Wednesday 15 April 2015

జ్ఞాపకాల దొంతరలో........

ఇంటిలోంచి బయటకు అడుగుపెట్టగానే.. బాగా చల్లగా తాకింది గాలి. రానురానూ అది చలిగా మారింది. నిన్నా, మొన్నా పడిన వర్షాల కారణంగా అనుకుంటాను ఇంత చలిగా ఉంది. పైగా కొద్దిగా జ్వరం కూడా ఉండేసరికి ఇంకా చలిగా అనిపించి ఇక ముందుకు అడుగు వేయకుండా గబగబా ఇంట్లోకి నడిచాను.

చలికోటు వేసుకుని, ఇక ఫర్లేదులే అనుకొని బయటికి నడిచాను. వీధిలోకి వచ్చేసరికి సన్నని తుంపర మొహాన్ని తాకింది. చలికోటులో వెచ్చగా శరీరం, చల్లటి తుంపరలో మొహం భలే ఉందిలే.


తుంపర కాస్త పెరిగి సన్నటి చినుకులుగా మారింది. చినుకులు ఎక్కడ్నుంచి ఎలా పడుతున్నాయబ్బా (ఎప్పుడు వర్షం పడుతున్నా ఎలా పడుతున్నాయబ్బా అన్న సందేహం సైన్సు ఇలా అని  చెబుతున్నా దాన్ని పక్కకు తన్నిమరీ అలానే ఉండిపోయింది) అన్న సందేహం మనసులో పూర్తవకముందే, అసంకల్పిత ప్రతీకారచర్యలా కళ్లు ఆకాశం వైపుకు తిరిగాయి.

ఒక వాటర్ బాటిల్ కి చిన్న చిన్న రంధ్రాలు పొడిచి మధ్యలో ఒత్తుతుంటే ఎలా పడుతుందో (చిన్నపుడు అలా ఆడుకునేవాళ్లంలే. ముఖ్యంగా కొబ్బరి నూనె డబ్బాలను వాడేవాళ్లం) అలా కనిపిస్తుందే తప్ప, ఎక్కడి నుంచి పడుతుందో మాత్రం అంతుచిక్కలేదు. సన్నని ధారలా పడుతున్న చినుకుల గుంపు మాత్రం ఒక్కొక్కటిగా మొహం మీద పడుతూ చిట్లిపోతున్నాయి.

వర్షం మరింతగా పెరుగుతున్నట్టు అనిపించడంతో నడకలో కొద్దిగా వేగాన్ని పెంచాను. మామూలుగా అయితే వర్షంలో తడవడం నాకు చాలా ఇష్టం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. వర్షం సినిమా రాకముందు నుంచే నాకు ఈ ఆసక్తి ఉంది. ఆ సినిమా దర్శకుడే నన్ను కాపీ కొట్టుంటాడనే అనుమానం కొద్దిగా.. చాలా కొద్దిగా కూడా ఉంది. ఇంకో గమనికేంటంటే.. ఆ కథానాయిక.. అదేనండీ త్రిషకు ఉన్నంత పిచ్చి కూడా నాకు లేదు. ఏదో మొదట పడే  వర్షాలంటేనే చాలా ఇష్టం. తరచూ పడుతుంటే కాస్త చిరాకు. బురదలో గట్రా నడవాల్సి ఉంటుంది కదా! అదే మొదటి వర్షాలనుకోండి, వెచ్చగా ఉన్నపుడు చల్లని వాన చినుకులతో మనసుకు హాయి కలిగిస్తుంది. పైగా చినుకులు పడ్డపుడు వచ్చే మట్టి సువావాసన ఎంత ప్రత్యేకం!  



 వర్షం పెద్దగా మారేలోపు బస్ స్టాపుకి చేరుకున్నాను. హమ్మయ్యా.. అనుకుని గడియారం వంక ఒక చూపు వేసేసరికి బస్సు రావడానికి ఇంకా సమయముందని అర్థమైంది. ఆలోపు ఏం చేయాలా అని ఆలోచిస్తూ పక్కన చూస్తే.. చిన్నపిల్లలు ఇద్దరు నేను నిల్చున్న దగ్గర్లో షాపు రేకులపై నుంచి పడుతున్న ధారను చేత్తో అడ్డు పెడుతూ, అలా పెట్టడం కారణంగా వారి మొహంపై పడుతున్న చిందుర్లకు తెగ సంబరపడిపోతూ కనిపించారు. వాళ్లను అలా చూస్తుండగానే బస్సు రావడం ఎక్కి కూర్చోవడం జరిగిపోయాయి.

కిటికీ పక్క సీట్లో కూర్చున్నాను. వానలో ఆడాలనిపించింది.  చినుకులను పట్టుకోవడానికి చేయి బయటకు పెట్టి ఆడుతోంటే..  అకస్మాత్తుగా ఇందాకటి చిన్నపిల్లలు గుర్తుకొచ్చారు. వారితోపాటు నా బాల్యమూనూ! ఇక మనసు ఊరుకుంటుందా..? వద్దన్నా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి లాక్కెళ్లింది.

చిన్నపుడు ఎంత పెద్ద వర్షమైనా ఇష్టమే. అది బురదయినా, వరదయినా. ఇంటి వసారా చూరులోంచి వర్షపు నీరు ధారలా పడుతోంటే, వాటిల్లో చేయి పెట్టి ఆడుకోవడం, అమ్మ వస్తుందనిపించినపుడు ఏమీ తెలియని వాళ్లలా చటుక్కున చేతులు తీసేయడం. దొరికిపోతే నాలుగు తన్నులు తినడం. అయినా ఆగుతామా ఏంటి? ఆట ఆటే.

ఎలాగూ తొందరగా చీకటి పడుతుంది. పైగా వర్షమనగానే కరెంటు కూడా ఉండదు. కాబట్టి, సాయంత్రమవగానే చలిగా ఉందని మోకాళ్ల మీద కూర్చుని దుప్పట్లు చుట్టేసుకోవడం, వేడివేడిగా అమ్మ చేసి పెట్టిన గుగ్గిళ్లను తినడం. భలే ఉండేదిలే. మా చిన్నపుడైతే ఎంచక్కా వర్షాకాలమన్నాళ్లూ పెసలు, బొబ్బర్లు, చిక్కుళ్లు, బఠానీ, శెనగలు... ఇలా ఎన్ని రకాల గుగ్గిళ్లను వండిపెట్టేదో అమ్మ. ఇపుడవేమీ లేవనుకో.

ఇక స్కూలుకెళ్లేటపుడైతే ఆ సరదానేవేరు. ఎప్పుడు వెళ్లినా వెళ్లకపోయినా వర్షం వచ్చినపుడు మాత్రం తప్పకుండా వెళ్లేవాళ్లం. ఎలాగూ క్లాసులు జరగవు కాబట్టి టీచర్లు పిల్లలతో పాటలు పాడడమో, కథలు చెప్పడమో చేయించేవారు. ఎవరి దగ్గర ఏ టాలెంటు ఉందో తెలిసేది కూడా అప్పుడే మరి!
సాయంత్రం పనిమాల నీళ్లు ఉన్న గుంటల్లోనే నడుచుకుంటూ వచ్చేవాళ్లం. కాళ్లకు బురద అంటించుకుని రావడం అదో సరదా అపుడు.

తరగతులు ఎలాగూ జరగవు కాబట్టి హోంవర్కూ ఉండదు. రాగానే బట్టలు మార్చుకుని మళ్లీ దుప్పట్లలోకి దూరి, దీపపు వెలుగులో వేడివేడి అన్నం. ఆహా! అదేంటో అపుడు మాత్రం ఏ కూరయినా, పచ్చడయినా పళ్లెం దెబ్బకు ఖాళీ అయ్యేది. రాత్రిపూట అమ్మ, నాన్నల పక్కన చేరి (నానమ్మ, తాతయ్యలు నాకు లేరుగా. అందరూ నానమ్మా తాతయ్యలతో కూడా కథలు చెప్పించుకునేవారట. మా అమ్మమ్మ కూడా మాదగ్గర ఉండేది కాదు) కథలు చెప్పమని తెగ గోల చేసేవాళ్లం.  చెప్పిన కథలు చెబితే ఊరుకునే వాళ్లమే కాదు. మా చదువుల సంగతులు రానంతవరకూ వాళ్లను విసిగించి మరీ కొత్త కథలు చెప్పించుకునేవాళ్లం. అలా కథలు వింటూ ఎపుడు నిద్రపోయేవాళ్లమో. పొద్దున్నే స్కూలుకు వెళ్లేటపుడు ఏయే కథలు చెప్పించుకున్నామో చెప్పుకుంటూ వెళ్లేవాళ్లం.


ఇదంతా వర్షం పడేటపుడు సంగతైతే, ముసురు పట్టినపుడు, తుపానులపుడు విషయం మరోలా ఉండేది. ముఖ్యంగా ముసురు పట్టినపుడు వర్షమూ రాదు, ఎండా రాదు. కానీ పొద్దస్తమానం చల్లగా ఉంటుంది. స్కూళ్లోనూ పాఠాలు చెబుతారు. స్కూలుకు వెళ్లాలన్నా చిరాగ్గా ఉండేది. ఇంట్లోనూ మన గోల గురించి తెలుసు కాబట్టి చచ్చినా ఉండనివ్వరు. కానీ ఒక ఆశ మాత్రం ఉండేది. స్కూలుకి వెళ్లగానే ఈరోజు స్కూలు లేదుకానీ ఇంటికి వెళ్లండి అని చెబుతారేమో..! అని. ఆ మాట వింటే మాత్రం పరమానందంగా ఉండేది. ఒక్కోసారి మాత్రం పక్క స్కూళ్లను వదిలిపెట్టి మమ్మల్ని ఉంచడమో, లేదా అందరినీ వదిలిపెట్టి మాకు మాత్రం ప్రత్యేక తరగతి (స్పెషల్ క్లాసు) ఉందనో ఉంచేవారు అప్పుడు మాత్రం చెప్పిన  వాళ్ల మీద గొంతు వరకూ కోపం ఉండేది. వాళ్లు వదిలిపెట్టేవరకూ తీవ్ర అసహనాన్ని చూపించేవాళ్లం.


 ఇలా సాగుతున్న ఆలోచనలకు ‘చేరుకున్నాం. దిగాలని లేదా?’ అన్న స్నేహితురాలి మాటతో అడ్డుకట్ట పడింది.

బస్సులోంచి దిగి, చినుకుల్లో నడుస్తోంటే, చిన్నప్పటిలానే లోపలికి వెళ్లగానే.. ‘ఈరోజు ఆఫీసు లేదు. ఇంటికి వెళ్లండి’ అని చెబితే బావుణ్ణు అనకుంటూ లోపలికి అడుగు పెట్టాను. ఎవరూ అలా చెప్పలేదు. అయినా ఎందుకు చెబుతారు? జీతం ఇచ్చి పని చేయించుకుంటున్నపుడు వర్షం వచ్చిందనో, చలేస్తోందనో ఆఫీసు మూసేయరు కదా! అన్న విషయం స్ఫురణకు రాగానే కొంత బాధేసినా, చిన్న పిల్లలా చేసిన ఆలోచనకు మాత్రం చాలాసేపు నవ్వుకున్నాను.

No comments:

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...