Friday 22 September 2017

రావణా.. జై జై జై (జై లవ కుశ రివ్యూ)


జై లవ కుశ.. అని పేరును ప్రకటించడం, అందునా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం అని ప్రకటించడంతోనే సినిమాపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. జై పాత్ర పోస్టర్ ఆ ఆసక్తిని మరింత పెంచింది. ఆ తరువాత విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచాయి. కానీ దీనిలో ఎక్కువ క్రెడిట్ జై పాత్రకు దక్కుతుందనే చెప్పాలి. ఈ పాత్రతోనే అటు ప్రేక్షకులతోపాటు మొత్తం సినిమా పరిశ్రమ దృష్టినీ ఆకర్షించారు ఎన్టీఆర్. వీటికితోడు టీజర్లు, ట్రైలర్ బద్దలుకొట్టిన రికార్డులు సరేసరి! ఇన్ని అంచనాల మధ్య జై, లవ, కుశ ఆకట్టుకున్నారా?
కథ, పాత్రల స్వభావం గురించి నిర్మాత కళ్యాణ్ రామ్, దర్శకుడు బాబీ తమ టీజర్ ద్వారానే వివరించారు. ఎన్టీఆర్ కూడా ఇది ఓ అన్నదమ్ముల కథ అనీ, వారి అనుబంధమే సినిమా అనీ ఒక రకంగా కథేమిటో ముందే చెప్పేశారు. మరి ఇక చూడాల్సిందేమిటంటే.. ఇద్దరు రామలక్ష్మణులైనప్పుడు ఒకడు రావణుడు ఎందుకయ్యాడనీ, మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఎంతవరకూ మెప్పించగలిగాడనీ.
 లవ పాత్రలోని అమాయకత్వాన్నీ, నిజాయతీనీ.. కుశగా తుంటరితనాన్నీ ఎన్టీఆర్ మిగతా సినిమాల్లోని ఏదో పాత్రల్లోలా భావించినా.. జై పాత్ర పూర్తిగా విలనిజంతో కూడుకున్నది. సాధారణంగా హీరోని నెగెటివ్ పాత్రలో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడరు.. ముఖ్యంగా మన తెలుగు ప్రజలు. పైగా ఈ పాత్రకు నత్తి కూడా ఉంది. ఎన్టీఆర్ అంటేనే గుర్తొచ్చేది.. అనర్గళంగా తను చెప్పే డైలాగులు. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని కూడా జై లాంటి పాత్రను ఎంచుకోవడం ధైర్యం, కథపై వారికున్న నమ్మకమనే చెప్పవచ్చు.
ముందుగా కథ విషయానికొస్తే.. పిల్లల మధ్య చూపించే భేదభావాలు వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేదే కథాంశం. దానికి బలైనవాడే.. జై అలియాస్ రావణ్.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం ఇంతకు ముందు చూసిందే. అదుర్స్ లో చారి పాత్రలో నవ్వులు పూయించారు. కానీ, తనలోని నటనకు నిజమైన పరీక్ష జై పాత్రనే. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సుకుమార్ మాట్లాడుతూ.. మేమంతా ఎన్టీఆర్ అనే నట మహాసముద్రం నుంచి స్పూన్లకొద్దీ నీళ్లనే వాడుకున్నాం. కానీ బాబీ ట్యాంకర్ల కొద్దీ వాడుకున్నాడని అనడం అతిశయోక్తి కాదనిపిస్తుంది. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయారు ఆయన.
ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్లో రావణుడిని పొగుడుతున్నపుడు అతని కళ్లలోని గర్వం, వెంటనే అలాంటి గంభీరమైన మొహంలో మొదలైన మార్పును ఏకకాలంలో చూపించగలగడం ఎన్టీఆర్ కే సాధ్యమనిపిస్తుంది. మూడు పాత్రలూ ఒకే గెటప్ లో ఉన్నపుడూ వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఒక్కరే మూడు చేశారంటే నమ్మాలనిపించదు. డ్యాన్సుల్లోనూ ఈ వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ కూడా బాగా తోడ్పడింది.
దర్శకుడు బాబీ జై పాత్రలోని రౌద్రాన్నీ, క్రూరత్వాన్నీ, అతను అలా మారడానికి గల కారణాలను చాలా కన్విన్సింగ్ గా చెప్పగలిగారు. ఒకవైపు భయపెడుతూనే మరోవైపు జాలిని కూడా కొనసాగిస్తాడు. ప్రీ క్లైమక్స్, క్లైమాక్స్ ల్లో కంటతడినీ పెట్టిస్తాడు. మొదటి భాగంలో కుశ పాత్రతో ఎంతగా నవ్విస్తాడో.. రెండో భాగంలో జై పాత్రతో అంతగా ఏడిపిస్తాడు. ఎలాంటివారికైనా ఆ సీన్లలో కన్ను చెమ్మగిల్లుతుంది.
రెండో భాగంలో.. కొన్ని సీన్లలో కథకు బలం చేకూరుస్తూ దేవీశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య వచ్చిన సీన్లలో. ఒకరకంగా సినిమాకే ప్రాణమని చెప్పాలి. హీరోయిన్లు- రాశి ఖన్నా, నివేథా థామస్, మిగిలిన పాత్రలు వాళ్ల వాళ్ల పరిధి మేరకు నటించారు. స్పెషల్ సాంగ్ లో తమన్నా బాగా చేసింది.. అదీ జై పాత్ర వచ్చాక కళ్లన్నీ మళ్లీ అతని మీదకే వెళ్లిపోతాయి.

ఏదైనా సినిమా గురించి మాట్లాడాలంటే.. కథ, హీరో, కామెడీ, విలన్ గురించి మాట్లాడుకుంటాం. కానీ జై లవ కుశ గురించి మాట్లాడాలంటే మాత్రం ఒక్క ఎన్టీఆర్ గురించే మాట్లాడాల్సి వస్తుంది.
చివరగా.. ఘట్టమేదైనా.. పాత్ర ఏదైనా ఎన్టీఆర్ కే సాధ్యం అనేలా ఒప్పించాడు. అందుకే.. ఎన్..టీ.. ఆర్.. జై జై జై అనక తప్పదు.
- నీరుకొండ అనూష

No comments:

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...