Sunday 23 July 2017

టీజర్ ఫిదా చేసింది...





                    డైరెక్టర్, హీరో, హీరోయిన్.. సాధారణంగా సినిమా చూడటానికి చాలావరకు ఇవే ప్రధాన కారణాలు అవుతాయి. కానీ నాకు ఒక డైలాగ్..
                          ‘బాడ్ కవ్.. బొక్కలు ఇరగ్గొడతా..’
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఒక పాట..
      ‘ఊరుకోదు.. ఊసుపోదు.. ఉండనీదు.. వెళ్లనీదు.. వింత ఖైదు.. ఏమిటో నాకిలా..!’ 

సినిమాపై ఆసక్తిని కలిగించాయి.


                            సినిమా అని కచ్చితంగా చెప్పలేను.. ఎందుకంటే నేను వినేటప్పటికి ఇవి  ఏ సినిమాలోవో నాకు తెలియదు. కానీ ఇవి దేంట్లోవా అని తెలుసుకోవాలనే కుతూహలంతో గూగుల్ లో  వెతికిన (మరీ ఎక్కువగా వెతకాల్సిన అవసరం రాలేదు.. సాయి పల్లవి డైలాగ్ కారణంగా) తర్వాత సినిమా పేరు ఫిదా కనిపించింది. అలా వెతికిన లింక్ తో ఫిదా టీజర్ చూశాను. 1, 2, 3, .... కనిపించినవన్నీ చూసేశాను. చాలా నచ్చాయి.
                            హీరోయిన్ గురించి నాకు పెద్దగా తెలియదు కానీ..ముకుంద సినిమానుంచే హీరో వరుణ్ తేజ్ నటన, ఆహార్యం, హావభావాలు నాకు చాలా నచ్చాయి. అంటే చాలా బాగా నటించేస్తాడు అని కాదు.. కానీ నచ్చేశాడంతే. ప్రత్యేకంగా కారణాలు చెప్పాలంటే .. కొంచెం కష్టమే.  ఈ రెండు ప్రధాన కారణాలు వెరసి, నన్ను థియేటర్ వైపు నడిపించాయి.
ఇక సినిమాలోకి వస్తే.. ముందుగా కథ గురించి చెప్పాలంటే.. ఒక స్టోరీ ఉంది అని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే.. ఇది మొత్తం పాత్రలు, వారి ఎమోషన్స్ అంతే. ఒక లైనులో చెప్పడం కష్టం.. చెబితే దాని అందాన్ని పోగొట్టినట్టే అవుతుందని నా భావన.
                               ఈ సినిమాలో ఇంకో ఆకర్షించే విషయం - హీరోయిన్ సాయి పల్లవి భానుమతి పాత్ర. సినిమా చూశాక ప్రధాన ఆకర్షణ కూడా ఈమే అవుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే.. సినిమాకి ప్రాణం. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఒక తమిళ అమ్మాయి.. తక్కువ సమయంలో తెలుగును అందునా.. తెలంగాణ యాసను ఒడిసిపట్టుకుని, ఏమాత్రం తప్పు దొర్లకుండా జాగ్రత్త పడటం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఆమె నుంచి వచ్చిన తెలంగాణ మాండలికం పాత్రకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది.
                              ఈమెది అల్లరిగా, చిలిపిగా కనిపించే ఒక బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్ర.  పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూనే భావోద్వేగాల మధ్య నలిగిపోయే తీరు చాలా చక్కగా చూపించగలిగింది. ‘వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిందే..’, ‘ఏ పిల్లగాడా..’ పాటల్లో డాన్స్ కూడా చాలా బాగా చేసింది.
                             ఇక వరుణ్ తేజ్...వరుణ్ పాత్రకు తను మాత్రమే సరిపోతాడు అనేలా చేశాడు.  ఎమోషన్స్ ను చాలా బాగా పలికించాడు. మామూలుగానే అతనిపై ఉన్న అభిమానం ఈ సినిమాతో మరింత పెరిగింది. అందరు హీరోలూ మాస్ చట్రంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే.. తను మాత్రం కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు నాకు అనిపించింది. మెగా ఫ్యామిలీ హీరో అనే ట్యాగ్ తో వచ్చినా.. చేసింది తక్కువ సినిమాలే అయినా మిగతా వారితో పోలిస్తే భిన్నంగా చేసుకుంటూ వెళ్లడం బాగా నచ్చింది.
                              సినిమా మొత్తంలో ఉన్నది కొద్ది పాత్రలే అయినా.. అందరూ తమ తమ పరిధి మేరకు బాగా చేశారు. ఏ పాత్ర కూడా అనవసరంగా అనిపించదు. కామెడీ కోసం ప్రత్యేకంగా పాట్లు కనిపించవు. ఈ విషయంలో శేఖర్ కమ్ముల తీసుకున్న జాగ్రత్త కనిపిస్తుంది.  అశ్లీలత లేకుండా హీరోయిన్ లను అందంగా మరెవరూ చూపించలేరేమో అనిపిస్తుంది ఈయన సినిమాలు చూస్తే. చాలా సాధారంగా చూపిస్తూనే.. ‘అరె.. హీరోయిన్ భలే అందంగా ఉందే..’ అనిపించేలా చూపిస్తాడు. చుట్టూ పరిసరాలను చాలా సహజంగా చూపించడంలోనూ తనదైన ముద్ర కనబరుస్తారు. ఈ సినిమాలోనూ తనదైన ముద్ర కనపడుతుంది.
                               సాధారణంగా సినిమాల్లో.. పల్లెటూరి వాతావరణం అనగానే కోనసీమ అందాలు, గోదావరి హొయలనే చూపిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణ పల్లెటూర్లూ.. అందులోని అందాలు, సంప్రదాయాలను ఉన్నది ఉన్నట్లుగా చాలా చక్కగా పరిచయం చేశారు.

                                             ‘జ్ఞానం ఇస్తున్నవ్ కదా.. పుక్కిట్ల మేమేం తీస్కోం’

                                 ‘ప్రేమ పుట్టకముందే సచ్చిపోయింది.. ఇంక నాకు సాకులు అవసరం లేదు’

                                     ‘ఒకరితో జీవితాంతం ఉండాలనుకుంటాం కదా.. తనే ఆ అమ్మాయి’

                           లాంటి చాలా సంభాషణలు ఆకట్టుకుంటాయి. కానీ ప్రత్యేకంగా, డైలాగ్ పెట్టాలి కాబట్టి రాశారు అనేలా ఉండవు. మరోసారి శేఖర్ కమ్ముల కలంలో నుంచి చాలా మంచి సంభాషణలు వచ్చాయి.
ఇందుకు విజయ్ సి. కుమార్ సినిమాటోగ్రఫీ చాలా తోడ్పడింది. రెండు భిన్న ప్రపంచాల తీరు, వాటి అందాలను బంధించడంలో ఆయన పాత్ర చాలా స్పష్టం. కళ్లకు హాయిగొలిపే ఆ అందాలకు జీవన్ బాబు అందించిన నేపథ్య సంగీతం శ్రవణానందాన్ని కలిగిస్తుంది.
                           ఇక నేను ముందే చెప్పినట్టు.. పాటలది కూడా ప్రధాన పాత్రే. పాటలన్నీ ప్రత్యేకంగా అతికించినట్టుగా కాకుండా కథలో భాగంగా సాగిపోతాయి. నృత్యాల కోసమే తీసినట్టుగా ఉండవు.. అసలలా లేవు కూడా. ఈ సినిమాకి సంగీతం అందించింది.. శక్తికాంత్. పాటలన్నీ హాయిగా.. ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. సినిమాలో భాగంగా చూసినప్పుడు మరింత ఆకట్టుకుంటాయి. మొత్తంగా కథతోపాటు, పాటలు కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా కొంతసేపు అలా మనసులో విహరిస్తూ ఉంటాయి.
                         అయితే ప్రథమార్థం చాలా ఆకట్టుకుంటుంది. చాలా చిలిపిగా, అల్లరిగా సాగిపోతుంది కాబట్టి. కానీ ద్వితీయార్థం చివర్లో ఏదో కాస్త వెలితి (హీరో ఇండియాకి వచ్చేయడం, హీరోయిన్ పెళ్లికి ఒప్పుకోవడంలో కొంత లాజిక్ మిస్ అవుతుంది) కనిపించినా.. మొత్తంగా అదో పెద్ద విషయం కాదు అనిపించడం ఖాయం.
                         ఉత్కంఠలేమీ లేకుండా.. గొడవలు, రక్తపాతాల జోలికి పోకుండా.. పంచ్ డైలాగ్ లు, ప్రాసలు లేకుండా.. అందమైన పల్లెటూరు, కుటుంబ ప్రేమలు, ఒక మంచి ప్రేమకథ, ఇద్దరి జీవితాలు, వినసొంపైన పాటలు.. సినిమా పూర్తయ్యేటప్పటికి ప్రశాంతమైన మనసుతో, హాయిగొలిపే భావనతో బయటికి రావాలనుకునేవారు ఎంచుకోదగ్గ సినిమా ఇది.


                మొత్తంగా నా వరకైతే టీజర్ ఫిదా చేసింది.. సినిమా దాన్ని కొనసాగించింది.

No comments:

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...