Thursday 29 January 2015

మళ్లీ కలుస్తా...

ఏదో ఆలోచిస్తూ వెళుతుంటే.. అతడు కనిపించాడు.


చూడగానే భయమేసింది.. వెంటనే తల పక్కకు తిప్పుకున్నాను. అతను మాత్రం తన పనేదో తను చేసుకుంటున్నాడు.

కొంచెం తల పక్కకు తిప్పి ఓరగా అతనివైపు చూశాను. నిండుగా నవ్వుతున్నాడు.

కొంచెం సేపు అతన్నే చూస్తూ ఉండిపోయా.. నా పెదవులపైనా చిరునవ్వు.. నాకే తెలియకుండా!

అరె.. ఎవరో ఆడుతున్నారు తనతో.. కాదు.. తనే ఎవరితోనో ఆడుతున్నట్టున్నాడు.

ఉడుకుమోతుతనం వచ్చేసింది నాలో.. ఎప్పటి నుంచో నేను తనను చూస్తుంటే.. కనీసం పట్టించుకోను కూడా లేదు కానీ.. వాళ్లెవరితోనో ఆటలాడుతున్నాడు.

కోపం వచ్చింది. బుంగమూతి పెట్టుకుని నిల్చుండిపోయాను. అరె.. అయినా పట్టించుకోడే!

తన ఆట తనదే..

నేను మాత్రం తక్కువ తిన్నానా? భయం ఎలాగూ కొంత తగ్గిందిగా.. తన దృష్టిలో పడడానికి అతని దగ్గరగా వెళ్లా..

ఊహూ.. స్పందనే లేదు.

ఇంకొంచెం దగ్గరికెళ్లి చూశా.. చిన్నగా నను తాకిన అతని స్పర్శ.

నాలో ఏదో చక్కిలిగింత.. కానీ ఏదో తెలియని భయం మళ్లీ ఆవరించింది. కానీ అతని స్పర్శ దాన్ని అధిగమించి నేను అతనికి మరింత చేరువ వెళ్లేలా చేసింది.

కొద్దిగా సంశయమున్నా అడుగులు మాత్రం ముందుకు సాగాయి. ఈసారి తను నన్ను చుట్టేశాడు. నాలో ఏదో పులకింత.. ఆనందం..

ఇంతసేపూ పట్టించుకోలేదన్న కోపం గుర్తొచ్చి మూతి బిగించినా.. తన అల్లరి ముందు నా పప్పులేం ఉడకలేదు. నేను దిగిరాకా తప్పలేదు.

నేనూ తనతోపాటు అల్లరి మొదలుపెట్టాను. పరిగెత్తాను. తనేమో నన్ను అందుకోవడానికి వెంటపడ్డాడు. అలా ఎంతసేపు ఆడామో..!

నాకిక అలుపొచ్చింది. కూర్చుండిపోయాను. తన అల్లరి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గనేలేదు.

చిన్నగా చీకట్లు కమ్ముకుంటున్నా.. పౌర్ణమి కావడంతో పెద్ద తేడా లేదు. కానీ.. ఆహా.. వెన్నెల కాంతిలో తను ఇంకెంత అందంగా ఉన్నాడు..?

ఆ కాంతిని తన చేతులతో తాగెయ్యాలా అన్నట్టుగా గెంతులేస్తున్నాడు. ఒక పక్క నన్ను స్పృశిస్తూనే.. అలసట అనేదే లేకుండా ప్రయత్నిస్తున్నాడు.. 

అలా అతన్ని చూస్తూనే ఉండిపోవాలనుంది. కానీ వెళ్లక తప్పదుగా.. అమ్మ పిలుపుతో తనకు వీడ్కోలుగా చేయి ఊపుతూ.. వెనుదిరిగాను.

వెళ్లొస్తాను.. కానీ మళ్లీ తప్పకుండా కలుస్తాను.. అని తనకు వీడ్కోలు చెప్పాను.

కాళ్లు ముందుకు పడుతున్నా..  తనను వదల్లేక నా మనసు బాధ పడుతోంది.

తను మాత్రం చెదరని ఆనందంతో.. అలుపన్నదే లేక తన ఎగసిపడే అలలతో చంద్రుని అందుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.



4 comments:

నాగరాజ్ said...

పౌర్ణమి రోజున అతడి అల్లరి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది కాబోలు. చక్కగా వర్ణించారు :)

anu said...

థాంక్యూ.. నాగరాజ్ గారూ.. :)

sriharhsa said...

సముద్రుడు అల్లరి ఆహ్లాదంగా ఉంటుంది కానీ...., అంతు చిక్కని వి అన్ని తనలోనే దాచుకున్నాడు

anu said...

బహుశా అందుకేనేమో.. అతనెపుడూ కొత్తగానే అనిపిస్తాడు..! హర్షగారూ..

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...