Sunday 26 July 2015

‘సారంగ’లో నా వ్యాసం........

'హమారీ అదూరీ కహానీ' అంటే.. పూర్తవని కథ అని అర్థం.  

ఎప్పటినుంచో రాయాలనుకుని, పూర్తి చేయలేకపోతున్న నా వ్యాసాన్ని పూర్తి చేసేలా చేసింది

ఈ సినిమానే!

అర్థం కాలేదు కదూ..! అయితే.. ఈ లింక్ ను చదవండి... 

వెబ్ సైట్ ఇప్పుడు అందుబాటులో లేదు. అందుకే దానిలో ఉన్నదాన్ని కింద పోస్ట్ చేస్తున్నాను.



పాటకోసం చూశాను.. మాటలు వెంటాడాయి
- నీరుకొండ అనూష

నాకు ఏదైనా అనిపిస్తే బాధైనా, సంతోషమైనా సరే! ఎందుకో తెలియదు కానీ కారణాన్ని రాయాలనిపిస్తుంది. అలా రాతరూపంలో చూసుకుంటే ఏదో తెలియని సంతృప్తి. ఇలా ఏదో ఒకటి రాస్తూ ఉంటే.. రైటింగ్స్కిల్స్(రాత నైపుణ్యాలు) కూడా పెరుగుతాయనే ఉద్దేశం. అయితే కొద్ది కాలంగా ఏదో ఒకటి రాద్దామనుకున్నా.. ఏదో కారణంగా అది ఆగిపోవడమో, సగంలోనే ఆపేయడమో జరుగుతోంది. కానీ ఇప్పుడు కచ్చితంగా రాసితీరాలి అనే ఆలోచన కల్పించింది- 'హమారీ అదూరీ కహానీ' సినిమా.

మామూలుగా అయితే నేను సినిమా విశ్లేషకురాలిని కాదు. సాంకేతిక నైపుణ్యం, కథ ఇవన్నీ విశ్లేషించడమూ రాదు. ఒక సగటు ప్రేక్షకురాలినంతే! సినిమా నచ్చింది, నచ్చలేదు. ఫలానా చోట హీరో బాగా చేశాడు, లేదా ఫలానా ఆరిస్ట్ఇలా చేసుంటే బాగుండేది వరకు మాత్రం చర్చించుకోగల పరిజ్ఞానం ఉందనుకుంటున్నా. అయితే ఈ సినిమా మాత్రం అక్కడితో ఆపేయాలనిపించలేదు. బహుశా ఎక్కువ అంశాలు నాకు నచ్చడమే కారణమేమో!

నాకు నచ్చిన అంశాలను చర్చించే ముందు స్థూలంగా కథను చూస్తే..

ఒక ముసలావిడ, పేరు వసుధ (విద్యాబాలన్) ఒక ప్రదేశంలో బస్సు దిగడంతో సినిమా మొదలవుతుంది. కొన్ని అడుగులు కష్టంగా వేసిన తరువాత పడిపోతుంది. తరువాత ఆమె చనిపోయినట్లుగా.. ఆమె అంత్యక్రియలు జరిగినట్లుగా చూపిస్తారు. మరోవైపు ఆమె భర్త హరి (రాజ్కుమార్యాదవ్) సైకియాట్రిస్ట్దగ్గర తన భార్య తన దగ్గరకు వచ్చిందని.. ఏదో అడిగివెళ్లిపోయిందనీ చెబుతుంటాడు. ఆమె చనిపోయిన విషయాన్ని హరికి తెలియజేయడానికి అతని కోడలు తన దగ్గరకు వస్తుంది. ఆమె అస్థికలను తండ్రి చేతులమీదుగా నిమజ్జనం చేయించడం కొడుకుకు ఇష్టం ఉండదు. కానీ హరి మాత్రం ఆమె అస్థికలను దొంగిలించి, కొడుకు కోసం ఒక డైరీని వదిలిపెడతాడు. దీంతో కథ ప్లాష్‌బాక్లోకి వెళుతుంది.

వసుధ ఒక హోటల్లో పూలు అమర్చే ఆవిడగా చేస్తుంటుంది. భర్త తనను వదిలేసి ఎక్కడికో వెళతాడు. కొడుకుతోపాటు ఆమె అతని కోసం అయిదేళ్లుగా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఆరవ్రూప్‌రెల్(ఇమ్రాన్హష్మి) పరిచయం అవుతాడు. అతను గ్రూప్ఆఫ్హోటల్స్‌కు యజమాని. ఆమె పని చేస్తున్న హోటల్‌ను కొనాలనుకుంటాడు. అందుకుగానూ అక్కడ పనిచేసేవారిని పరీక్షిస్తాడు. అప్పుడు వసుధ నిజాయతీ అతనికి నచ్చుతుంది. దీంతో ఆరవ్తన దుబాయ్లోని హోటల్లో పనిచేయడానికి ఆమెకు ఆఫర్ఇస్తాడు. భర్త కోసం వేచిచూస్తున్నందువల్ల తను దానిని తిరస్కరిస్తుంది. అయినా ఆరవ్ఆమె ఎప్పుడైనా ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చని చెబుతాడు. సరిగా అపుడే పోలీసుల ద్వారా తన భర్త అయిదుగురు అమెరికన్జర్నలిస్టులను చంపాడనీ, అతనో టెర్రరిస్టనీ తెలుస్తుంది. దీంతో కొడుకు భవిష్యత్తు కోసం దుబాయ్వెళుతుంది. అక్కడ వసుధ, ఆరవ్లు ప్రేమలో పడతారు. పెళ్లికూడా చేసుకోవాలనుకుంటున్న క్రమంలో తిరిగి హరి వచ్చేస్తాడు. తను నిర్దోషినని చెబుతాడు. వసుధ తన ప్రేమ కథను చెబుతుంది. వారిద్దరి మధ్య గొడవ జరుగుతున్నపుడు పోలీసులు హరిని అరెస్ట్చేసి తీసుకెళతారు. హరి వసుధను ఎలాగైనా ఆరవ్ తో కలవకుండా చేయడం కోసం కోర్టులో నేరాన్ని తనపై వేసుకుంటాడు. కానీ అందరి ముందూ మాత్రం వసుధ ఆనందం కోసం ఈ పని చేస్తున్నట్టుగా చిత్రీకరిస్తాడు. అయితే వసుధ కోరిక మేరకు హరిని విడిపించడానికి ఆరవ్ప్రయత్నిస్తాడు. అయితే హరిని ఆరవ్విడిపిస్తాడా? చివరికి ఆరవ్, వసుధ కలుస్తారా అన్నది మిగిలిన కథ.

కథను ఈ విధంగా చూస్తే మాత్రం దీనిలో కొత్తగా ఏముందిలే అనిపిస్తుంది. కానీ చూపించిన విధానం, చెప్పిన విధానం కొత్తగా తోచాయి.

విద్యాబాలన్జాతీయ అవార్డు గ్రహీత (డర్టీ పిక్చర్), మంచి నటి అని తెలుసు . అది కూడా వార్తా పత్రికల కథనాల ద్వారానే. ఆమె సినిమాలు నేను పెద్దగా చూడలేదు. డర్టీ పిక్చర్కొద్దిగా మాత్రం చూశానంతే. అయితే వసుధగా ఆమె పాత్ర మాత్రం కంటనీరు తెప్పించకుండా ఉండదు. ఇక హీరో- ఇమ్రాన్హష్మిపై నాకు అంత మంచి అభిప్రాయం కూడా లేదు (నటన విషయంగా). అందుకు ఆయన తీసిన సినిమాలే కారణమై ఉండొచ్చు. లేదా నటన కంటే వేరే అంశాలకే అతను ప్రసిద్ధమవడమూ కారణమవచ్చు. అయినా నేను ఈ సినిమాను చూడడానికి కారణం మాత్రం సినిమాలో 'మై జానె యే వారు దూ..' పాటే.

ఇక సినిమా విషయానికొస్తే.. మొదట ఆకట్టుకున్నది- పూలు అమర్చిన తరువాత హీరో మీకు మీ వృత్తిలో నచ్చనిది ఏది అని హీరోయిన్‌ను అడుగుతాడు. అపుడామె.. 'పూలు చెట్లకు ఉన్నపుడే వాటికి అందం, వాటిని మనం సరిగా ఆస్వాదించేది కూడా అపుడే. వాటిని ఎవరి ఆనందం కోసమో, దేవుడి కోసమో తెంపడం నచ్చదు. కానీ ఈ వృత్తే నాకు అన్నం పెడుతోంది..' అని చెబుతుంది. ఎంత నిజమో కదా!

తరువాత దుబాయ్‌లో.. హీరో ఒక గార్డెన్ను చూపిస్తూ.. 'దీనిని ఇంత అందంగా తీర్చిదిద్దినా ఏదో వెలితిగా ఉంది. దీనికేమైనా పరిష్కారం చెప్పగలవా?' అని అడుగుతాడు. దానికి ఆమె..'ఇక్కడ చాలా అందమైన పూలున్నాయి. నిజమే.. కానీ, కృత్రిమతే దీనికి వెలితి. ఒక తోటైనా పూలైనా అందంగా కనిపించాలంటే సహజసిద్ధంగా ఉండాలి. దీనిలో అదే లోపించింది. మొక్క అన్నాక ఎండిన ఆకులు, పూలుండడం సహజం. అవే లేనపుడు ఎంత అందమైన పూలను పెట్టినా దాని అందం తెలియదు' అని చెబుతుంది. ఇక్కడ అందం తెలియాలంటే దానిపక్కన అందవిహీనమైనది ఉండాలన్నది కాదు నా ఉద్దేశం. సృష్టిలో ప్రతి దానికీ ఓ అందం ఉంటుంది. కానీ అద్భుతమనో, అత్యద్భుతం అనో మనమనాలంటే.. అసలు అది కనిపించడానికీ, అనిపించడానికీ తగిన వాతావరణం ఉండాలి కదా! అనిపించింది. అలా నాకు ఆ సంభాషణ నచ్చింది. నిజానికి చూసే మనసుండాలే కానీ ఎండిన ఆకులోనూ ఎంతందం?!

అన్నట్టూ చెప్పడం మరిచాను.. ఈ సినిమాలో అమల అక్కినేని హీరో తల్లిగా నటించారు. అసలు కథ మలుపు తిరగడంలో ఈమెదే ముఖ్య పాత్ర. ఒకరకంగా ఈమెదీ, వసుధ పాత్రదీ ఒకే నేపథ్యం. బహుశా హీరోకి హీరోయిన్నచ్చడానికి ఇదీ ఒక కారణమై ఉండొచ్చనిపిస్తుంది.. బాగా ఆలోచిస్తే! హీరోయిన్తో సంభాషణలో ఒక మాటంటుంది.. 'ప్రతి అమ్మాయికీ మన దేశంలో సీతలా ఉండమని చెబుతారు. సహనంతో, సౌశీల్యంతో ఉండాలంటారు. కానీ రాధలా ఉండమని ఎవరూ చెప్పరు.. రోజూ రాధకృష్ణులకు పూజలు చేసినా! ' అంటుంది. 'భర్త ఎన్ని బాధలకు గురిచేసినా.. ఓర్చుకోవాలంటారు.. కానీ ప్రేమ కరవైనపుడు దొరికిన దాన్ని అందిపుచ్చుకోమని ఎవరూ చెప్పరు.. ఎంత విచిత్రం! నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో.. బలవంతపు సీతలానా.. నచ్చిన రాధలానా?' అని అడుగుతుంది. ఉన్నది కొంచెం పాత్రే అయినా అమల పాత్ర చాలా నచ్చుతుంది. అంత బాగా నటించారామే.

వసుధ ఆరవ్గురించి తన భర్తకు చెప్పినపుడు.. అతను ఆమె తనను మోసం చేశావనీ, నా కోసం వేచి చూడలేదని తిడతాడు. నువ్వు అతనితో ప్రేమలో పడినపుడు నేను గుర్తుకు రాలేదా అని అడుగుతాడు.. అపుడామె.. 'నీ గురించి ఏం గుర్తుంచుకోవాలి? భర్త అనే అధికారంతో.. యజమాని పశువుపై వేయించినట్టుగా బలవంతంగా వేయించిన ఈ పచ్చబొట్టా? ' అని అడుగుతుంది. మళ్లీ చివర్లో.. 'నేను నీ దానినంటూ నా నుదుటిన బొట్టూ, మెడలో తాళి, చేతికి గాజులూ నీ పేరు పెట్టుకున్నావ్. మరి నా కోసమంటూ నీ దగ్గర ఏం పెట్టుకున్నావ్?' అంటుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా అంశాలు నచ్చుతాయి. నిజానికి ఈ సినిమాకు ప్రాణం ఈ సంభాషణలే. పెద్దగా బుర్రకు పనిపెట్టేలా కాకుండా.. మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. రాజూ సింగ్ సంగీతం సినిమాకు ప్రాణం. ఇంకోటి నేను గమనించిందేమిటంటే.. గత కొన్ని సినిమాలు చూస్తుంటే.. హీరో, హీరోయిన్ల మధ్య స్టెప్పులతో, హోరెత్తే మ్యూజిక్కంటే.. శ్రవణానందంగా, కథలో భాగంగా పాటలను జోడించడం బాలీవుడ్లో ఎక్కువగా కనిపిస్తోంది. మనవాళ్లు కూడా దీనిని అనుసరించాలని కోరుకునేవాళ్లలోనేనూ ఒకదానిని.

చివరగా ఇంకొక్కట్టుండి పోయింది.. పూలు. ఈ సినిమా మొత్తంలో ఆరిస్ట్లందరితో పోటీపడిన తెల్లపూలు. తెల్లని ఆరమ్లిల్లీస్. చాలా బాగుంటాయి. కథ ప్రారంభం, ముగింపు వీటితోనే ఉంటుంది.

'హమారీ అదూరీ కహానీ' అంటే.. పూర్తవని కథ అని అర్థం. కానీ ఈ సినిమానే ఎప్పటినుంచో రాయాలనుకుని, పూర్తి చేయలేకపోతున్న నా వ్యాసాన్ని పూర్తి చేసేలా చేసింది. మొత్తానికి పూర్తవని కథతో నా వ్యాసం ముగిసిందన్నమాట.


 

Wednesday 15 April 2015

జ్ఞాపకాల దొంతరలో........

ఇంటిలోంచి బయటకు అడుగుపెట్టగానే.. బాగా చల్లగా తాకింది గాలి. రానురానూ అది చలిగా మారింది. నిన్నా, మొన్నా పడిన వర్షాల కారణంగా అనుకుంటాను ఇంత చలిగా ఉంది. పైగా కొద్దిగా జ్వరం కూడా ఉండేసరికి ఇంకా చలిగా అనిపించి ఇక ముందుకు అడుగు వేయకుండా గబగబా ఇంట్లోకి నడిచాను.

చలికోటు వేసుకుని, ఇక ఫర్లేదులే అనుకొని బయటికి నడిచాను. వీధిలోకి వచ్చేసరికి సన్నని తుంపర మొహాన్ని తాకింది. చలికోటులో వెచ్చగా శరీరం, చల్లటి తుంపరలో మొహం భలే ఉందిలే.


తుంపర కాస్త పెరిగి సన్నటి చినుకులుగా మారింది. చినుకులు ఎక్కడ్నుంచి ఎలా పడుతున్నాయబ్బా (ఎప్పుడు వర్షం పడుతున్నా ఎలా పడుతున్నాయబ్బా అన్న సందేహం సైన్సు ఇలా అని  చెబుతున్నా దాన్ని పక్కకు తన్నిమరీ అలానే ఉండిపోయింది) అన్న సందేహం మనసులో పూర్తవకముందే, అసంకల్పిత ప్రతీకారచర్యలా కళ్లు ఆకాశం వైపుకు తిరిగాయి.

ఒక వాటర్ బాటిల్ కి చిన్న చిన్న రంధ్రాలు పొడిచి మధ్యలో ఒత్తుతుంటే ఎలా పడుతుందో (చిన్నపుడు అలా ఆడుకునేవాళ్లంలే. ముఖ్యంగా కొబ్బరి నూనె డబ్బాలను వాడేవాళ్లం) అలా కనిపిస్తుందే తప్ప, ఎక్కడి నుంచి పడుతుందో మాత్రం అంతుచిక్కలేదు. సన్నని ధారలా పడుతున్న చినుకుల గుంపు మాత్రం ఒక్కొక్కటిగా మొహం మీద పడుతూ చిట్లిపోతున్నాయి.

వర్షం మరింతగా పెరుగుతున్నట్టు అనిపించడంతో నడకలో కొద్దిగా వేగాన్ని పెంచాను. మామూలుగా అయితే వర్షంలో తడవడం నాకు చాలా ఇష్టం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. వర్షం సినిమా రాకముందు నుంచే నాకు ఈ ఆసక్తి ఉంది. ఆ సినిమా దర్శకుడే నన్ను కాపీ కొట్టుంటాడనే అనుమానం కొద్దిగా.. చాలా కొద్దిగా కూడా ఉంది. ఇంకో గమనికేంటంటే.. ఆ కథానాయిక.. అదేనండీ త్రిషకు ఉన్నంత పిచ్చి కూడా నాకు లేదు. ఏదో మొదట పడే  వర్షాలంటేనే చాలా ఇష్టం. తరచూ పడుతుంటే కాస్త చిరాకు. బురదలో గట్రా నడవాల్సి ఉంటుంది కదా! అదే మొదటి వర్షాలనుకోండి, వెచ్చగా ఉన్నపుడు చల్లని వాన చినుకులతో మనసుకు హాయి కలిగిస్తుంది. పైగా చినుకులు పడ్డపుడు వచ్చే మట్టి సువావాసన ఎంత ప్రత్యేకం!  



 వర్షం పెద్దగా మారేలోపు బస్ స్టాపుకి చేరుకున్నాను. హమ్మయ్యా.. అనుకుని గడియారం వంక ఒక చూపు వేసేసరికి బస్సు రావడానికి ఇంకా సమయముందని అర్థమైంది. ఆలోపు ఏం చేయాలా అని ఆలోచిస్తూ పక్కన చూస్తే.. చిన్నపిల్లలు ఇద్దరు నేను నిల్చున్న దగ్గర్లో షాపు రేకులపై నుంచి పడుతున్న ధారను చేత్తో అడ్డు పెడుతూ, అలా పెట్టడం కారణంగా వారి మొహంపై పడుతున్న చిందుర్లకు తెగ సంబరపడిపోతూ కనిపించారు. వాళ్లను అలా చూస్తుండగానే బస్సు రావడం ఎక్కి కూర్చోవడం జరిగిపోయాయి.

కిటికీ పక్క సీట్లో కూర్చున్నాను. వానలో ఆడాలనిపించింది.  చినుకులను పట్టుకోవడానికి చేయి బయటకు పెట్టి ఆడుతోంటే..  అకస్మాత్తుగా ఇందాకటి చిన్నపిల్లలు గుర్తుకొచ్చారు. వారితోపాటు నా బాల్యమూనూ! ఇక మనసు ఊరుకుంటుందా..? వద్దన్నా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి లాక్కెళ్లింది.

చిన్నపుడు ఎంత పెద్ద వర్షమైనా ఇష్టమే. అది బురదయినా, వరదయినా. ఇంటి వసారా చూరులోంచి వర్షపు నీరు ధారలా పడుతోంటే, వాటిల్లో చేయి పెట్టి ఆడుకోవడం, అమ్మ వస్తుందనిపించినపుడు ఏమీ తెలియని వాళ్లలా చటుక్కున చేతులు తీసేయడం. దొరికిపోతే నాలుగు తన్నులు తినడం. అయినా ఆగుతామా ఏంటి? ఆట ఆటే.

ఎలాగూ తొందరగా చీకటి పడుతుంది. పైగా వర్షమనగానే కరెంటు కూడా ఉండదు. కాబట్టి, సాయంత్రమవగానే చలిగా ఉందని మోకాళ్ల మీద కూర్చుని దుప్పట్లు చుట్టేసుకోవడం, వేడివేడిగా అమ్మ చేసి పెట్టిన గుగ్గిళ్లను తినడం. భలే ఉండేదిలే. మా చిన్నపుడైతే ఎంచక్కా వర్షాకాలమన్నాళ్లూ పెసలు, బొబ్బర్లు, చిక్కుళ్లు, బఠానీ, శెనగలు... ఇలా ఎన్ని రకాల గుగ్గిళ్లను వండిపెట్టేదో అమ్మ. ఇపుడవేమీ లేవనుకో.

ఇక స్కూలుకెళ్లేటపుడైతే ఆ సరదానేవేరు. ఎప్పుడు వెళ్లినా వెళ్లకపోయినా వర్షం వచ్చినపుడు మాత్రం తప్పకుండా వెళ్లేవాళ్లం. ఎలాగూ క్లాసులు జరగవు కాబట్టి టీచర్లు పిల్లలతో పాటలు పాడడమో, కథలు చెప్పడమో చేయించేవారు. ఎవరి దగ్గర ఏ టాలెంటు ఉందో తెలిసేది కూడా అప్పుడే మరి!
సాయంత్రం పనిమాల నీళ్లు ఉన్న గుంటల్లోనే నడుచుకుంటూ వచ్చేవాళ్లం. కాళ్లకు బురద అంటించుకుని రావడం అదో సరదా అపుడు.

తరగతులు ఎలాగూ జరగవు కాబట్టి హోంవర్కూ ఉండదు. రాగానే బట్టలు మార్చుకుని మళ్లీ దుప్పట్లలోకి దూరి, దీపపు వెలుగులో వేడివేడి అన్నం. ఆహా! అదేంటో అపుడు మాత్రం ఏ కూరయినా, పచ్చడయినా పళ్లెం దెబ్బకు ఖాళీ అయ్యేది. రాత్రిపూట అమ్మ, నాన్నల పక్కన చేరి (నానమ్మ, తాతయ్యలు నాకు లేరుగా. అందరూ నానమ్మా తాతయ్యలతో కూడా కథలు చెప్పించుకునేవారట. మా అమ్మమ్మ కూడా మాదగ్గర ఉండేది కాదు) కథలు చెప్పమని తెగ గోల చేసేవాళ్లం.  చెప్పిన కథలు చెబితే ఊరుకునే వాళ్లమే కాదు. మా చదువుల సంగతులు రానంతవరకూ వాళ్లను విసిగించి మరీ కొత్త కథలు చెప్పించుకునేవాళ్లం. అలా కథలు వింటూ ఎపుడు నిద్రపోయేవాళ్లమో. పొద్దున్నే స్కూలుకు వెళ్లేటపుడు ఏయే కథలు చెప్పించుకున్నామో చెప్పుకుంటూ వెళ్లేవాళ్లం.


ఇదంతా వర్షం పడేటపుడు సంగతైతే, ముసురు పట్టినపుడు, తుపానులపుడు విషయం మరోలా ఉండేది. ముఖ్యంగా ముసురు పట్టినపుడు వర్షమూ రాదు, ఎండా రాదు. కానీ పొద్దస్తమానం చల్లగా ఉంటుంది. స్కూళ్లోనూ పాఠాలు చెబుతారు. స్కూలుకు వెళ్లాలన్నా చిరాగ్గా ఉండేది. ఇంట్లోనూ మన గోల గురించి తెలుసు కాబట్టి చచ్చినా ఉండనివ్వరు. కానీ ఒక ఆశ మాత్రం ఉండేది. స్కూలుకి వెళ్లగానే ఈరోజు స్కూలు లేదుకానీ ఇంటికి వెళ్లండి అని చెబుతారేమో..! అని. ఆ మాట వింటే మాత్రం పరమానందంగా ఉండేది. ఒక్కోసారి మాత్రం పక్క స్కూళ్లను వదిలిపెట్టి మమ్మల్ని ఉంచడమో, లేదా అందరినీ వదిలిపెట్టి మాకు మాత్రం ప్రత్యేక తరగతి (స్పెషల్ క్లాసు) ఉందనో ఉంచేవారు అప్పుడు మాత్రం చెప్పిన  వాళ్ల మీద గొంతు వరకూ కోపం ఉండేది. వాళ్లు వదిలిపెట్టేవరకూ తీవ్ర అసహనాన్ని చూపించేవాళ్లం.


 ఇలా సాగుతున్న ఆలోచనలకు ‘చేరుకున్నాం. దిగాలని లేదా?’ అన్న స్నేహితురాలి మాటతో అడ్డుకట్ట పడింది.

బస్సులోంచి దిగి, చినుకుల్లో నడుస్తోంటే, చిన్నప్పటిలానే లోపలికి వెళ్లగానే.. ‘ఈరోజు ఆఫీసు లేదు. ఇంటికి వెళ్లండి’ అని చెబితే బావుణ్ణు అనకుంటూ లోపలికి అడుగు పెట్టాను. ఎవరూ అలా చెప్పలేదు. అయినా ఎందుకు చెబుతారు? జీతం ఇచ్చి పని చేయించుకుంటున్నపుడు వర్షం వచ్చిందనో, చలేస్తోందనో ఆఫీసు మూసేయరు కదా! అన్న విషయం స్ఫురణకు రాగానే కొంత బాధేసినా, చిన్న పిల్లలా చేసిన ఆలోచనకు మాత్రం చాలాసేపు నవ్వుకున్నాను.

Wednesday 25 March 2015

స్పందించిన హృదయానికి..

ఏవైనా బంద్ లు.. రాస్తారోకోలు జరిగినపుడు జనాలు ఇబ్బంది పడడం.. దాన్ని తిట్టుకోవడం మామూలే.


సామాజిక మాధ్యమాలు (సోషల్ మీడియా).. వచ్చాక దాన్ని బహిరంగంగా తిట్టడం.. ఈ బంద్ లు, రాస్తారోకోలు.. వాటి ఇబ్బందులు పంచుకోవడం మామూలైంది. కానీ 2012లో బాల్ థాకరే చనిపోయినపుడు మహారాష్ట్రలో బంద్ ప్రకటించడం.. దానిపై వ్యాఖ్యానించిన, లైక్ కొట్టిన ఇద్దరు విద్యార్థినులను అరెస్ట్ చేశారన్న వార్త అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

ఇలాంటి సంఘటనలు చాలా జరిగినా.. అందరికీ తెలిసొచ్చింది మాత్రం ఈ ఇద్దరి విషయంతోనే. ఇది విన్న తరువాత అన్యాయం అన్నవారూ ఉన్నారు. భయపడినవారూ ఉన్నారు. ఎందుకొచ్చిన గోల దేన్నైనా చదివి వదిలేయడం కన్నా ఉత్తమం లేదు అని వదిలేసిన నాలాంటి వాళ్లూ ఉన్నారు. 


కానీ అన్యాయం అని భావించి, దాని లోతుపాతులు తెలుసుకుని.. ప్రశ్నించాలనే ఆలోచన చేయడమే కాకుండా.. చివరి వరకూ పోరాడడమంటే నిజంగా అభినందనించదగ్గ విషయమే.


శ్రేయా సింఘాల్.. ఆ పనిచేసిన అమ్మాయి. అరెస్ట్ అయిన ఆ ఇద్దరు అమ్మాయిల విషయంలో సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది. చివరి వరకూ పోరాడి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్.. సెక్షన్ 66 ముసుగులో జరుగుతున్న  అన్యాయాలను ప్రశ్నించి, గెలిచింది.

అందుకే అంటారేమో.. చూసే కనుల కన్నా.. స్పందించే హృదయం మిన్న అని.

Thursday 12 March 2015

'తెలుగు వెలుగు'లో నా కథ..

ఫీసులో పనిచేసుకుంటున్నపుడు అకస్మాత్తుగా వచ్చిన ఆలోచనే ఈ నా కథ. ఆలోచన రాగానే మొదట దానిని వర్డ్ పాడ్ లో రాసేశాను. ఎందుకంటే.. వెంటనే రాయకపోతే నేను మరచిపోతాను. పైగా పేపర్ మీద నేను రాయలేను. సిస్టమ్ కు బాగా అలవాటు పడడమే కారణమై ఉండొచ్చు.


దీనిని ఒక రూపుకు తీసుకురావడానికి మాత్రం చాలా సమయం తీసుకుంది.


ఇక్కడ విచిత్రమైన సంఘటన ఏంటంటే.. నేను నా కథకు ‘మనసు బంధం’ అని పేరు పెట్టుకున్నాను. కానీ మా మిత్రులు శీర్షిక మరీ నేరుగా ఉంది, మార్చు.. అన్నారు. దాంతో ‘ఎదలో లయ’ అని పెట్టి ‘తెలుగు వెలుగు’కు పంపాను. విచిత్రమేమిటంటే.. తెలుగు వెలుగు వారు తిరిగి నా కథకు ‘మనసు బంధం’ అనే పెట్టారు. నేను పంపిన మెయిల్ ను తిరిగి చూసుకున్నాను. బహుశా రెండు పేర్లు పంపితే ఒకటి ఎంపిక చేశారేమోనని. కానీ ఎదలోలయ అనే ఉంది.


నా కథకు ఇదే సరిపోతుంది అని నేను మనస్ఫూర్తిగా పెట్టుకున్న పేరు.. తిరిగి వారి ద్వారా ఆ పేరుతోనే రావడం యాదృచ్ఛికమే అయినా చాలా ఆనందాన్నిచ్చింది.











Saturday 28 February 2015

జఫ్ఫా... తెలుసా?

జఫ్ఫా.. ఈ పదాన్ని వినని వారే ఉండరేమో!  కానీ దాని పేరుమీద పండ్లు.. కేకులు.. మ్యూజిక్ బాండ్.. క్లాక్ టవర్ ఇలా ఎన్నో ఉన్నాయి.. తెలుసా?


ప్పుడు ఎవరినోట విన్నా.. ఎక్కువగా వినపడుతోన్న పదం (వాడో జఫ్ఫాగాడు.. ఎక్కువగా ఈ పదం వినిపిస్తుంది) ఇది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా వాడడం చూడొచ్చు. అది సినిమా ప్రభావమే అనుకోండి. సినిమా కంటే కూడా బ్రహ్మానందం ప్రభావం అని చెప్పొచ్చు.

అసలు ఈ పదాన్ని ఆయనే వాడారా లేదా ఎవరైనా రచయిత రాశారా అని తెలుసుకోవాలని ఉండేది నాకు. దాని ఉచ్చారణే అందుకు కారణమై ఉండొచ్చు. పైగా దానికో అర్థం ఉండదని నాకు గట్టి అభిప్రాయం కూడా ఉండేది. అలా తెలుసుకునే ప్రయత్నంలో ఒక స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న విషయాలే ఇవి...!

అర్థం ఏంటంటే...

 

అర్బన్ డిక్షనరీ ప్రకారం.. జఫ్ఫా అంటే- నపుంసకుడు అని అర్థం.

మనం అంటే తెలుగు వాళ్లం- తెలివి తక్కువ వాడు అనే అర్థంలో వాడుతున్నాం. దీనికి అన్యాయం అనే అర్థం కూడా ఉంది.
జఫ్ఫా పేరుతో 2009లో ఒక ఇజ్రాయల్ సినిమా కూడా వచ్చింది. తెలుగులో 2013లో వచ్చింది (బ్రహ్మానందం ప్రధాన పాత్రగా వచ్చిన విషయం తెలిసిందే).

జఫ్ఫా తెలుగు సినిమా






 జఫ్పా.. ఆరెంజ్


వీటిని పాలస్థీనా రైతులు సాగు చేస్తున్నారు. షామౌటీ ఆరెంజ్ అని వీటికి మరో పేరుంది. 19వ శతాబ్దం మధ్యనుంచి వీటిని సాగు చేస్తున్నారు. చాలా తీయగా,  విత్తనాలుండకపోవడం వీటి ప్రత్యేకత.  చర్మం మందంగా ఉండడం కారణంగా ఎగుమతికి చాలా అనువుగా ఉంటాయట. ఈ నారింజలకు వాటిని మొదట పండించిన ప్రదేశం పేరు (జఫ్ఫా) ఆధారంగా జప్ఫా ఆరెంజ్ అని పేరు. ఈ రకం నారింజలను మధ్య ప్రాచ్యంలోని సిప్రస్, ఇరాక్, లెబనన్, సిరియా, జోర్దన్, టర్కీల్లోనూ పండిస్తున్నారు.


ఈ నారింజలు గుండ్రంగా, మందమైన చర్మం, ముదురు నారింజ వర్ణంతో ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి సాధ్యమయేలా ఉంటాయి.  అందుకనే ఎగుమతికి చాలా అనుకూలంగా ఉంటాయి.
రష్యా, అమెరికా వంటి చాలా దేశాల్లో వీటికి మంచి గిరాకీ. పాలస్తీనా రైతులు ఈ రకం నారింజలను 19వ శతాబ్దం మధ్యలో చైనా సినెసిస్ అనే తీపి నారింజ నుంచి అభివృద్ధి చేశారు.  

జఫ్ఫా.. ఇన్ స్టిట్యూట్..


ఈ సంస్థను 1982లో ఇజ్రాయెల్ లో స్థాపించారు. దీని అసలు పేరు ద ఇన్ స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇదో ప్రైవేటు, నాన్ ప్రాఫిట్, మల్టీ సర్వీస్ సోషల్ ఏజెన్సీ.


సౌత్ టెల్ అవైవ్, బాట్యమ్ లో చాలామంది తల్లిదండ్రులు, పిల్లలను సంరక్షించేవారు నిరుద్యోగులే. దీంతో పిల్లలకు సరైన శారీరక, మానసిక సంరక్షణ కరవైంది. చాలామంది పిల్లలు నిర్లక్ష్యానికీ, దాడులకు గురవుతున్నారు. మరికొందరు సంఘవిద్రోహులుగా మారుతున్నారు. దీంతో ఈ సంస్థ అలాంటి పిల్లల సంరక్షకులను, తల్లిదండ్రలను కలిసి, మాట్లాడి ఆ పిల్లల అవసరాలన్నింటినీ తీరుస్తోంది. తిండి దగ్గర్నుంచి ఎమోషనల్ కౌన్సెలింగ్, ఆరోగ్య సంరక్షణతోపాటు వారి విద్య విషయంగానూ ఈ సంస్థ సాయం అందిస్తోంది. సురక్షిత, భద్రతతోకూడిన బాల్యాన్ని అందించడమే ఈ సంస్థ లక్ష్యం.

జఫ్ఫా.. కేక్స్

 


బిస్కెట్ సైజులో ఉండే ఈ కేకులను మెక్ విటే అండ్ ప్రైస్ 1927లో యూకేలో ప్రవేశపెట్టారు.  వీటిలో జఫ్ఫా ఆరెంజ్ కేకులు ప్రసిద్ధమైనవి. రెండు పొరలుగా ఉండే స్పాంజి కేకుల మధ్యలో ఆరెంజ్ ఫ్లేవర్ జెల్లీని ఉంచుతారు. వీటన్నింటినీ కలుపుతూ పైన చాక్లెట్ కోటింగ్ ఉంటుంది. మధ్యలో ఉంచిన జెల్లీ కారణంగా వీటికి ఈ పేరు వచ్చింది.

 

 

ఆర్ట్స్ విభాగంలోనూ..


1.    జఫ్ఫా (2009)- ఓ ఇజ్రాయెల్ సినిమా, డైరెక్టర్ కెరెన్ ఎడాయా
2.  జఫ్ఫా (2013) - తెలుగు సినిమా, డైరెక్టర్- వెన్నెల కిషోర్
3.  జఫ్ఫా (స్టార్ గేట్)- ఎ ఫిక్షనల్ రేస్
4. జఫ్ఫా ఎంటర్ టైన్మెంట్- ఎ బ్రిటిష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ సంస్థ
 5. జఫ్ఫా రోడ్ (బ్యాండ్)- కెనడియన్ మ్యూజిక్ గ్రూప్
6. జఫ్ఫాస్ (కాండీ)- ఆరెంజ్ ఫ్లేవర్డ్ కాండీ ఇన్ కెనడా
7. జఫ్ఫా (సాఫ్ట్ డ్రింక్)- పాపులర్ ఇన్ స్కాండివేనియా


ఇవే కాదు సౌత్ ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జెరూసలెంలోనూ జఫ్పా పేరుతో ప్రదేశాలున్నాయి. జఫ్ఫా గేట్ మిల్, జఫ్ఫా క్లాక్ టవర్ ఇంకా మరెన్నో అదనంగా కనిపిస్తాయి.

జెరూసలెంలోని జఫ్ఫా క్లాక్ టవర్

జఫ్ఫా గేట్ మిల్..

 సో  ఇకనుంచి జఫ్ఫాని ఒక పదంగానో.. తిట్టుగానో తీసిపారేయలేమన్నమాట!  

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...