారా.. రానీ.. అన్నాను.

అలా కూర్చున్నమో లేదో.. బస్సు వచ్చింది.. కావాల్సినపుడు ఎప్పుడూ రాదు కానీ.. వద్దంటే ఇప్పుడొచ్చి చచ్చింది అనుకుంటూ బస్సును.. డ్రైవర్ నూ బండ బూతులు తిట్టుకున్నాను.

వాడు పదరా.. వెళదాం... మళ్లీ బస్సులో సీట్లు దొరకవు.. పా అంటూ తొందర పెడుతున్నాడు. ఆ అమ్మాయికి నా నంబర్ ఎలా ఇవ్వాలా అంటూ నేను ఆలోచిస్తోంటే!

హా... చాక్లెట్... కరెక్ట్...

బ్యాగు బస్సులో పడేసి.. దిగుతుంటే.. ఎక్కేవాళ్లు.. అడ్డు...

హమ్మ.. ఎలాగోలా దిగి షాపుకు వెళ్లి చాక్లెట్ కొని చూస్తే... బస్సు వెళ్లిపోతూ కనిపించింది.

ఛ.. అనుకుంటూ బస్సెక్కి కూర్చున్నాను. నందు గాడు ఏదో వాగుతున్నాడు..

మళ్లీ వాడే.. ఇందాక అడుక్కుంటూ వచ్చిన పిల్లాడే వస్తే.. అరే.. ఎన్నిసార్లు ఇస్తారురా.. అని కసిరించుకున్నాను. నందుగాడు కూడా...

‘ఏరా.. ఒక్క రూపాయి ఇస్తే.. చస్తావా? ఎన్ని డబ్బులు ఖర్చు చేయట్లేదురా నువ్వు?’ అని కోపంగా అడిగాను నుందూను.

‘ఒరేయ్.. వీళ్లదంతా నాటకంరా బాబు.. అదే వీడిని చదివిస్తా.. ఫ్రీగా స్కూళ్లో వేస్తా రా అను.. దెబ్బకు పారిపోతారు. చిన్నపిల్లలైతే.. జాలిపడి డబ్బులిస్తారని కొందరు ఇలా పంపిస్తారు. నీకు తెలుసో లేదో.. కొందరు తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ వీళ్లను చదువుకోమని పంపిస్తే.. కొనుక్కు తినడానికి డబ్బులు లేవని ఇలా అడుక్కుంటున్నారంట.. మొన్న పేపర్లో వచ్చింది. చూడలేదా?’ అన్నాడు.

హో.. అందుకేనా.. ఆ అమ్మాయి వీడికి డబ్బులివ్వలేదు.. ఛ.. అనవసరంగా తిట్టుకున్నాను. ఈ సారి ఆ అమ్మాయి ఇంకా అందంగా అనిపించింది. 

నెంబర్ ఇవ్వలేకపోయాను. కానీ ఈ అమ్మాయి మాత్రం నాకెప్పటికీ గుర్తుంటుంది. ఎందుకంటే.. ఎంతైనా మొదటిసారిగా నచ్చిన అమ్మాయి కదా..

చూద్దాం.. చదువైపోయేలోగా.. ఈమెనే మళ్లీ కనిపిస్తుందేమో.. ఎవరికి తెలుసు? అనుకుని నవ్వుకున్నాను.

Thursday 24 July 2014

మనకు మాత్రం తెలిస్తే సరిపోదుగా!


ఇంగ్లిష్ మన జీవితాల్లో తప్పనిసరి అయ్యింది. పూర్తిగా ఆక్రమించేసింది అని కూడా అనొచ్చేమో! ఇప్పుడు ఇంగ్లిష్
మాట్లడడం ఒక అవసరమే కాక ఫ్యాషన్ కూడా అయ్యింది. కానీ దాని చాయల్లోకి రానివారు ఇంకా చాలామందే ఉన్నారు. పల్లెటూర్లలోకి ఆంగ్లపదాలు కొన్ని చొరబడినా.. చాలావరకూ తెలియనివారు ఉన్నారు. ఈ స్పృహ కొంత అవగాహన ఉన్నవారెవరైనా చెబుతారు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఒక్కోసారి మనం పోయే గొప్పలు ఇతరులను ఎలా ఇబ్బంది పెడతాయో ఒక సంఘటన నాకు ఎదురైంది. అది మీతో పంచుకుందామని..

ఒకరోజు ఆఫీసుకు వెళుతోంటే.. ఒక ముసలాయన కంగారుగా అటూ.. ఇటూ వెళుతున్నాడు. ఆయన దగ్గర్లోకి నేను రాగానే.. ‘అమ్మా.. ఇది ఖైరతాబాదేనా? ’అని అడిగాడు. హా.. అవునండీ అని చెప్పాను.

‘నా తమ్ముడి కొడుకు ఈనాడు ఆఫీసు దాటినంక సిగ్నల్ దగ్గర ఉండు.. నేను వచ్చి తీసుకుపోతా అన్నాడు. అంటే ఎక్కడికి పోవాలమ్మా?’ అని అడిగాడు. అతను మిమ్మల్ని ఉండమంది ఇక్కడే అని చెబితే.. నిజంగా నీకు తెలుసునా అమ్మా.. అక్కడున్న అమ్మిని అడిగితే.. ఇదేదో ఆఫుకోర్సు అని చెప్పింది. అన్నాడు.

మొదట్లో నాకు కొంచెం అర్థం కాలేదు. వాళ్ల వైపు చూస్తే వాళ్లేమో మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. బహుశా వాళ్లు haa.. Ofcourse అని చెప్పారనుకుని.. ‘నేను ఇదేనండి.. వాళ్లు కూడా ఇదే అని ఇంగ్లిష్ లో చెప్పారు’ అని చెప్పాను.

‘పల్లెటూళ్లో ఉండేవాళ్లం మాకేం తెలుస్తదమ్మా ఆ ఇంగ్లీసు.. అనవసరంగా గాబరా పడ్డాను’ అన్నారు. బహుశా వాళ్లకు తెలుగు రాదేమోనండీ అందుకే మీకు ఇంగ్లిష్ లో చెప్పారు అని చెప్పాను.

ఇంతలో ఆ అమ్మాయిలు వాళ్ల ఫ్రెండ్స్ ఆటోలో దాటిపోతుంటే.. పెద్దగా కేకలు వేస్తూ పిలుస్తున్నారు. అదీ.. అచ్చమైన తెలుగులో.. దెబ్బకు ఆ ముసలాయన, నేను షాక్ అయ్యి వాళ్లవైపు చూశాం.

‘రెండు మూడు సార్లు అడిగినా ఆ ముక్కే చెప్పారు తప్ప ఇంకోటి మాట్లాడలేదు. ఇప్పుడు ఎంత చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారో చూడమ్మా.. నువ్వు రాకపోతే ఒకచోట దిగబోయి వేరేచోట దిగాననుకుని ఎటో వెళ్లిపోయుండేవాడిని. అనవసరంగా మా వాడు ఇబ్బంది పడేవాడు. థాంక్సమ్మా’ అని చెప్పి వాళ్ల తమ్ముడి కొడుకుతో వెళ్లిపోయారు.

కొసమెరుపేంటంటే.. తరువాత నేను వాళ్లను దాటిపోయేటపుడు కూడా వాళ్లు తెలుగులోనే చక్కగా మాట్లాడుకుంటున్నారు.

Wednesday 7 May 2014

నేను ప్రేమలేఖ రాశానోచ్..! (తెలుగు వెలుగులో నా ప్రేమలేఖ)

హా...!

 చివరికి నేనూ ఒక ప్రేమలేఖ రాశానండి. ఎన్నిరోజుల నిరీక్షణ తరువాత రాశానో...!

ఇంతకీ ఎవరికీ? ఎప్పుడూ? అనా మీ సందేహం?

ఎవరికీ కాదండీ..! ఊరికే అలా రాశానంతే.

ఈ లేఖ వెనుక పెద్ద నిరీక్షణ ఉందని చెప్పాను కదా. దాని వెనుక ఒక పేద్ద కథ కాదు కానీ.. చిన్న ఆసక్తికర సంఘటన ఉంది. ఆ ఆసక్తికర సంఘటన మనసులో తొలచి తొలచి.. చివరికి నాతో ఇలా ఒక లేఖ రాయించిదన్నమాట.

ఇంతకీ ఆ సంఘటనేంటో చెప్పనేలేదు కదా..! అక్కడికే వస్తున్నా..

నేను ఇంటర్లో ఉన్నపుడు మా క్లాస్ లో ఒకమ్మాయికి ఎవరో ప్రేమలేఖ రాశారు. తనేమో తన స్నేహితురాళ్లతో కలిసి చదువుతూ నవ్వుకుంటోంది. మేమేమో (నేనూ.. నా ఇద్దరు ఫ్రెండ్సూనూ) మాకెప్పుడు చూపిస్తుందా? చదువుదామా.. అని ఎదురు చూశాం. ఆ అమ్మాయేమో అసలు ఎంతకీ చూపదే..!

ఇక ఆగలేక వెళ్లిమరీ అడిగితే.. చిన్నదానివి. నీకెందుకు ఇవన్నీ? వెళ్లు అంది (ఆ అమ్మాయి పొడవు.. నేనూ పొట్టేమీ కాదు కానీ ఆ అమ్మాయే మరీ పొడవన్నమాట). అంతే. నేను ఆ  అవమానాన్ని తట్టుకోలేకపోయా. ఎలాగైనా ఏదో ఒక ప్రేమలేఖ చదవాలన్న పట్టుదల పెరిగింది. కానీ ఉత్తరాలేమో ఆ అమ్మాయికి ఒక్కదానికే వచ్చాయి (అంటే కుప్పలేం కాదులెండి.. ఓ నాలుగైదే).

ఇలా ఆ కోరిక బలంగా ఉండి పోయింది. తరువాత మా క్లాస్ లో (ఎంబీఏ వరకు) ఎవరూ ఎవరికీ ప్రేమలేఖలు రాయలేదు. కావాలంటే ఎస్.ఎం.ఎస్ లు పంపుకునేవారు. ఎన్ని మెసేజ్ లు చదివినా ప్రేమలేఖ కాదు కదా..!

అందుకే పోనీ నేనే రాస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించా. కానీ ఎలా రాయాలి? ఆలోచించి ఆలోచించి మొత్తానికి రాశాను. ఆత్మీయులకు చూపిస్తే బాగుందన్నారు. దాచుకుందామనుకున్నా. ఇంతలో ‘తెలుగువెలుగు’ వాళ్లు ‘ప్రేమలేఖల పోటీ’ నిర్వహిస్తున్నారని తెలిసి పంపాను.

వాళ్లు బాగుందని ప్రచురిస్తామన్నారు. అలా మే నెల సంచికలో ప్రచురితమైంది.

దానిని కింద  చూడొచ్చు..!


Wednesday 30 April 2014

మొదటి ఓటు అనుభవం.. ఆహా...



ఈరోజు నా జీవితంలో మొదటిసారిగా ఓటేశాను. తొలిసారి వేయబోతున్నాను కదా.. నిజం చెపొద్దూ? .. కొంచెం భయంగా.. అమిత ఉత్సాహంగా అనిపించింది. రాత్రి కూడా నిద్ర పట్టలేదంటే.. నమ్మండి (అంటే.. కరెంటు కూడా లేదులే).


ఓటింగ్ ఉదయం 7 గంటల నుంచి మొదలవుతుంది కదా!  ఆలస్యమైతే క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వస్తుందని ఉదయాన్నే బయల్దేరాను. అసలే పోలింగ్ బూత్ కూడా తెలియదాయే..

పోలింగ్ బూత్ కనుక్కుని అక్కడకు చేరుకునే సరికి సరిగ్గా 6:50 అయ్యింది. ఉత్సాహంగా వెళ్లి చూద్దునా.. అప్పటికే  క్యూ ఉంది. సరేలే అని వెళ్లి నిల్చున్నాను. 7.10 అయినా క్యూ ఎంతకీ కదలదే. విషయం ఏంటంటే అసలు ఓటింగ్ నిర్వహించే వాళ్లే రాలేదట. ఆహా ఏమి భాగ్యమని అలాగే నిల్చుని ఉంటే, ఒక దంపతులు (వయసు సుమారు 50పైగా ఉంటాయేమో) వచ్చి నా వెనుక నిల్చున్నారు.

ఇక వచ్చినప్పటినుంచీ ఆవిడ నన్ను ముందుకు తోస్తూనే ఉంది. అసలే ఇరుక్కుని నిల్చుని చెమటలు పోస్తోంటే.. ఆవిడ ఇంకా తోస్తోంది. అక్కడ ఓటింగ్ ఇంకా మొదలవలేదాంటీ.. మనం జరిగినా ఇరుక్కోవడమే తప్ప లాభం ఉండదు అంటే.. అయ్యో.. అవునా అమ్మా అంటుంది.. మళ్లీ షరామామూలే!

7.30 అవుతున్నా.. ఇంకా క్యూ కదలడం లేదు. ముందు చూస్తే 15 మంది ఉన్నారేమో.. సంగతేంటబ్బా అని ఆరా తీస్తే అప్పుడు తెలిసింది. ఓటింగ్ నిర్వహించాల్సిన ఏజెంట్లు వాళ్లలో వాళ్లు కొట్టుకుంటున్నారట. అసలు సంగతేంటంటే- వేరే ఓటింగ్ కేంద్రంలో విధులు నిర్వహించాల్సిన అతను ఇక్కడ చేయడానికి వచ్చాడట. అందుకు నేను ఒప్పుకోను అంటాడట ఇంకొకతను. చివరికి ఎవరో వచ్చి సర్ది చెబితే.. అప్పుడు మొదలైంది ఓటింగు.

హమ్మయ్యా.. ఇప్పటికైనా కదిలిందని సంతోషిస్తే.. కరెంట్ పోయింది. మళ్లీ క్యూ ఆపేశారు. ఈసారి పాపం 5 నిమిషాలకే కరెంట్ వచ్చింది. పైగా తొందరగానే నా వంతు కూడా వచ్చింది. ఇక సీరియల్ నెంబర్ తనిఖీ చేసేవాళ్లు నెంబర్ అడిగారు. అక్కడ నలుగురు కూర్చున్నారు. ఒకరేమో ఉందంటారు; ఇంకొకరు లేదంటారు. చివరికి ఇద్దరూ ఉందని తేల్చి లోపలికి పంపారో లేదో మళ్లీ కరెంట్ పోయింది.

నా ముందువాళ్లు అప్పటికే ముగ్గురున్నారు. ఆ ఓటు వేసే గదేమో చిన్నగా ఉంది. కిటికీలు తీయడానికి వీలు లేదు. భయంకరమైన ఉక్కపోత. పనిలోపనిగా ఈవీఎం మెషీన్ ఒకటి పాడైంది. దాన్ని బాగు చేసుకుంటూ మళ్లీ సీరియల్ నెంబర్లు చీకట్లో సెల్ ఫోన్లతో చెక్ చేసుకుంటూ మరో పది నిమిషాలు గడిచింది. అసలే ఊపిరాడక చికాకు పుడుతోంటే.. నా వెనుక ఆంటీ.. తతంగమంతా చూస్తూ కూడా అక్కడా నెడుతూనే ఉంది. ఇకంతే.. చిరాకేసి నా ముందు ముగ్గురే కరెంట్ లేక, మెషీన్ పనిచేయక ఆగిపోయారు.. ఇక నేనెక్కడికి వెళ్లి వేయమంటారాంటీ ఓటు? నాకింకా స్లిప్పు కూడా ఇవ్వలేదు అన్నాను. ఇక అప్పడు ఆవిడ ఏమనుకుందో ఏమో.. కొంచెం దూరంగా నిల్చుంది.

మెషీన్ బాగయ్యేసరికి కరెంట్ వచ్చింది.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటే.. TRS కార్యకర్త ఒకరు వచ్చి మా బటన్ సరిగా పనిచేయడం లేదు అంటూ గొడవకొచ్చాడు. మా మనిషిని ఒకరిని అక్కడ ఉంచాలంటాడు. అన్నీ బాగానే పనిచేస్తున్నాయని చెప్పి ఆయనకు సర్ది చెప్పిపంపాక.. వేశానండీ.. నా మొదటి ఓటు. బయటికి వచ్చే సరికి 8.15 అయ్యింది.

చివరికి మొదటి ఓటు వేశానన్న ఉత్సాహం కంటే.. మొత్తానికి బయటపడ్డానన్న ఆనందమే మిగిలింది. :(

Friday 4 April 2014

కథలకన్నా మెప్పించిన కార్టూన్లు

2011లో వివిధ పత్రికలు, మ్యాగజీన్లలో ప్రచురితమైన వివిధ రచయితల కథాసంకలనమే ఈ హాస్యకథ-2011.

 ప్రతి కథ తరువాత ఆ రచయిత పరిచయంతోపాటు, వారి కథలు, హాస్య కథలపై వారి అభిప్రాయాలనూ పొందుపరిచారు.

 కథకీ, కథకీ మధ్యలో వచ్చే ఏవీఎం రాసిన గీసిన కథలూ,  కార్టూన్లూ ఆటవిడుపును కలిగిస్తాయి.  అసలు చాలా కథలకన్నా కార్టూన్లు.. చిన్నకథలే ఎక్కువ హాస్యాన్ని పండించాయి.

ఈ పుస్తకాన్ని కొంటె బొమ్మల బాపు, జంట నేస్తం రమణలకు అంకితమిచ్చారు.

దీనిపై నేను రాసిన సమీక్ష ఈనాడు ఆదివారం (మార్చి 31) సంచికలో వచ్చింది. దానిని ఈ కింద చూడొచ్చు.



Saturday 1 March 2014

‘వాకిలి’లో నా తొలి కథ!

కరోజు బస్సులో వెళుతుంటే.. నాకు ఎదురైన సంఘటనను యథాతథంగా రాశాను.

దానిని బ్లాగులో పెడదామనుకున్నాను.

దానిని కథగా మలచమని మిత్రులు ప్రోత్సహించారు. అలా ఈ కథ తయారైంది.

తరువాత కూడా దీన్ని బ్లాగులో పెడదామనుకున్నాను.  పత్రికలో వచ్చినా బ్లాగులో పెట్టొచ్చు. ముందు ఏదైనా పత్రికకు పంపితే బాగుంటుందేమో! ప్రయత్నించమన్నారు.

అప్పుడే నాకు  ఆన్ లైన్ పత్రిక ‘వాకిలి’ గురించి తెలిసింది. కొద్దిగా సంశయిస్తూనే పంపించాను.

వారి నుంచి సానుకూల స్పందన వచ్చింది.. మార్చి సంచికలో ప్రచురించారు కూడా!

ఇలా నేనూ ఒక కథ రాయగలిగాను!

చూడాలంటే.. కింద ఇచ్చిన లింక్ ద్వారా వెళ్లండి..


Thursday 6 February 2014

నాకు నచ్చని పేరు



 ‘క్కడైనా.. ఎప్పుడైనా.. ఎవరినైనా మీకు ఎదుటి వాళ్లు ఏం చేస్తే మీకు నచ్చుతుంది అని అడగండి.. వాళ్లు మా పేరు పెట్టి పిలిస్తే సంతోషంగా అనిపిస్తుంది అని చెబుతారు’ అని ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు అన్నారు. చాలామంది అవును నిజమే అని కూడా సమాధానమిచ్చారు.

కానీ.. నా విషయంలో మాత్రం కాదండీ.. ఎందుకంటే... అదో పే...ద్ద కథ. తెలియాలంటే ఫ్లాష్ బాక్ కి వెళ్లాల్సిందే..

నా పేరు అనూష. ఈ పేరేదో కొత్తగా ఉందే.. అని పెట్టిందట మా అమ్మ నాకు (ఈ పేరే ఎందుకు పెట్టారమ్మా.. నాకు అని ఓసారి అడిగితే చెప్పింది). నాకు ఊహ తెలిసినప్పటినుంచి నేనెక్కడికి వెళ్లినా.. ఇంకో అనూష ప్రత్యక్షమయ్యేది.  ఎవరికైనా తన పేరుతో ఇంకొకరుంటే భలే సరదాగా ఉంటుందట (ఓసారి నా స్నేహితురాలు తన అభిప్రాయం చెప్పిందిలే..!) కానీ నాకు మాత్రం సరదా సంగతి దేవుడెరుగు కానీ.. దెబ్బలు ప్రత్యక్షమయ్యేవి.

ఇది నాకు సమస్యగా అనిపించేది కూడా దెబ్బల దగ్గరే..! ఎలా అంటారా..?  క్లాసులో ఎపుడైనా సార్ లేరంటే.. లీడర్ ని నిల్చోబెడతారా.. వాళ్లు అల్లరి చేసిన వాళ్ల పేర్లు బోర్డు మీదో.. పేపర్ మీదో ఎక్కించే వాళ్లు. సార్ వచ్చాక ఆ పేర్లు చూసుకుంటూ ఒక్కొక్కరినీ లేపి కొట్టేవారు. క్లాసులో అనూషాలిద్దరమున్నామా.. అదేంటో కానీ.. ఎవరి తప్పైనా దెబ్బలు నాకే పడేవి.  నేనేమో నేనెప్పుడు మాట్లాడానబ్బా.. అన్న డైలమాలోనో.. నేను మాట్లాడలేదే.. అని లీడర్ వంక చూస్తుంటానా.. ఈలోపే దెబ్బ పడేది.. చిన్నగా లీడర్ వచ్చి కాదని చెప్పేది (అంటే.. నేనేం అల్లరి చేయని బుద్దిమంతురాలిని కాదు కానీ.. దెబ్బలంటే భయం కాబట్టి లీడర్ ఉన్నపుడు మాత్రం చచ్చినా మాట్లాడేదాన్ని కాదు) .. ఇక అప్పుడు చెబితే ఏంటి? చెప్పకపోతే ఏంటి?

ఇక పరీక్ష పేపర్లు ఇచ్చేటపుడు పరిస్థితి మరీ దారుణం. పేరు చదివి కొట్టాకే పేపర్ ఇచ్చేవారు. తీరా చూస్తే అది నాది కాదు (నేనేదో బాగా  చదివేస్తానని కాదు కానీ.. అలా అని మొద్దునీ కాదు.. బాగానే  చదువుతుంది.. అనే బ్యాచ్ అన్నమాట). హతవిదీ... ఇలా ఎందుకు జరుగుతోందబ్బా.. అని నేను ఆలోచించుకుంటే.. అప్పుడర్థమైంది.. మరి నేనేమో మొదటి బెంచీలోనే కూర్చుంటానాయే.. అందుకే వడ్డన నాకు ఉండేది. అందుకే నా పేరుకు ముందు ఇంటిపేరు తప్పనిసరిగా పెట్టేదాన్ని..  నీరుకొండ అని.

ఇక అప్పటి నుంచి కొంచెం ఊపిరి పీల్చుకున్నా..! ఇదంతా ఒకెత్తయితే.. నా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఒక విచిత్రమైన సమస్య ఎదురైంది మా కెమిస్ట్రీ సార్ రూపంలో.. ఆ సార్ ఒక జఠిలమైన పరీక్షే పెట్టారు నాకు. తక్కువ మార్కులు వచ్చినపుడు కొట్టడం మామూలే కదా.. కానీ నా విషయంలో ఏంటంటే.. ఇంకో అనూష కంటే ఒక్క మార్కు తక్కువ వచ్చినా నన్నే కొట్టడం. మరీ విచిత్రం ఏంటంటే.. ఒకసారి యూనిట్ పరీక్షలో నాకు 25కి 23 వచ్చాయి.. ఆ అనూషకు 24 వచ్చాయని తన్నులు తిన్నాన్నేను. నాకే ఈ బంపర్ ఆఫర్ ఎందుకు సార్ అని ఏడుస్తూ అడిగాన్నేను.. ఆయనేం చెప్పారో తెలుసా..? ‘నువ్వంటే అభిమానం అమ్మాయ్.. నువ్వు బాగా చదివి పైకి రావాలని..’అన్నారు.. ఇంకేం చెబుతాం సమాధానం.. ఆయన అభిమానానికి ఆనందించాలో.. తన్నులకు బాధపడాలో అర్థం కాలేదు నాకు..

ఇక పీజీలో..  మొదటి రోజే నా పేరుతో ఇంకొకరు లేరని రూఢీ చేసుకుని ఆనందించానా.. ఎంసీఏలో ఉంది. ఆ.. నేను ఎంబీఏ.. తను ఎంసీఏ కదా అనుకున్నా.. కానీ ఎంబీఏ అయినా.. ఎంసీఏ అయినా సీనియర్లు.. సీనియర్లే.. అని చెప్పి ఎంబీఏ, ఎంసీఏ సీనియర్లు కలిసి మమ్మల్నందరినీ ఒకేచోట కూర్చోబెట్టి ర్యాగింగ్ చేసేవారు (కానీ మేము మాత్రం ర్యాగింగ్ అనకూడదు తెలుసా.. ఇంటరాక్షన్ అనాలట..!). అప్పుడూ పోలికే.. ఏదో ఒకటి అనేవారు..(అంటే.. ర్యాగింగ్ రుచి చూపించేవారు) ఇకంతే నా కళ్లు వర్షించేవి..

ఇక లంచ్ టైంలో క్యాంటీన్ లో.. సాయంత్రం బస్సుల్లో.. సరే సరి. నా ఫ్రెండ్స్ అనూ.. అని పిలిచే వారు.. తన ఫ్రెండ్స్ తననూ అనూ పిలిచేవారు. ఎవరు పిలిచినా నా పేరే అనిపిస్తుంది కదా.. నేను పలికేదాన్ని.. వాళ్లేమో.. నిన్న కాదు అనూని అనేవారు.. మరి నేనేంటో..! పైగా ఒక ఒప్పందం.. నేను అనూషట.. తనేమో అనూ అట...!  మళ్లీ సీనియర్స్ దగ్గర షరామామూలే.. అదే గందరగోళం..

ఈ విధమైన అనూషల, నా ఏడుపు ప్రస్థానం నా చదువు పూర్తయేంతవరకూ కొనసాగింది. ఇంట్లో అమ్మ చేతిలో మాత్రం తన్నులు తినకుండా ఎందుకుండాలనేమో.. ఆఖరుకి మా అత్త కూతురి పేరూ అనూషానే. వాళ్లదీ మా ఊరే.. మా ఇంటి దగ్గరే..!

ఇలా నా పేరే నా శత్రువై.. ఎప్పుడూ నన్ను బాధపెట్టేది.. అందుకే నా పేరును నేను తిట్టుకోవడంలో తప్పు లేదు కదూ..! కానీ నా పేరుకు రెండు అందమైన అర్థాలున్నాయి.. 1. అందమైన ఉదయం 2. ఉదయం సూర్యుడి నుంచి వచ్చే లేత కిరణాలు.. అనీ..

Tuesday 4 February 2014

‘ఈనాడు’లో నా పుస్తక సమీక్ష

పొడిచే పొద్దు’ కథాసంకలనం ఈ మధ్యే విడుదలైంది. రచయిత్రి కన్నెగంటి అనసూయ.

ఈ పుస్తకంపై నేను రాసిన సమీక్ష ఈనాడు ఆదివారం (ఫిబ్రవరి 2) సంచికలో ప్రచురితమైంది.

దానిని కింద చూడొచ్చు..

 

Wednesday 22 January 2014

నా లెక్కల కష్టాలు..


 నా చిన్నపుడు ఏ క్లాస్ లో నా పేరు వినిపించినా వినిపించకపోయినా... మ్యాథ్స్ క్లాస్ లో మాత్రం నా పేరు తప్పకుండా వినిపించేది.. అనూష... అని.. ఎప్పుడో ఓరోజు అనుకుంటున్నారేమో... రోజూ...................... ‘అనూష.. లే.. ఇది చెప్పు.. లేకపోతే.. ఆ సూత్రం చెప్పు.. అని’ అప్పుడందరూ నా వైపు అలానే చూసేవారు.. నా సమాధానం కోసం.. ఇంతకీ నన్నే ఎందుకు అడిగేవారో తెలుసా...

నేనే మ్యాథ్స్ లో టాపర్.. అంటే.. కింద నుంచి ఫస్ట్ (ఇది కేవలం ఏడో తరగతి వరకే... ఆ తరువాత నా కంటే జెట్టీలు ఉన్నారులే.. ) .. ప్రతి క్లాస్ లో ఎందుకు లేపేవారంటే.. నాకు ఏ క్లాస్ లోనూ నిద్ర వచ్చేది కాదు కానీ.. ఆ మ్యాథ్స్ క్లాస్ లో మాత్రం జోల పాడినట్టుగానే వచ్చేది.. అందుకే నన్నే లేపేవారు.. నేను వినని దానికి సమాధానం  చెప్పమంటే.. నేను మాత్రం ఎక్కడి నుంచి చెబుతాను చెప్పండి.. అందుకే.. వెంటనే బోర్డు వైపు చూసేదాన్ని.. మా సారేమో.. బోర్డుకు అడ్డంగా నిల్చోవడమో.. లేదా మొత్తం చెరిపేయడమో చేసేవారు. ఇంకేం చేస్తాను.. నాకొచ్చిన బ్రహ్మవిద్య.. తల అడ్డంగా ఊపడం. అదే చేసేదాన్ని.. ఆ సార్ కి కోపం వచ్చి నాకు ఒకటి తగిలించడమో.. సరిగా విను అని గద్దించడమో చేసేవారు.

ఇదంతా గోలెందుకులే రోజూ ఎలాగైనా క్లాస్ విందాం అనుకుని పట్టుపట్టి నిద్ర ఆపుకుంటూ వినడానికి ప్రయత్నిస్తానా.. అదేంటో.. బోర్డు వైపే చూస్తుంటా కానీ.. ఒక్కముక్క బుర్రకెక్కదు. మా సారేమో.. లెక్క ‘విన్నారుగా.. సొంతంగా చేయండి’ అని చెరిపేసేవారు. అసలు బుర్రకెక్కనిది ఇక నోట్సుకేం ఎక్కించను? తరువాత ఎవరిదానిలోనైనా ఎక్కించుకోవచ్చులే అని ఖాళీ పేజీలు వదిలి వేరే లెక్కలోకి వెళ్లేదాన్ని.. లేదా.. సార్ క్లాస్ చెబుతున్నపుడే లెక్కలు ఎక్కించేసేదాన్ని..

ఇదంతా ఒకెత్తయితే.. రెండు రోజుల్లో నోట్సులు చూస్తా అనేవారు సార్.. ఇక అప్పుడు మొదలయ్యేది నా టెన్షన్. నోట్సు చూస్తే.. అన్నీ ఖాళీ పేజీలే.. పోనీ ఎవరి నోట్సైనా తీసుకెళ్లి ఇంట్లో పూర్తి చేద్దామంటే.. లెక్కలంటే అమ్మ పక్కన కూర్చుంటుందేమో అనే భయం. చూడకపోతే ఏం లేదు. చూసిందా... ఇకంతే.. ఎందుకు ఎక్కిస్తున్నావ్.. దానికి ఈ సూత్రాన్నే ఎందుకు వాడాలి? ఇలా ప్రశ్నలేస్తుంది.. అబ్బా... క్లాసులోనే అంటే.. ఇంట్లోనూ ఇదే గొడవా.. అందుకే మా అమ్మ లెక్కలు గురించి మాట్లాడినప్పుడల్లా.. క్లాస్ లోనే చేయించేశారమ్మా.. అని చెప్పి వేరే సబ్జెక్టు చదవేదాన్ని తప్ప లెక్కలసలు ముట్టుకునేదాన్నికాదు..

అసలు నా సమస్య ఏంటంటే.. అమ్మ లెక్కలు బాగా చేస్తుంది. చెబుతుంది కూడా. ఆ  చెప్పేటప్పుడే అసలు చిక్కంతా. చెప్పేది చెప్పకుండా తప్పు చేసినపుడల్లా ఒకటి వేయడమో.. గిచ్చడమో చేసేది. అందుకే వేరే పరీక్ష ఉందనో.. ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేదాన్ని. ఏ సబ్జెక్టు మార్కులిచ్చినా ఎన్నొచ్చాయబ్బా.. అని చూసుకునే నేను లెక్కల్లో మాత్రం పర్లేదు అనేలా వచ్చాయా లేదా అని చూసుకుంటుండేదాన్ని.. లేదంటే తన్నులు తినాలాయే..!

ఎలాగోలా పదో తరగతికి వచ్చా.. తొమ్మిదిలోనే క్లాసులు మొదలు పెట్టారు.. ఇవి చదవాలో.. అవి చదవాలో అర్థం కాని పరిస్థితిలో మేముంటే.. మా మ్యాథ్స్ సార్ ఓ వారం రోజులు లెక్కలు చెప్పి ఎగ్జామ్ అన్నారు.. సరేలే ఏదోలా కానిచ్చేద్దాం.. అని ముందు రోజు కష్టపడి లెక్కలు చేశా.. ఇంట్లోనే.. అమ్మ సహాయంతో.  ఎందుకంటే ఈ పరీక్షలో ఫెయిల్ అయితే సెక్షన్ మారుస్తా అన్నారు మరి. (చదివే వాళ్లందరూ A, Bల్లోనూ.. మొద్దులందరూ Cలోనూ వేసేవారు. అంటే వాళ్లకి స్పెషల్ క్లాసులుంటాయన్న మాట. వాళ్లకి ప్రత్యేకమైన కర్రలు కూడా ఉండేవి ఉతకడానికి..) క్వశ్చన్ పేపర్ ఇచ్చారు..

మొత్తం 5 లెక్కలు. అందరినీ ఎక్కడెక్కడో కూర్చోబెట్టారు. నేను మా క్లాస్ లోనే కూర్చున్నా.. హమ్మయ్య.. 4 లెక్కలు వచ్చు.. అనుకుని సంతోషంగా చేస్తుంటే.. నా పక్కనమ్మాయి.. ప్లీజే.. చూపించవా.. అని అడిగింది. లెక్కలు రాని వాళ్ల కష్టాలు నాకు తెలుసు కదా! జాలేసి చూపిస్తుంటే.. సార్ వస్తున్నారని పేపర్ లాక్కుంది. అమ్మో.. సార్ అని నేనూ అరవకుండా ఉండి.. నాలుగో లెక్క కూడా చేసి కూర్చున్నా.. తనెప్పుడు పేపర్ ఇస్తుందా.. అని. రాని లెక్కని ఆలోచిస్తున్నట్టు భంగిమ పెట్టి.. ఏదో గుర్తొస్తున్నట్టు రాస్తుంటే.. సార్ నన్ను లేసి వేరే చోట కూర్చోమన్నారు.

సార్ వెళ్లమన్నారు పేపర్ ఇవ్వమంటే ఇస్తా.. ఇస్తా.. అంటుంది.. కానీ ఎంతకీ ఇవ్వదు. సారేమో వచ్చి తొందరగా వెళ్లు అంటే వెళ్లి కూర్చున్నానా.. చివరి 10 నిమిషాలు.. అన్నారు.. ఇకంతే.. గుండెల్లో బాంబు పేలినట్టయింది నాకు. ఆ అమ్మాయేమో శుభ్రంగా ఎక్కించుకుని కూర్చుంది నాకేమీ తెలీదన్నట్టు.. సర్లే నేను చేసినవేగా అనుకుని మళ్లీ మొదలుపెడితే కంగారులో లెక్క సరిగా రాదు. మొత్తానికి ఏదో చేశానులే అనిపించి ఇస్తే.. 20 మార్కులు రావాల్సిన నాకు 15 వచ్చాయి. (ఒక్కదానికే 5/5 వచ్చాయి.. మిగతా వాటికి 1/2, 1 1/2 ఇలా కోత పడింది). ఇక సార్ 15 కంటే తక్కువ వచ్చిన వాళ్లందరూ సీ సెక్షన్ అన్నారు. నాకేమో 15 వచ్చాయాయే.. అంటే నేనూ వెళ్లాలా.. ఇందులోనే ఉండాలా? ఇదో సందేహం.. ఆ అమ్మాయి వైపు కోపంగా  ఒక లుక్కేసి కళ్లలో నీళ్లు తిరుగుతుంటే లేచి నిల్చున్నా.. అప్పుడు మా సార్ 15 కంటే తక్కువ వచ్చిన వాళ్లే.. 15 వచ్చిన వాళ్లు ఇక్కడే ఉండండి అన్నారు.. ఆ క్షణంలో  మా మ్యాథ్స్ సార్ నాకు నిజంగా దేవుడిలా కనిపించారు. అందుకే టెన్త్ లో మాత్రం కొంచెం కష్టపడి చేశా..

మళ్లీ అంత మంచి సార్ ఇంటర్లో దొరుకుతారో లేదో.. నేను సరిగ్గా వింటానో లేదో.. అన్ని సార్లు అదృష్టం మన తోడుగా ఉండదులే అనుకుని బైపీసీ తీసేసుకున్నా..! అదేంటో విచిత్రం ఫిజిక్స్, బోటనీల్లోనూ లెక్కలుండేవి.. చిరాకుగా.. ! అయినా మ్యాథ్స్ సార్ చెబితేనే అర్థం కానివి బోటనీ సార్ చెబితే మాత్రం  అర్థమవుతాయా.. !

Wednesday 8 January 2014

ఏ క్షణం వీడని స్నేహమై నువ్వుండగా..

యువతకు కొంత ప్రోత్సాహాన్ని ఇస్తే వారు తమ కలల తీరాలను తప్పక చేరుకుంటారు.  వారు తమ ఆశయాలను స్కూలు స్థాయిలోనే ఏర్పరచుకుంటున్నారు. దానికి అనుగుణంగానే  ప్రణాళికలను వేసుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు.

Possessiveness  లఘుచిత్రం తీసిన బృందాన్ని చూస్తే అది నిజమనిపిస్తుంది.


 ఇది నాకు బాగా నచ్చిన ఒక లఘుచిత్రం (Short film). MR.ప్రొడక్షన్స్ దీన్ని తీశారు. ఆసక్తికర అంశం ఏమిటంటే..  దీనిలో నటించినవారే కాదు.. దర్శకుడు, పాట రచయిత, దాన్ని కంపోజ్ చేసినవారు, పాటపాడినవారు అందరూ యువకులే.  వీరంతా చదువుకుంటున్న వారో.. అప్పుడే చదువు పూర్తి చేసినవారో.. ఎవరికీ సినిమా నేపథ్యం కూడా లేదు. కానీ అందరినీ ఆకట్టుకునేలా తీశారు. ఎన్నో లఘుచిత్రాలున్నా.. వీరిది మాత్రం ప్రత్యేకం.
 

చిత్రం పూర్తి నిడివి 16 నిమిషాలు. దీనిలో బాగా ఆకట్టుకునే అంశం పాట. దాన్ని పాడిన విధానం, కంపోజింగ్  చాలా హాయిగా ఉంటుంది.

సినిమా తీసిన విధానం కూడా పాటపై ఆసక్తికి కారణమవచ్చు.. మూసధోరణిలో సాగిపోయే సినిమాలకు, పాటలకు భిన్నంగా ఉంటుంది. లిరిక్స్ కూడా చాలా చిన్న పదాలతో పొందికగా ఉంటుంది.

పాడినవారు- దివ్య దివాకర్, సుభాష్ నారాయణ్. లిరిక్స్-దినేష్.. 

పాట సాహిత్యం ఇదిగో..

ఏ క్షణం వీడని స్నేహమై నువ్వుండగా..
కాలమే ఈర్ష్యగా చూసిన జతే మనం.
సంతోషాల సాగరం తాకే ప్రేమ తీరమే..
నీవే ఉంటె తోడుగా ఎందుకో....!

చ: ఎందరీ మధ్యనా నేనిలా ఉన్నా మరి..
ఒంటరీ నేనురా నీవు నా లోకమవ్వగా.
నన్నే నీడై వెంటాడుతున్న రూపం నీవేగా..
వందేళ్లయిన జీవితం వచ్చే నీలి మేఘమై..
వర్షించే నీ ప్రేమనే ప్రేమగా...!  "హాయిగా"

(2)

హాయిగా సాగనీ ప్రేమలో ప్రయాణమే..
నీ జతే చాలునే కోరను వరాలనే.
జన్మించాను ప్రేమలో నువ్వొచ్చాక వెంటనే..
గుర్తే రాదు నా గతం ప్రియతమా..!

చ: కోరినా పిచ్చిగా ప్రేమనీ కన్నీళ్ల లో..
బాధనే బందువే చేసినా ఇంతకాలము.
నన్నే నేను ప్రశ్నించుకున్నా ప్రేమ సాక్షిగా..
మన్నించమ్మ నేస్తమా విన్నా మౌనం మాటనే..
అందిస్తా నా ప్రాణమే ప్రేమగా...!!

హాయిగా సాగనీ ప్రేమలో ప్రయాణమే..
ఎన్నడూ వీడని బంధమై వెయ్యేళ్లిలా..!!


పాట ఇక్కడ చూడండి....

<object width="560" height="315"><param name="movie" value="//www.youtube.com/v/Dw0bN3nOl7s?version=3&amp;hl=en_US&amp;rel=0"></param><param name="allowFullScreen" value="true"></param><param name="allowscriptaccess" value="always"></param><embed src="//www.youtube.com/v/Dw0bN3nOl7s?version=3&amp;hl=en_US&amp;rel=0" type="application/x-shockwave-flash" width="560" height="315" allowscriptaccess="always" allowfullscreen="true"></embed></object>

Wednesday 1 January 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు..!!

దిలో మెదలాడిన మధురానుభూతులు కొన్ని..
కళ్లు చెమర్చేలా చేసిన కష్టాలు మరికొన్ని..
వీటన్నింటి సమ్మేళనంతో వీడ్కోలు  చెబుతోంది పాత సంవత్సరం..!
గత అనుభవాలను పాఠాలుగా చేసుకుని..
ముందుకు సాగమని ఆహ్వానిస్తోంది కొత్త సంవత్సరం..!

ఈ నూతన సంవత్సరంలో చిగురులు తొడిగిన ఆశలన్నీ తీరాలనీ.. ఆశయాలను చేరుకోవాలనీ.. మనస్ఫూర్తిగా కోరుకుంటూ..


నూతన సంవత్సర శుభాకాంక్షలు..!!
 





‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...