Friday 7 April 2017

అమ్మమ్మ చెప్పిన కథ

చిన్నప్పుడు మా స్కూల్లో ప్రార్థన సమయంలో ప్రతిరోజూ కథ, వార్తలు  చెప్పిస్తుండేవారు. రోజుకు ముగ్గురు ఇందులో పాల్గొనేవారు. అదీ హైస్కూలు పిల్లలే. రూల్ నంబరు ప్రకారం విద్యార్థుల ఎంపిక జరిగేది. నా వంతు వచ్చేటప్పటికి నాకు వచ్చింది కథ. నాకు తెలిసిన కథ- రాజు- ఏడు చేపల కథ. అది అప్పటికే అయిపోయింది. కొత్త కథ కావాలి. సాయంత్రం త్వరగా ఇంటికెళ్లి అమ్మని కాకా పడితే.. అమ్మమ్మ దగ్గరికి పంపింది. తను నాకు చెప్పిన కథే ఇది. 

        ఎందుకో తెలియదు కానీ, నాకు బాగా గుర్తుండిపోయింది. సహజంగానే నాకు స్టేజీ ఫియర్ ఎక్కువ. బహుశా మొదటిసారిగా అంతమంది ముందు ఏమాత్రం గాభరా పడకుండా చెప్పగలిగినందుకేనేమో! 



నగనగనగా.. ఒక ముసలావిడ ఉండేది. ఆమెకో కొడుకు. భర్త చిన్నతనంలోనే చనిపోవడంతో కొడుకును పెద్ద చేసి ప్రయోజకుడిని చేసింది. అతనికి పెళ్లీడు రాగానే పెళ్లి చేసింది. అయితే, ఆ అమ్మాయి తల్లి కూడా ఒంటరిదే కావడంతో ఆమెనూ తమతోపాటు ఉండటానికి అంగీకరించింది. అయితే, కోడలి తల్లి మంచిది కాదు. తన కూతురికి మాయమాటలు చెప్పి, అత్త పేరు మీద ఉన్న కాస్త ఆస్తిని కూతురి పేరుమీద రాయించుకునేలా చేసింది. తరువాత ఇద్దరూ ఆమెను ఇబ్బందులకు గురయ్యేలా చేసేవారు. అయినా ఆమె పాపం తన కొడుకుని ఏం చెప్పేది కాదు.

        పోనుపోనూ కోడలు ఆమె కొడుకునూ ఆమెకు వ్యతిరేకంగా మార్చడం మొదలుపెట్టింది.  ఒకరోజు..

‘మీ అమ్మ మనకు భారమే తప్ప ఆవిడ వల్ల మనకు ఏం ఉపయోగం లేదు.. ఆవిడను ఎక్కడైనా వదిలిపెట్టి రండి’ అంటూ పోరడం మొదలుపెట్టింది.

తండ్రి లేకపోయినా ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాచుకున్న తల్లిని అలా వదిలిపెట్టడానికి అతనికి మనసు రాలేదు. కానీ, భార్య పోరును పడలేక తల్లిని తీసుకుని అడవికి వెళ్లాడు. దారిలో..

‘అమ్మా.. నువ్వు నాతో కలిసి ఉండటం నీ కోడలికి నచ్చడం లేదు.. అందుకే నిన్ను ఇక్కడ వదిలేయడానికి వచ్చాను. క్షమించు’ అని చెప్పి ఆమె సమాధానం కూడా వినకుండా వెనుదిరగకుండా వెళ్లిపోయాడు.

ఇలా జరుగుతుందని ముందే గ్రహించిన ఆవిడ కొంత బాధపడినా.. తన కొడుకైనా సంతోషంగా ఉంటే చాలనుకుంది.

అడవిలో అలా నడుచుకుంటూ వెళ్తున్న ఆమెకు ఓ పేదరాసి పెద్దమ్మ ఎదురవుతుంది. ఆవిడ గురించిన వివరాలను తెలుసుకుని ఆమెకో ఆశ్రయం కల్పిస్తుంది.

‘నేను రావడానికి కొంత కాలం పడుతుంది.. నువ్విక్కడే ఉండు’ అని చెప్పి వెళుతుంది.

పాపం ఆ తల్లి తన కొడుకును తలచుకుంటూ ఒంటరిగానే ఉండిపోతుంది. ఏదో ఆలోచనలో ఉన్న ఆమె దగ్గరికి ఎండాకాలం ఒక స్త్రీ రూపంలో వచ్చి.. ‘అవ్వా.. ఈ ఎండలు చూశావా.. ఎలా మండిపోతున్నాయో! ఎంత విసుగో కదా ఇలా ఉంటే. అసలు ఎండాకాలమే ఉండకుండా ఉంటే ఎంత బావుణ్ణో కదా! ’ అంటుంది.

అపుడు ఆమె.. ‘తప్పమ్మా.. కొద్ది ఇబ్బందిపడ్డాం అని అలా అసహ్యించుకోకూడదు. సూర్యుడి వల్లే కదా మనకు ఆహారం లభించేది. ఇంతగా ఎండలు కాస్తేనే కదా.. వర్షాలు కురిసేది.. నేలంతా పచ్చదనంతో నిండేది. ఇవన్నీ జరగాలంటే మరి ఎండలు ఉండాలి కదా.. అయినా.. ఎండాకాలంలో దొరికే పండ్లు మనకు వేరే కాలాల్లో దొరకవు కదా. కాబట్టి అలా అనకూడదు’ అని చెప్పి, ఇంటివెనుక ఉన్న చెట్ల మామిడి పండ్లు కొన్ని కోసి  ఆమెకు ఇచ్చి పంపుతుంది.

ఇంతలో వర్షాకాలం వస్తుంది. ఈసారి వర్షాకాలం అవ్వను పరీక్షించాలనుకుంటుంది. ఆమె కూడా ఒక స్త్రీ రూపంలో వచ్చి..

‘అబ్బబ్బ.. ఏం వర్షాలో.. ఒకటే ప్రాణాలు తోడేస్తున్నాయి. నేలంతా బురదమయం. ఎక్కడికీ వెళ్లడానికి వీలుండదు. పాడు వర్షాలు. వీటిని భరించడం చాలా కష్టం కదా అవ్వ’ అంటుంది.

దానికి అవ్వ చిరునవ్వు నవ్వి..‘ఎండాకాలం వేడిమిని తరిమేసేది వర్షాలే కదా.. వర్షాలు లేకపోతే రైతులు పంటలు ఎలా పండిస్తారు? ప్రజలు ఎలా బతుకుతారు? మనకు జీవనాధారమైన నీరుని ఇచ్చేది కూడా వర్షాలే కదా.. కాబట్టి అలా అనుకోకూడదు’ అని చెప్పి ఆమెను పంపుతుంది.

ఈసారి శీతాకాలం వస్తుంది.

‘అవ్వా.. చలి విపరీతంగా పెరుగుతోంది కదా! మిగతా కాలాల్లో ఎలాగైనా కాలం వెళ్లదీయవచ్చు కానీ, ఈ పాడు కాలంలో కాలు కూడా బయట పెట్టలేం కదా’ అని అడుగుతుంది.

దానికి అవ్వ.. ‘ఒకటి తక్కువ, ఇంకోటి ఎక్కువ అని ఉండవు. ఏ కాలం గొప్పతనం దానికి ఉంటుంది. ఒక్కో  కాలం తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ, మానవాళికి సాయం చేస్తున్నాయి. కాబట్టి ఏదీ తక్కువ కాదు’ అని చెప్పి ఆమెకు కొంత ధాన్యాన్ని ఇచ్చి పంపుతుంది.

దీంతో ఎంతో సంతోషించిన మూడు కాలాలూ ఆమె దగ్గరికి దేవదూతల రూపంలో వచ్చి, వరం కోరుకోమని అడుగుతాయి.

దానికి అవ్వ..  ‘నా కొడుకుతో కలిసి ఉండాలని ఉంది’ అంటుంది. అలాగే అని ఇంకో వరాన్ని కోరుకోమంటాయి. కానీ తనకు ఇంకేం కోరికలు లేవంటుంది అవ్వ. వెంటనే దూతలు ఆమెకు బంగారం, పండ్లు, ఎన్నో కానుకలు ఇచ్చి దేవాతాశ్వాన్ని తోడుగా ఇచ్చి ఆమె కొడుకు దగ్గరికి పంపుతాయి. వెళుతూ వెళుతూ.. తనకు సాయం చేసిన పేదరాసి పెద్దమ్మకు కొంత సొమ్ము ఇచ్చి వెళుతుంది.

అన్ని కానుకలతో వచ్చిన అత్తగారిని చూడగానే కోడలు ఆశ్చర్యపోయి.. ఆమెను లోపలికి తీసుకెళుతుంది. ఆమె సంతోషంగా ఉన్నంతవరకే ఈ కానుకలు మీతో ఉంటాయని కాలాలు హెచ్చరించి, అవ్వ దగ్గర వీడ్కోలు తీసుకుని వెళ్లిపోతాయి.

మొదట ఈ సంపదను చూసుకుని కోడలు బాగానే ఉంటుంది. కానీ, ఆమెకు ఇంకా సంపాదించాలనుకుంటుంది. మళ్లీ అత్తగారిని అడవికి పంపాలనుకుంటుంది. అదే విషయం భర్తతోనూ చర్చిస్తుంది. ఆమె దురాశకు భర్తకూ కోపమొచ్చి ‘కావాలంటే.. మీ అమ్మను పంపుకో. నేను మా అమ్మను ఎక్కడికీ పంపను’ అనేసి వెళ్లిపోతాడు. కోప్పడినా భర్త గొప్ప ఉపాయం చెప్పాడని భావించిన భార్య అత్తకి ఈ సంపద ఎలా వచ్చిందో కనుక్కుని, ఎంత చెప్పినా వినకుండా ఈసారి తన తల్లిని అడవికి పంపుతుంది. వేరే ఆధారం లేని ఆవిడ గత్యంతరం లేక అలాగే వెళుతుంది.

ఈవిడకీ పేదరాసి పెద్దమ్మ ఆశ్రయం కల్పించి మళ్లీ తిరిగి వస్తాను.. ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని వెళుతుంది. బాగా సుఖాలకు అలవాటుపడిన ఈమె ఇంటిని శుభ్రంగా ఉంచలేకపోతుంది.

మళ్లీ కాలాలకు ఈమెను పరీక్షించాలనుకుంటాయి..

మొదట ఎండాకాలం వెళ్లి అవ్వను అడిగినట్లే అడిగినపుడు.. ‘ఏం ఎండలు.. పాడు ఎండలు.. వేడిని తట్టుకోలేకపోతున్నా. అసలు ఎండాకాలమే లేకపోతే బాగుండేది’ అని కసురుకుంటుంది. దానికి బాధ పడిన ఎండాకాలం..

‘ అదేంటవ్వా.. ఈ కాలంలో దొరికిన పండ్లు, కూరగాయలూ ఏ కాలంలోనూ దొరకవు కదా! ఎందుకు అంతలా విసిగించుకుంటున్నావ్? పైగా ఎండాకాలం వస్తేనే కదా తరువాత వర్షాలు పడి, పంటలు బాగా పండేది’ అంటుంది.

‘ఎవరు చెప్పారు? ఎండాకాలం లేకపోయినా.. పడే వర్షాలు ఆగుతాయా? ’ అంటుంది. తోటలోది ఒక మామిడి కాయ కోసుకుంటా అని అడిగిన ఆమెకు చీవాట్లు పెట్టి పంపుతుంది.

మిగతా రెండు కాలాలు వచ్చినప్పుడూ అలాగే వాటిని అవమానించి పంపుతుంది..

హమ్మయ్యా.. మూడు కాలాలూ అయిపోయాయి. నేను ఇక్కడ ఇంత కష్టపడ్డాను. ఇక దేవదూతలు వచ్చి, తనకు బోలెడంత సంపదనిస్తాయి. అనుకుంటున్నప్పుడు.. పేదరాసి పెద్దమ్మ వస్తుంది.

తాను ఇచ్చిన ఇంటి పరిస్థితిని చూసి, కొంత బాధపడుతుంది. అయినా తమాయించుకుని..‘ఇక్కడ మీకు ఏం అసౌకర్యం కలగలేదు కదా?’ అని అడుగుతుంది.

దానికి ఆమె పేదరాసి పెద్దమ్మతో .. ‘ఏం ఇల్లు ఇది? మనుషులెవరైనా ఉండగలుగుతారా అసలు ఇక్కడ? నేను కాబట్టి ఉన్నాను. ఏదో నీ ఇంటి కాపలాగా నన్ను ఉంచావన్న సంగతి నాకు తెలియదనుకుంటున్నావా? ఇంకాలం నీ ఇంటిని జాగ్రత్తగా చూసుకున్నందుకు నువ్వే నాకు డబ్బులివ్వాలి’ అని అంటుంది.

కోపమొచ్చిన పేదరాసి పెద్దమ్మ ఆమెను ఇంట్లోంచి గేంటేస్తుంది. మూడు కాలాలూ.. ఈ సంఘటనతోనైనా ఆమెలో కొంతైనా మార్పు వచ్చిందేమో చూద్దామని.. దేవ దూతల రూపంలో ఆవిడకు కనిపించి, వరాన్ని కోరుకోమంటాయి. దానికి ఆమె.. ‘నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంగారం కురవాలి. నన్ను చూసి తన తల్లిని నా అల్లుడు గెంటేయాలి’ అని కోరుకుంటుంది.

దానికి కోపగించుకున్న కాలాలు ‘అలాగే!’ అని వెళ్లిపోతాయి..

కానీ ఊర్లోకి వెళ్లిన ఆమె ఎక్కడ కాలు పెట్టినా.. పురుగులు, చెత్త పడుతుంటాయి. దీంతో.. ఊరి ప్రజలందరూ ఆమెను వెళ్లగొడతారు. ఆఖరికి కూతురు కూడా అసహ్యించుకుంటుంది. ఎంతగా బ్రతిమాలినా కనీసం తలుపు కూడా తీయదు. దీంతో పారిపోయి మళ్లీ పేదరాసి పెద్దమ్మ దగ్గరికి వెళుతుంది. తన తప్పును క్షమించమనీ, తనకు ఆశ్రయం ఇవ్వమనీ అభ్యర్థిస్తుంది. కన్న కూతురే తనను అసహ్యించుకుందని బాధపడుతుంది. జాలిపడిన పేదరాసి పెద్దమ్మ ఆమె తీరు ఇతరులను ఎంతగా బాధపెట్టిందో తెలియజెప్పి, ఇకనైనా తన తీరు మార్చుకోమని చెప్పి, మళ్లీ ఇంటిని అప్పజెప్పి, జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, పర్యటనకు వెళుతుంది.

తను ఇంత చేసినా, తనపై జాలి చూపించిన పేదరాసి పెద్దమ్మకు కృతజ్ఞతలు చెప్పి, తను చేసిన ఖర్మ ఫలితమే కదా ఇది అని బాధపడుతుంది. తనను తాను మార్చుకుని, జీవితాంతం అందరినీ ఆదరించాలనుకుంటుంది.

అలా... కథ కంచికి చేరిందన్నమాట! 

 

 

 

 అని చెప్పిన కథను.. నేనూ ఇలాగే ముగించాను. ఆఖరిమాటను విని స్కూళ్లో నా తోటి విద్యార్థులు చాలాసార్లు ఏడిపించారు. ఇది తలచుకున్నప్పుడు మాత్రం ఇప్పటికీ పెదాలపై చిరునవ్వు విరుస్తుంది.

2 comments:

Anonymous said...

కథ చాలా బావుంది. చిన్నప్పుడు విన్న కథల్లో దొంగల వల్ల డబ్బు దొరకటం, దెయ్యాలు డబ్బులు ఇవ్వటం లాంటివి విన్నా. ఇలా కాలాలు రావటం ఎప్పుడూ వినలేదు.

anu said...

Thank you muralidharnamala గారూ..ఈ కథ ఇంకెక్కడైనా దొరుకుతుందేమోనని చూశాను. కానీ, ఇంకెక్కడా కనిపించలేదు.. ఎవరినోటా వినలేదు కూడా! అందుకే పెట్టాను.

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...