Saturday 26 November 2016

ఎదలోయలో.. ఏ మూలనో!

కాలేజీకి వచ్చాను.. ఎప్పటిలాగే ముందు నేనే. అందరూ వచ్చేలోగా అలా ఒక చుట్టు చుట్టి వద్దామని అడుగులేస్తున్నా. అప్పటిలాగానే ఉంది. పెద్దగా మార్పులేదు. రంగులు మినహా! అయినా నా పిచ్చికానీ.. మూడు సంవత్సరాల్లో పెద్దగా మార్పులేముంటాయి? అయినా ఎందుకు ఉండకూడదు? వారం రోజుల్లోనే ఎన్నో మారుతుంటాయి. మూడు సంవత్సరాలంటే మాటలా మార్పు సహజమే..! ఒక్కసారిగా నవ్వు వచ్చింది. రెండు భిన్నాభిప్రాయాలను నాకు నేనే చెప్పుకున్నందుకు.





అపుడే వచ్చి గంటవుతోంది. ఇంకా ఎవరూ రావట్లేదు. నేనేం మరీ ముందుగా రాలేదు.  కేవలం అరగంట అంతే. చిన్నపుడు ఒక్కనిమిషం ఆలస్యం కారణంగా దెబ్బలు తిన్న సందర్భముంది. ఇక అప్పటినుంచి కనీసం 10 నిమిషాల ముందుగానే చేరుకుంటాను ఎక్కడికైనా.

చెప్పిన సమయం దాటి అరగంట గడుస్తున్నా ఒక్కరి జాడాలేదు.

దగ్గర్లో ఉన్న పచ్చికపై కూర్చున్నా. ఎప్పుడైనా లీజర్ వస్తే నేనూ, అవనీ ఇక్కడే కూర్చుంటాం. ఎన్ని కబుర్లో..! రోజూ పక్కనే కూర్చుని ఉన్నా.. ఇక్కడ కూర్చుంటే మాత్రం ఎక్కడలేని విషయాలన్నీ గుర్తొచ్చేస్తాయి. సమయమే తెలిసేది కాదు. ఆత్మీయ సమ్మేళనం అని అవనినే ఫోన్ చేసింది.

‘అందరూ బిజీ అయ్యారు. ఎవరూ రారు. మొక్కుబడిగా ఓ పదిమంది వచ్చి సెల్ఫీలు తీసుకుని వెళ్లిపోతారు. ఈ మాత్రం దానికి ఎందుకే? నేను రాను’ అన్నాను.
‘అలాంటివేం ఉండవు. సాయంత్రం వరకూ మొబైళ్లు మూగబోవాల్సిందే. వెళ్లబోయే ముందు మాత్రమే ఫోటోలు..’ అంది.
‘అయినా ఎందుకో రావాలనిపించట్లేదే’.
‘నీ ఇష్టం.. అందరూ వస్తున్నారు.. అందరూ..........’ అంటూ నొక్కి చెప్పింది. దాంతో ఇక కాదనలేకపోయాను. తెలియకుండానే పెదవులపై చిరునవ్వు చేరింది.

*******

‘రానన్నావు.. ఇప్పుడేమో అందరికంటే ముందు నువ్వే వచ్చేశావు. పైగా పక్కన వచ్చి కూర్చున్నా పట్టించుకోనంత దీర్ఘాలోచనతో.. ఏంటి సంగతి?’అంటూ కళ్లెగరేసింది.
‘హే.. ఎంతసేపైందే వచ్చి? గమనించలేదు. నీ గురించే ఆలోచిస్తూ కూర్చున్నా’.
‘కొయ్.. కొయ్.. నాకు తెలియదనుకుంటున్నావా?’
‘నిజమే. సర్లే కానీ.. ఇంత ఆలస్యమైందే? నేను వచ్చి గంటకుపైగా అయ్యింది’.
‘మేమూ పొద్దున్నే వచ్చాం తల్లీ. అందరూ అటువైపు ఉంటే.. నువ్వేమో ఇక్కడ కూర్చుని..  పైగా మాటలా?!’
‘అవునా! నేనింకా ఎవరూ రాలేదనుకుంటున్నాను. అయినా నేను కాలేజ్ మొత్తం తిరిగానే!? ఎవరూ కనిపించలేదు’.
‘హ్మ్.. అందరినీ డిస్ర్టబ్ చేయడమెందుకులే అని అటు ఇంజినీరింగ్ బ్లాక్ వైపు ఏర్పాటు చేశాం. రా.. అందరూ వచ్చేశారు.. రా రా..’ అంటూ లాక్కునిమరీ వెళ్లింది.

తనేదో పనుందని నన్ను అక్కడ వదిలేసింది. ఎవరెవరు వచ్చారా అని వెతుకుతూ.. కనిపించిన వాళ్లని పలకరిస్తూ ముందుకు సాగాను. మాట్లాడుతున్నాను కానీ.. నా కళ్లు మాత్రం ఇంకా వెతుకుతూనే ఉన్నాయి.. అసలైన వారి కోసం.

నిరీక్షణ కొనసాగుతోంది కానీ, ఫలితం మాత్రం శూన్యం. కోపం వచ్చింది అవనిపై అబద్ధం చెప్పినందుకు. కోపాన్ని బాధ వెనక్కు నెట్టి కళ్లలో నుంచి వర్షించడానికి సిద్ధమైంది. పక్కనున్నవారు కనిపెట్టేస్తారేమోనని వారి దగ్గర సెలవు తీసుకుని పక్కకు వచ్చేశాను. ఇంతలో అవని వచ్చి.. ‘అనూ.. ఇక్కడున్నవా? నీకోసమే వెతుకుతున్నాను. ఇక్కడేం చేస్తున్నావు?’ అంటూ అటువైపు తిరిగి ఉన్న నన్ను తనవైపు తిప్పుకుంది.

‘ఏంటే? కుళాయి తిప్పేశావ్?’ అని కంగారుపడింది.
‘అందరూ వస్తారని చెప్పావ్?’
‘వచ్చారుగా..!’
‘ఎక్కడ?’
‘ఇంతమంది కళ్లముందు కనిపిస్తుంటే.. రాలేదంటావే?’
కోపంగా ఒకచూపు చూశాను.
‘ఓహ్.. ఇప్పుడర్థమైంది.. నీకు కనిపించకపోతే రానట్లేనా?’
‘అయితే అందరూ నిజంగానే వచ్చారా?’ అంటూ ఆశగా తనవైపు చూశాను.
‘అందరూ.. అని ఎందుకు? కావాల్సినవాళ్లు వచ్చారా అని అడగొచ్చుగా.. అసలు ఇది ఏర్పాటు చేసిందే తను. నీకు సర్.ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు.  అక్కడ కరెంటుకు సంబంధించి ఏదో సమస్య వస్తే వెళ్లారు.. అదిగో.. నువ్వడిగిన అందరు వస్తున్నారు..’ అంటూ చూపించింది.

నా ఎదురుచూపులు ఫలించాయి.. ముఖం మీద సిగ్గుతో కూడిన నవ్వొకటి వచ్చింది.. నా చూపులు ప్రసరిస్తున్నవైపు చూసి, హ్మ్.. అంటూ ఒక నిట్టూర్పు విడిచి..
‘ప్రశాంత్! ఒక్కసారి ఇటురా.. ’ అంటూ పిలిచింది. నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి, పక్కకు వెళ్లబోయాను. తను నా చేయి పట్టుకుని ఆపింది.

తను మా దగ్గరికి వస్తోంటే, గుండె వేగం పెరిగింది. ఇక కదలాలనుకున్నా కదల్లేకపోయాను.
‘హే.. అనూ! ఎలా ఉన్నావ్? ఎంతసేపైంది వచ్చి? సంవత్సరమైంది నీ గురించిన విషయాలే తెలియదు.. ఫేస్.బుక్ లోనూ అందుబాటులో లేవు.. నీ నంబర్ మార్చావా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. కానీ నేను తనవైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నాడో కూడా వినిపించుకోలేదు.
అవనీనే గమనించి..‘తను బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. తెలుసుగా తనకు సోషల్ వెబ్.సైట్స్ లో ఉండడం పెద్దగా ఇష్టముండదని. తన నంబర్ నేను ఇస్తాలే. ఇంతకీ వెళ్లిన పని అయిపోయిందా?’ అని అడిగింది.
‘ఏంటి ఇన్ని సంవత్సరాలైనా తన సమాధానం కూడా నువ్వే చెబుతావా? ఇప్పటికీ మాట్లాడడానికి సిగ్గేనా?’ అన్నాడు.
నిన్నే అడిగేది అన్నట్లు అవనీ గిల్లింది. నేను ‘అబ్బే.. అదేం లేదు’ అన్నాను.
‘హమ్మయ్యా.. మొత్తానికి నోరు విప్పావు. కవితలు చెప్పేటపుడు మాత్రమే విప్పుతావేమో అనుకున్నాన్నేనింకా!’

సర్లే మీరు మాట్లాడుకుంటూ ఉండండి.. నేను ఇప్పుడే వస్తాను అంటూ అవని వెళ్లబోయింది. నేను కంగారుపడి వెళ్లొద్దని వారించాను. ఇంతలో తనే ఎవరో పిలిస్తే ఇప్పుడే వస్తానంటూ వెళ్లిపోయాడు.

‘ఇంకా నీకు ధైర్యం రాలేదానే? ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇదే వరుస. ఇకనైనా చెప్పొచ్చు కదా!’
‘చెప్పడానికేముందే?’
‘ఏమీ లేనిదే కనిపించకపోతే ఆ కంగారెందుకు?’
ఏం చెప్పాలో తెలియక నేను మౌనాన్ని ఆశ్రయించాను. తనేమో విసుగును ప్రదర్శించింది. ఇంతలో స్టేజీ మీద అనౌన్స్.మెంట్ రావడంతో ఇద్దరం ఆ దిశగా కదిలాం.
అందరూ అప్పటి రోజుల్నీ, అనుభవాలనూ చెబుతున్నారు. అందరం  ఆ పాత జ్నాపకాల్లో కి వెళ్లిపోయాం. ఇంతలో రాజు అని మా బ్యాచ్ మేట్.. తన అనుభవాలను చెబుతూ.. ‘అనుపమ (స్నేహితులు అనూ అని పిలుస్తారు) మాత్రం నాకు బాకీ ఉంది అన్నాడు’ నేను షాక్ కు గురై ఏంటన్నట్లు చూశాను. తరువాత తను చెప్పడం మొదలు పెట్టాడు. నేను మాత్రం ఆరోజుల్లోకి వెళ్లిపోయాను.

********

డిగ్రీ వరకూ పక్క ఊర్లోనే చదువుకున్నాను. అదీ తెలుగు మీడియం. పీజీకి మాత్రం హైదరాబాద్ కు రావాల్సి వచ్చింది. అలవాటు ప్రకారం ముందుగానే వచ్చి సర్టిఫికెట్లు, ఫీజు వివరాలు తెలుసుకుని, కాలేజీలో చేరాను. అలా మా కాలేజీలో మొదట చేరింది నేనే అయ్యాను. దాంతో కొందరు సీనియర్లను కలిసే అవకాశమూ వచ్చింది. అపుడే నేనెపుడూ విననీ, పేపర్లలో మాత్రమే చదివిన అనుభవమున్న ర్యాగింగ్ గురించి విన్నాను. కానీ ఇక్కడ అంత భయపడాల్సిన పని లేదని చెప్పడంతో కొంత ఊరట కలిగింది.

కళాశాలలో చేరాల్సిన రోజు రానే వచ్చింది. కళాశాల హాస్టల్ లోనే చేరాను. మొదటిరోజు సీనియర్లందరూ బాగానే పలకరించారు. లెక్చరర్లు వారిని వారు పరిచయం చేసుకుని, సిలబస్ గురించి చెప్పారు. తరువాత మా పరిచయాలు జరిగాయి. ఆరోజు చూశాను.. ప్రశాంత్ ని. కొత్త విద్యార్థి అంటే ఎవరూ నమ్మరేమో! అందరితో అంతలా కలిసిపోయాడు. అమ్మాయిలూ.. అబ్బాయిలూ అందరూ తనతో పరిచయం చేసుకోవాలని చూసేవారే. నాకు మాత్రం ఎవరూ స్నేహితులవలేదు.

మరుసటి రోజు కొత్తగా ఒకమ్మాయి వచ్చింది. తనే అవని. తను మాట్లాడే విధానం నాకు నచ్చింది. అప్పటి నుంచి తనే నా ఫ్రెండ్. అందరితో మాట్లాడినా ప్రతి తరగతిలో ఎందుకో నా మనసుకు ఒక్కరే  దగ్గరయ్యేవారు.

నాకు ఇంకా ఆనందాన్నిచ్చే విషయం- అవని హాస్టల్ లో నా రూమే. మాతో పాటు ఇంకా నలుగురు చేరారు. ఇలా మా పరిచయాలు అయ్యాయో లేదో.. సీనియర్ అమ్మాయిల నుంచి పిలుపు. వెళ్లి అలవాటుగా అక్కా అని పిలిచాం. అంతే.. సీరియస్ అయ్యారు. మేడం అని పిలవాలంటూ.. సీనియర్ల రూల్స్ ను వివరించారు. రోజూ ర్యాగింగ్ పేరుతో పద్యాలు, పాటలు, డాన్సులంటూ చేయించారు. అసలే సిగ్గరి అయిన నేను వారి చేష్టలకు భయపడ్డాను. నాతోపాటు మిగతావారూను..

ఇక పగలేమో అందరూ కలిసి ర్యాగింగ్ చేసేవారు. దానికి ఇంట్రాక్షన్ (పరస్పర పరిచయం) అని పేరు పెట్టారు. దానిలో భాగంగా సెల్యూట్ చేయడం.. పాటలు పాడడం.. ఎవరి గురించి వారు పరిచయం చేసుకోవడం ఉండేది. ఇది బాగానే ఉండేది. కానీ నాకేమో సెల్యూట్ ఎన్నిసార్లు చేసినా వచ్చేది కాదు. విద్యార్థులందరూ గుమ్మం బయట అమ్మాయిలూ, అబ్బాయిలూ చేరో వరుసలో నిలబడి, ఒక్కొక్కరుగా సెల్యూట్ కొడుతూ రావాలన్నమాట. నాకు రాకపోయేసరికి ఒక పక్కన నిలబెట్టేవారు. నాకేమో ఏడుపొచ్చేది.  దాంతో వెళ్లమనేవారు. ఒకసారి మాత్రం అలాగే నిలబెట్టేశారు. తరువాత సీనియర్లు వెళ్లిపోయాక  ఏడ్చేశాను. అప్పుడే ప్రశాంత్ వచ్చి మొదటిసారిగా నాతో మాట్లాడాడు.. సెల్యూట్ ఎలా చేయాలో నేర్పించాడు. అదేంటో అవనీ ఎన్నిసార్లు నేర్పించినా అసలు రాలేదు. కానీ అపుడు వచ్చింది. తరువాతి రోజు కరెక్టుగా కొట్టాను. ఫలితంగా నా చెప్పుకూడా తెగింది. నడుద్దామంటే.. కుంటుకుంటూ వెళ్లాలి. పోనీ చెప్పు చేత్తో పట్టుకుందామంటే.. ఇబ్బంది. దీంతో అందరూ వెళ్లేంతవరకూ ఆగాల్సి వచ్చింది.

‘నువ్విక్కడే ఉండు.. నేనిపుడే ఒక కవరు తీసుకుని వస్తా..’ అంటూ అవనీ వెళ్లింది. కిటికీలో నుంచి బయటికి చూద్దును కదా.. కాలేజీ బస్సులన్నీ వరుసలో ఉంటే.. ఒక్కొకరూ తమ బస్సుల్లో ఎక్కుతున్నారు. నేనేమో సరదాగా తెగిన చెప్పుతోనే నడుస్తూ తరగతంతా కలియతిరుగుతున్నాను.  అపుడే ఒక బెంచీపై పుస్తకం ఉండడం గమనించాను. తీయాలా వద్దా అన్న సంశయం. పోనీలే దాచి రేపు ఎవరిదో కనుక్కుని ఇద్దామని నిశ్చయించుకుని, నా పుస్తకాలతోపాటు పెట్టేశాను.

అవనీ వస్తోందో లేదో చూద్దామని గుమ్మం వరకూ వెళ్తోంటే.. ఒక్కసారిగా ఎవరో దూసుకు వచ్చి బలంగా తాకారు. నేను ఒక్కసారిగా తూలి పడిపోతుంటే ఆ చేయే బలంగా నన్ను తనవైపుకు లాగింది. ఆ చేయి ప్రశాంత్ ది. నేను ఆశ్చర్యంగా తనను అలాగే చూస్తూ ఉండిపోయాను.. తను నా వైపు చూసి కళ్లెగరేసే వరకూ. తమాయించుకుని చూసేసరికి నా ఒక చేయి తన చేతిలోనూ రెండోది అతని భుజంపైనా ఉంది. దూరంగా జరుగుతోంటే.. తెగిన చెప్పు కదా.. కాలు మెలికపడింది.  కాలు నొప్పి. తనే సరిగా నిల్చోవడానికి సాయం చేశాడు. కదల్లేను.. అలానే పట్టుకుని ఉండలేను. మొహమంతా చిరుచెమట, సన్నటి ఒణుకు, భయంతో కూడిన బిడియం..

ఇంతలో అవని వచ్చి నా అవస్థ తెలుసుకుని, తన సాయంతో ఒకచోట కూర్చోబెట్టింది. బెణికిన కాలుని నేను వారిస్తున్నా వినకుండా ప్రశాంతే.. సరిచేశాడు. తను కాలు పట్టుకోవడం చాలా సిగ్గుగా, ఇబ్బందిగా అనిపించింది. తను మాత్రం ఇది చాలా మామూలు విషయమన్నట్టు ఉన్నాడు. ఎందుకో తెలీదు.. అపుడు మాత్రం మనసు చివుక్కుమంది.

‘అవును.. నువ్వేంటి ఇక్కడ?’ అని అడిగింది అవనీ ఏదో గుర్తొచ్చినట్లు..

‘హయ్యా.. మరిచేపోయాను.. పుస్తకం మరచిపోయాను.. దాన్ని తీసుకుందామనే వచ్చా’ అంటూ.. దాన్ని తీసుకుని వెళ్లిపోబోతుంటే.. ఇద్దరం థాంక్స్ చెప్పాం.. తను ఒక నవ్వు నవ్వి పరుగున వెళ్లిపోయాడు. తరువాత చిన్నగా మేమూ హాస్టల్ చేరుకున్నాం.

ఆరోజు రాత్రి  సీనియర్లకు ఎలా తెలిసిందో, క్లాస్ తీసుకున్నారు. చెప్పేది వినకుండా తిట్టేశారు. మామూలుగానే ఎవరితోనూ మాట్లాడేవాళ్లం కాదు. వాళ్లు పలకరించినా ముక్తసరిగా చెప్పేవాళ్లం. అయినా తిట్టడమేకాక ఆరోజు అర్ధరాత్రి 12 గంటల వరకూ నిలబెట్టి ఉంచేశారు. అసలే కాలు నొప్పి, పైగా అంతసేపు నిలబెట్టారు. దీంతో ఏర్పడ్డ  భయానికి నాకు జ్వరం వచ్చింది. మరుసటి రోజు తరగతిలో ఎవరు పలకరించినా పలకలేదు. మధ్యాహ్నం లంచ్ సమయంలో తినకుండా నేనూ, అవని అలానే ఉన్నాం.

 నేనేమో అసలు చదువు మానేసి పోవాలనీ, తనేమో పిర్యాదు చేయాలని. ఇంతలో ప్రశాంత్ వచ్చి పలకరించడంతో నాకు తెలియకుండానే ఏడ్చేశాను. విషయం తెలుసుకుని మా అందరినీ తీసుకుని యాజమాన్యం దగ్గరికి వెళ్లాడు. ఇక అప్పటి నుంచి మాకు హాస్టల్ లో ర్యాగింగ్ బాధ తప్పింది. ఈ సంఘటన తరువాత ప్రశాంత్ పై సహజంగానే ఏర్పడిన ఆత్మీయభావం ఇంకా పెరిగింది.

కానీ కళాశాలలో మాత్రం ఇంట్రాక్షన్ సెషన్ కొనసాగుతూనే ఉండేది. ఇద్దరూ లేదా ముగ్గురు కలిసి ఒక్కొక్కరినీ, ఒక్కోసారి ఇద్దరినీ చేస్తుండేవారు. అపుడపుడూ ఈ అవకాశాన్ని సీనియర్ అమ్మాయిలు మా విషయంలో బాగానే ఉపయోగించుకునేవారు. ఓ సందర్భంలో నిలబెట్టి, ఎవరికైనా ప్రపోజ్ చేయమన్నారు. లేదంటే గంటపాటు నిలబడాలన్నారు. నాకు భయమేసింది. అయినా నిలబడడానికే ఒప్పుకున్నాను. కానీ వాళ్లు బెంచీ మీద అన్నారు. దాంతో ఏం చేయాలో తోచలేదు. ప్రశాంత్ ని కూడా పిలిచారు. కొంచెం ధైర్యమనిపించింది. తనకు పువ్వు ఇచ్చి నాకు ప్రపోజ్ చేయమన్నారు. తను మోకాళ్ల మీద నిల్చుని ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా’అని చెప్పాడు. తెలియదు ఎందుకో.. చాలా ఆనందమేసింది.

‘చూశావుగా.. ఎంత తేలికగా చెప్పాడో.. అతను చెప్పింది మరచిపోయి.. నువ్వు చెప్పు.. తెలుగు మీడియం కదా.. అచ్చ తెలుగులో చెప్పు’అన్నారు.

పేరుకు వాళ్లు చెప్పింది వింటున్నానే కానీ, నా చూపులు మాత్రం ప్రశాంత్ వైపే ఉన్నాయి. తను చెప్పిన మాటలే నా మస్తిష్కంలో తిరుగుతూ ఉన్నాయి. పక్కనెవరూ కనిపించడంలేదు.. ఎక్కడో దూరంగా రణగొన ధ్వనిలా వినిపిస్తున్నాయి మిగతా వారి మాటలు.. నిద్రలో నడుస్తున్నట్టుగా వెళ్లి పువ్వు పట్టుకుని..

‘తెలియదు.. ఈ మాట ఇంత అందంగా ఉంటుందని- నువ్వు చెప్పేంతవరకూ. తెలియదు.. పరిచయం లేని ఈ మాట ఇంత మధురంగా హృదయాన్ని తాకుతుందని! - నీ నుంచి వినేంత వరకూ.  తెలియదు నీ నుంచి ఈ మాట కోసమై నా మనసు ఎన్నో ఏళ్లుగా పరితపిస్తోందని- నీ ద్వారా అనుభవమయ్యేంతరకూ.. నాకు ఈ ఆనందాన్ని రుచి చూపించిన నిన్ను నేనూ ప్రేమిస్తున్నా!’

వాళ్ల చప్పట్లు మోగేంతవరకూ నిజంగానే నాకు తెలియలేదు.. ఆ మాటలను నేను నిజంగానే చెప్పాననీ.. తొలిరోజు చూసినప్పటినుంచే నేను ప్రశాంత్ ను ఇష్టపడుతున్నాననీ!

భలే చెప్పావంటూ అవనీ, ప్రశాంత్, ఇంకా అందరూనూ మెచ్చుకున్నారు. కానీ మనస్ఫూర్తిగా చెప్పానని గ్రహించింది మాత్రం అవనీనే. కానీ మొదట బయటపడలేదు. కానీ అది బయటపడేలా ఇంకో సందర్భమెదురైంది. ఆరోజు మాత్రం అడిగేసింది.
‘అనూ.. ఒకటి అడగాలనుకుంటున్నా.. అడగనా?’
‘వద్దంటే మాత్రం ఆగుతావా ఏంటి? అడుగు..’
‘నీకు ప్రశాంత్ అంటే ఇష్టమా?’
‘ఏ.. నీకు ఇష్టం లేదా?’
‘నేను సీరియస్ గా అడుగుతున్నా.. నువ్వు తనను ప్రేమిస్తున్నావా?’
ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాను..
‘సమాధానం చెప్పమంటే ఎటో చూస్తావేంటి?’
‘నీకేమనిపిస్తోంది?’
‘ప్రేమిస్తున్నావనే అనిపిస్తోంది’
‘అనిపించినపుడు ఇక నన్ను అడగడమెందుకు?’
‘అయితే నిజమేనన్నమాట!’
‘నేనలా అనలేదే?’
‘మరి?!’
‘ప్రేమో.. ఇంకేమిటో! నాకైతే తెలియదు. చూడాలనిపిస్తుంది... మాట్లాడాలనిపిస్తుంది.. తను చూసినా, మాట్లాడినా బొమ్మలా అయిపోతాను. ఏదో భయం. ఎందుకో తెలియదు’.
‘ఎప్పుడు చెబుతావ్?’
‘ఏంటి చెప్పేది?’
‘ప్రేమిస్తున్నానని’
‘చెబితే..’
‘తనకూ తెలుస్తుందిగా.. ’
‘తెలుసుకుని ఏం చేస్తాడు?’
‘తనకీ ఇష్టమైతే ప్రేమిస్తాడు..’
‘ఇష్టం కాకపోతే?’
‘అయితే ఎప్పటికీ ఇలాగే మనసులోనే ఉంచుకుంటావా?’
‘బాగుంది కదా..! ఉండనీ’.
‘అంతేకానీ చెప్పనంటావ్’
‘ఊహూ..’
‘పోనీ నేను  చెప్పనా?’
‘ఇదేమైనా రికమండేషనా?’
ఇలా సాగేది మా సంభాషణ. కానీ, విషయం ఎక్కడికీ సాగేది కాదు.. ఎప్పుడూ జట్టుగా ఉండే మేము.. ఈ ఒక్కవిషయంలో మాత్రం తీవ్రంగా వాదులాడుకునేవాళ్లం. ప్రశాంత్ తనకి మంచి స్నేహితుడు.. నేను మాట్లాడుతానంటుంది తను. కుదరదంటాను నేను..




ఇలా నా ఆలోచనల్లో నేనుంటే.. దానికి భంగం కలిగిస్తూ.. కవిత కానీ, పాటకానీ పాడాలంటూ.. నన్ను పిలిచారు. నేను ససేమిరా అన్నాను. వాళ్లేమో బలవంతం చేస్తున్నారు. నావల్ల కాదు.. నన్ను వదిలేయమని మృదువుగా చెప్పాను. దాంతో అందరూ ఇంక బలవంతం చేయలేకపోయారు. కానీ అవని మాత్రం తన బదులు నేను చేస్తానంటూ వెళ్లింది. నా స్నేహితురాలు అని కాదు కానీ, అవని పాట పాడినా, డాన్స్ చేసినా అలా చూడాలనిపిస్తుంది. కానీ, తను ఆ రెండూ కాక కవిత చెబుతానంది. దాంతో నాకు నవ్వాగలేదు. అది ఉడుక్కుంటున్నా.. అందరూ నావంక చిత్రంగా చూస్తున్నా.. ఈసారి ఆపుకోలేకపోయాను. అలా ఉంటుంది మరి దాని కవిత్వం.

నేను నవ్వడం ఆపాక మొదలుపెట్టింది..

తొలిచూపు ప్రేమంటే ఏమిటో అనుకున్నాను.. ఎంత త్వరగా అర్థమైందో అది నీవేనని.
ప్రేమించడమంటే తెలియదనుకున్నాను.. నీ పరిచయమయ్యేవరకూ..
నిరీక్షణ కూడా బావుంటోంది.. నీకోసం వేచి చూస్తున్నపుడు..
దు:ఖంలోనూ ఆనందమేస్తోంది.. నీవు ఎదురుగా ఉన్నపుడు.
భయంలోనూ ధైర్యపు ఛాయలు కనిపిస్తున్నాయి.. నీవు జతగా ఉన్నపుడు.
ఏదైనా చేయగలను.. నీవు నేర్పించినపుడు.
ఎంతసేపైనా ఎదురుచూడగలను.. నీ నోటి నుంచి వచ్చే పలుకు కోసం.
కానీ, చెప్పలేను నీవు ఎదురుగా ఉన్నపుడు ప్రేమిస్తున్నాని.. చూడలేను ఎదురుగా ఉన్నపుడు నీ కళ్లలోకి..
ఎందుకు చెప్పవంటే.. ఏం చెప్పను. ఇష్టమైతే మాటల్లో చెప్పగలను. ప్రేమ కదా..! కళ్లతోనే పలికించగలను.
బాధ లేదు.. నీకు చెప్పలేకపోతున్నానని.. కానీ, భయమేస్తోంది.. నువ్వు కాదంటావేమోనని.
నువ్వు దూరంగా ఉన్నా బతికేయగలను కానీ.. దూరమైతే మాత్రం కాదు..
ప్రశాంతమైన నీ నవ్వునూ, స్నేహాన్ని అనుపమానంగా ప్రేమిస్తూ.. నీ........

అంటూ వేదిక దిగింది.

అందరూ చప్పట్లు కొడుతోంటే, నా కళ్లలో ఆశ్చర్యంతోపాటు సన్నని నీటిపొర చూపును కమ్మేస్తూ.  కానీ, నాలుగు కళ్లు నా వైపే చూస్తుండడం మాత్రం తెలుస్తోంది..
రెండు అవనివీ.. 
మరో రెండేమో...!!

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...