Thursday 29 January 2015

మళ్లీ కలుస్తా...

ఏదో ఆలోచిస్తూ వెళుతుంటే.. అతడు కనిపించాడు.


చూడగానే భయమేసింది.. వెంటనే తల పక్కకు తిప్పుకున్నాను. అతను మాత్రం తన పనేదో తను చేసుకుంటున్నాడు.

కొంచెం తల పక్కకు తిప్పి ఓరగా అతనివైపు చూశాను. నిండుగా నవ్వుతున్నాడు.

కొంచెం సేపు అతన్నే చూస్తూ ఉండిపోయా.. నా పెదవులపైనా చిరునవ్వు.. నాకే తెలియకుండా!

అరె.. ఎవరో ఆడుతున్నారు తనతో.. కాదు.. తనే ఎవరితోనో ఆడుతున్నట్టున్నాడు.

ఉడుకుమోతుతనం వచ్చేసింది నాలో.. ఎప్పటి నుంచో నేను తనను చూస్తుంటే.. కనీసం పట్టించుకోను కూడా లేదు కానీ.. వాళ్లెవరితోనో ఆటలాడుతున్నాడు.

కోపం వచ్చింది. బుంగమూతి పెట్టుకుని నిల్చుండిపోయాను. అరె.. అయినా పట్టించుకోడే!

తన ఆట తనదే..

నేను మాత్రం తక్కువ తిన్నానా? భయం ఎలాగూ కొంత తగ్గిందిగా.. తన దృష్టిలో పడడానికి అతని దగ్గరగా వెళ్లా..

ఊహూ.. స్పందనే లేదు.

ఇంకొంచెం దగ్గరికెళ్లి చూశా.. చిన్నగా నను తాకిన అతని స్పర్శ.

నాలో ఏదో చక్కిలిగింత.. కానీ ఏదో తెలియని భయం మళ్లీ ఆవరించింది. కానీ అతని స్పర్శ దాన్ని అధిగమించి నేను అతనికి మరింత చేరువ వెళ్లేలా చేసింది.

కొద్దిగా సంశయమున్నా అడుగులు మాత్రం ముందుకు సాగాయి. ఈసారి తను నన్ను చుట్టేశాడు. నాలో ఏదో పులకింత.. ఆనందం..

ఇంతసేపూ పట్టించుకోలేదన్న కోపం గుర్తొచ్చి మూతి బిగించినా.. తన అల్లరి ముందు నా పప్పులేం ఉడకలేదు. నేను దిగిరాకా తప్పలేదు.

నేనూ తనతోపాటు అల్లరి మొదలుపెట్టాను. పరిగెత్తాను. తనేమో నన్ను అందుకోవడానికి వెంటపడ్డాడు. అలా ఎంతసేపు ఆడామో..!

నాకిక అలుపొచ్చింది. కూర్చుండిపోయాను. తన అల్లరి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గనేలేదు.

చిన్నగా చీకట్లు కమ్ముకుంటున్నా.. పౌర్ణమి కావడంతో పెద్ద తేడా లేదు. కానీ.. ఆహా.. వెన్నెల కాంతిలో తను ఇంకెంత అందంగా ఉన్నాడు..?

ఆ కాంతిని తన చేతులతో తాగెయ్యాలా అన్నట్టుగా గెంతులేస్తున్నాడు. ఒక పక్క నన్ను స్పృశిస్తూనే.. అలసట అనేదే లేకుండా ప్రయత్నిస్తున్నాడు.. 

అలా అతన్ని చూస్తూనే ఉండిపోవాలనుంది. కానీ వెళ్లక తప్పదుగా.. అమ్మ పిలుపుతో తనకు వీడ్కోలుగా చేయి ఊపుతూ.. వెనుదిరిగాను.

వెళ్లొస్తాను.. కానీ మళ్లీ తప్పకుండా కలుస్తాను.. అని తనకు వీడ్కోలు చెప్పాను.

కాళ్లు ముందుకు పడుతున్నా..  తనను వదల్లేక నా మనసు బాధ పడుతోంది.

తను మాత్రం చెదరని ఆనందంతో.. అలుపన్నదే లేక తన ఎగసిపడే అలలతో చంద్రుని అందుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.



Tuesday 13 January 2015

ఇదేలే తరతరాల చరితం!

ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయి అంటే.. ఏమిటో ఇప్పుడర్థమవుతోంది. వీరిని చూశాక..!


ఒలింపిక్స్ లో పతకాలు రాకపోయినా మనం ఎందరినో ఆశగా పంపుతున్నాం. వచ్చిన కొద్ది వాటికే.. ఎంతో సంతృప్తి పడుతున్నాం.

రాని వాటికి బాధపడకపోయినా ఫర్లేదు కానీ, వచ్చిన వాళ్లనీ చిన్నచూపు చూడడం ఎంత వరకూ సమంజసం?

సీతా సాహూ (స్ప్రింటర్)

 

నిషా రాణీ దత్తా (ఆర్చరీ)

 

రష్మితా పాత్రా (ఫుట్ బాల్)

 

 నౌరీ ముందు (హాకీ).. 

 

పేర్లు తెలుసా? 

 

కనీసం విన్నట్టయినా అనిపించిందా..!


ఒకప్పుడు మనదేశానికి ప్రాతినిధ్యం వహించి, కీర్తిని సాధించిపెట్టారు. మరి వీరి ప్రస్తుత పరిస్థితేంటి?



సీతా సాహూ.. మధ్యప్రదేశ్ కు చెందిన ఈమె.. ఏథెన్స్ స్పెషల్ ఒలింపిక్స్ 2011లో 15 ఏళ్ల వయసులో 200, 1600 మీటర్ల పరుగు పందెంలో దేశానికి రెండు రజత పతకాలు సాధించింది. ఇప్పుడు ఆదరణ కరవై, జీవనోపాధి కోసం పానీపూరీ అమ్ముకుని జీవనం సాగిస్తోంది.




2006 బ్యాంకాక్ గ్రాండ్ ప్రిక్స్ లో రజత పతకం, 2007 తైవాన్ లో జరిగిన ఏషియన్ గ్రాండ్ ప్రిక్స్ లో బెస్ట్ ప్లేయర్ అవార్డ్, 2008 జార్ఖండ్ లో జరిగిన సౌత్ ఏషియన్ ఫెడరేషన్ చాంపియన్ షిప్ లో వెండి పతకం.. ఇవీ  ఆర్చరీ విభాగంలో నిషా రాణీ దత్తా సాధించిన పతకాలు.


ఇది ఒకప్పుడు. మరి ప్రస్తుతం.. ఆదరించేవారు లేక, శిక్షణ తీసుకోవడానికి స్థోమతలేక అజ్ఞాతంలో మిగిలిపోయింది. తన గురువు బహుమతిగా ఇచ్చిన విల్లును కూడా భారీ వర్షాలకు కూలిపోయిన తన ఇంటికోసం అమ్మేయాల్సి వచ్చింది.




రష్మితా పాత్ర.. 2008లో కౌలాలంపుర్, మలేసియాలో జరిగిన ఏషియన్ ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ అండర్ వుమెన్స్ విభాగంలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించింది. 2011లో గల్ఫ్ దేశమైన బహ్రైన్ లో సీనియర్ ఏఎఫ్.సీ క్వాలిఫయింగ్ రౌండ్ లో భారత్ విజయానికి తోడ్పడింది.

ఒరిస్సాకు చెందిన ఈ క్రీడాకారిణి ప్రస్తుతం పాన్ షాప్ ను నిర్వహిస్తూ.. ఉపాధి పొందుతోంది.


నౌరీ ముందు.. జాతీయ స్థాయిలో భారత్ హాకీ తరపున 19 సార్లు ప్రాతినిధ్యం వహించింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా బెస్ట్ హాకీ ప్లేయర్ గా అవార్డు అందుకుంది. ఇంకా ఎన్నో అవార్డులను అందుకుంది.

ప్రస్తుతం ఒక ఎన్జీవో సంస్థలో టీచర్. నెలకు రూ. 5000 జీతం.

మనదేశంలో క్రీడలకూ, క్రీడకారులకూ ఉన్న ప్రాముఖ్యం ఏంటో వీరిని చూస్తే అర్థమవుతోంది కదూ..! అలా అని.. అందరూ ఇలాగే ఉన్నారనుకుంటే.. పొరపాటే.

మరి వీళ్లకీ.. వాళ్లకీ తేడా ఏంటంటే.. సమాధానం డబ్బు. కొంచెం శిక్షణ ఇప్పించగల నేపథ్యం ఉన్నవారు ముందుకు సాగుతున్నారు. లేనివారు ఎవరి ప్రోద్బలంతోనైనా వెలుగులోకి వచ్చినా.. తరువాత సాయం కరవై ఇలా మిగిలిపోతున్నారు.

క్రికెట్ కు మనవాళ్లు చాలా ప్రాముఖ్యం ఇస్తారు. వాళ్లకి ఎన్నో సదుపాయాలు కల్పిస్తారు. వారు ఆడినా.. ఆడకపోయినా! అందరినీ అలా చూడకపోయినా.. కనీసం గౌరవం అయినా అందేలా చూడాలి కదా!

రాని వాళ్లని సానబెట్టి పతకాలు సాధించడానికి ప్రయత్నిస్తున్నపుడు.. ప్రభుత్వ సాయం లేకుండానే తనను తాను నిరూపించుకున్న వీళ్లను ఇకనైనా నిర్లక్ష్యం చేయకుండా, కనీసం  జీవనోపాధికి చేయూతనిస్తూ.. అర్హులకు మరింత రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుండు.

 లేదంటే.. భవిష్యత్తులో క్రీడలంటే.. డబ్బున్న వాళ్లకే అనే అభిప్రాయం నెలకొనడం ఖాయం.

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...