Saturday 29 September 2018

ఒక మనసు బాధ.. నా మాటల్లో..

చాలా దగ్గరగా చూసిన ఒక నిజానికి ఇలా అక్షర రూపం ఇచ్చాను.



Tuesday 21 August 2018

సింపుల్ కథ.. వేసింది బలమైన ముద్ర (చి.. ల.. సౌ..)







‘అనగనగా ఒక రాజకుమారుడు.. రెక్కల గుర్రం ఎక్కి వచ్చి పెళ్లి చేసుకుని నిన్ను తీసుకెళతాడు..’ చిన్నపుడు ఎక్కడో  ఎవరికో చెబుతున్నపుడు విన్నాను. కథ మొత్తం విన్నానా లేదా గుర్తులేదు. కానీ విన్నపుడు పెద్దగా నవ్వుకున్నట్లు గుర్తు. ఆ వయసులో నాకంతగా నవ్వు తెప్పించేలా ఏం అనిపించిందో తెలియదు. ఈ మాటలు తరువాత సినిమాల్లోనూ, బయటా చాలాసార్లు విన్నాను. ఇప్పటికీ నవ్వు వస్తుంది. సమాధానం మాత్రం ఇప్పటికీ తెలియదు.

                            ‘‘చి.. ల.. సౌ..’’ చూశాక మాత్రం ఒక ఆలోచన తట్టింది. 
చిన్నప్పటి నుంచే అమ్మాయిని పెళ్లి అనే విషయానికి మానసికంగా సిద్ధం చేస్తున్నారేమో అని!

సినిమాలో హీరోయిన్ ఒక మధ్యతరగతి అమ్మాయి. తండ్రి లేడు. పైగా ఇంట్లో పెద్ద కూతురు.. ఆపై బాధ్యతలు, పెళ్లి ఒత్తిడి! ప్రతి ఒక్కరూ పెళ్లంటే ఎంతో కొంత ఒత్తిడికి గురవుతారు. కానీ మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్లికి సంబంధించి అమ్మాయిపై  ఊహ తెలిసినప్పటి నుంచే మానసికంగా తెలియకుండానే ఒక భారం ఉంటుందని నేను ఫీలవుతుంటాను. నిజానికి నమ్ముతుంటాను. అందుకు చుట్టూ చూసిన సంఘటనలూ కారణమై ఉండొచ్చు. చిన్నపుడే ఇంత మెచ్యూరిటీ ఉందనుకోను.. అప్పుడేదో ఊహించుకుని నవ్వొచ్చుండొచ్చు. కానీ పెద్దయ్యాక మాత్రం ఈ సంఘటనలే కారణమయ్యాయి.

ఇక సినిమా విషయానికొస్తే.. ప్రేమ పెళ్లిళ్లను మినహాయిస్తే.. పెళ్లి, పెళ్లిచూపులు ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణ అంశమే! పెళ్లిచూపుల పేరుతో ఒక గంటలో అవతలి వ్యక్తి ఎలా నచ్చేస్తారు? పైగా జీవితాంతం కలిసుండాలి అనిపించేంతగా! ఆ వ్యక్తే తనకు సరైన వ్యక్తి అని ఎలా తెలుస్తుంది? ఇలా సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో. అయినా విజయవంతమైన పెళ్లిళ్లు, మన వివాహ వ్యవస్థను చూస్తే మాత్రం అందులో ఏదో మ్యాజిక్ ఉందనిపిస్తుంది. ఆ మ్యాజిక్ ను ఆధారంగా చేసుకుని అల్లిన కథే.. ‘చి..ల.. సౌ’.

ఇంతకంటే ఫలానా కథ ఉందని చెప్పలేం. అలాగని సినిమాలో ఏమీ లేదనీ కాదు. రెండు భిన్న మనస్తత్వాలు, కుబుంబ నేపథ్యాలు.. వారి మధ్య భావోద్వేగాలు. రెండున్నర గంటలు కూర్చునేలా చేస్తాయి. మొదట్లో కొంచెం అనాసక్తిగా అనిపించడం వాస్తవమే అయినా తరువాత ఎక్కడా ఆ భావన ఉండదు. మొత్తంగా ఓ ఇద్దరి జీవితాల్లో ముఖ్యమైన కొన్ని గంటల సమయాన్ని దగ్గరగా చూసిన భావన కలుగుతుంది. అలాగే కొన్నిచోట్ల ముఖ్యంగా ఎక్కువమంది అమ్మాయిలకు.. తమను తామేచూసుకుంటున్నట్టూ అనిపిస్తుంది. ఎక్కువమంది కనెక్ట్ అవ్వడానికి కారణం-హీరోయిన్ పాత్రే! బలమైన మనస్తత్వం ఉన్న అందమైన అమ్మాయి. తల్లి ఆరోగ్యం కారణంగా ఆమెను తిరస్కరిస్తుంటారు. ఆ సన్నివేశాలు, అప్పుడు వచ్చే సంభాషణలు ఆలోచింపజేస్తాయి.

రిచ్  ఫ్రేములూ, లోకేషన్లూ లేవు, మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు లేవు, భారీ డైలాగులూ లేవు. కానీ.. అందంగా అనిపించే సన్నివేశాలున్నాయి. కథకు అందంగా జతకట్టే సంగీతం ఉంది. మనసుకు హత్తుకునే సంభాషణలుంటాయి. వాటి అందాన్ని మాటల్లో చెప్పాలంటే.. కష్టమే.
‘ప్రేమ కంటే అలవాటు బలమైంది‘
‘నువ్వు మళ్లీ మళ్లీ రావడం నాకు నచ్చుతోంది. ఆ నచ్చడం నాకు నచ్చట్లేదు’
‘నా కోసం హత్య చేసి, జైలుకైనా వెళ్తావు కానీ.. నన్ను పెళ్లి మాత్రం చేసుకోవు’
వినడానికి ఎంత చిన్న డైలాగులు.. ఆయా సన్నివేశాలకే ప్రాణం పోశాయి. ఇలా ఎన్నో ఉన్నాయి. చూడటానికి చిన్న సినిమాగా,  చెప్పడానికి సింపుల్ కథగా అనిపిస్తుంది. కానీ మనసుపై బలమైన ముద్ర వేస్తుంది. ఎమోషన్స్ తో కట్టిపడేస్తుంది.

                         కాస్త విరామం తీసుకోవాలనో, ఆ పాత జ్ఞాపకాలను అందంగా నెమరేసుకోవాలనో      
                                               అనుకునేవారు  ఎంచుకోదగ్గ సినిమా. 

నా వరకూ నేనైతే.. సినిమా కంటే.. ఓ చిన్న ప్రేమకథను దగ్గర్నుంచి చూసినట్టుగా ఫీలయ్యాను. మాటల్లో చెప్పలేని కొన్ని అనుభూతులనూ, కొన్ని జ్ఞాపకాలనూ  అనుభవించాను.

Tuesday 26 June 2018

లేలేత రెక్కల రంగుల కల!




అదిగో.. అల్లంత దూరాన సీతాకోకచిలుక. నాకైతే కనిపించడం లేదు. నా ప్రియ నేస్తానికి కూడానూ. కానీ ఉంది. ఇద్దరికీ అదే భావన. భావన కాదు.. ఉనికి తెలుస్తోంది. కేవలం మా ఇద్దరికే పరిమితమైన ఆనందం తాలూకు భావన. ఆతురతగా ఉంది.. త్వరగా వెళ్లి అందుకోవాలని. మనసంతా ఇదని  చెప్పలేని భావోద్వేగాల మిశ్రమంతో నిండిపోయింది. నేను వడివడిగా అడుగులు వేస్తున్నా. నా గమ్యాన్ని త్వరగా చేరుకోవాలనీ, ఆ ఆనందాన్ని చేజిక్కించుకోవాలనీ!

అరే! ఏమైంది? నా అడుగులు, నా పాదాల మువ్వల సవ్వడి మినహా ఏం వినిపించడం లేదే! వెనక్కి తిరిగి చూద్దునా? అమ్మో! ఆ లిప్తపాటు కాలం వృథా అవుతుందేమో? లేదు లేదు నేను త్వరత్వరగా వెళ్లాలి. ముందుకు సాగాలి. వెళ్లాలని తనువు తొందర పెడుతూనే ఉంది కానీ, మనసు కదలని మొరాయిస్తోంది. వెనక్కి తిరగక తప్పలేదు.

నిజమే.. గమనించలేదు కానీ.. ఏడి? నా ప్రియనేస్తం జాడ కనిపించడం లేదే.. కాస్త తీక్షణంగా చూద్దునా..! ఆ.. అడిగో అల్లంత దూరాన ఉన్నాడు. అలా ఆగిపోయాడే? ఏమైంది? కళ్లతోనే సైగ చేశా.  ఏమీలేదు.. నువ్వు ముందుకు సాగు. క్షణంలో నీ పక్కనుంటాను. .కలిగి సాగుతాను అన్నాడు. సరేనంటూ మునుపటి ఉత్సాహంతో పయనం ప్రారంభించాను. ఇప్పటిదాకా వేగంగా కదిలిన కాలం.. ఏమైందో మరి నత్తనడక సాగిస్తోంది. కాలమా? నేనా? బహుశా నేనేనేమో!

అవును నా వేగమే తగ్గింది. అడుగులు భారంగా పడుతున్నాయి. మరి నా నేస్తం సంగతేంటి? ఈసారి కనుచూపు మేరలో కూడా కనపడటం లేదు. ఇంత కాలంపాటూ తను ఇంకా నన్ను చేరతాడనే చూస్తున్నా. ఆనందం మాటున తనని అశ్రద్ధ చేశానని అలగలేదు కదా! లేదులే.. తనే కదా నన్ను ముందుకు సాగమంది. ఇప్పటివరకూ కొనసాగించగలిగాను. కానీ.. ఇప్పుడు ఆసరా కావాలనిపిస్తోంది. గమ్యం చాలా చేరువగా ఉంది. చుట్టూ చాలామందే ఉన్నారు. కానీ నేస్తం.. నువ్వే కావాలి. నీతోనే నడవాలి. అందుకోనున్న ఆనందాన్ని నీతోనే పంచుకోవాలి.. ఈ మాటలన్నీ తనతో పంచుకోవాలనుంది. నా ఉద్వేగాన్ని తన ముందు పరచాలనుంది. కానీ.. ఎక్కడ? ఎలా?

కాలం సాగుతూనే ఉంది. అల్లంత దూరాన అప్పుడప్పుడు కనిపించే నీ జాడ మినహా.. నీతో ఊసులాడే వీలేది. ఎందుకంత తీరిక లేకుండా సాగుతున్నావు? అరె.. ఏంటీ నొప్పి అకస్మాత్తుగా! అత్యంత ఆనంద సమయాన్ని అనుభవించడానికి ముందు కొంత బాధ తప్పదంటారు. కానీ.. ఒళ్లంతా చట్రంలో నలిపేస్తున్నంత బాధా? ఎముకలన్నీ ఒక్కసారిగా విరిచేస్తున్నంత నొప్పా? భరించగలనా? లేనేమో! చచ్చిపోతానేమో అన్నంత భయం.. ఒళ్లంతా చెమటలు. నేస్తమా.. ఒక్కసారి రావా? ఎందుకో నిన్ను బాగా చూడాలనిపిస్తోంది. అటుగా ఎవరో వస్తే చెప్పిపంపాను.

ఒక్కసారిగా ఏం జరిగిందో తెలీదు.. పళ్లు బిగుసుకున్న ఊహ మినహా.. !అయితే.. చిన్నగా రెక్కలు విప్పుకున్నసీతాకోకచిలుక అలికిడి. సంతోషం.. ఒక్కసారిగా! ఇప్పటిదాకా పడిన బాధ తాలూకూ ఆనవాళ్లే లేని ఆనందం. కంటిలో నీరే.. అయితే దు:ఖంతో కూడుకున్నది కాదు. పెదవులపై చిరునవ్వు ఆ విషయాన్ని రూఢీ చేస్తోంది. పంచుకోవాలనుకుని చుట్టూ చూశానా..! నువ్వే. అదే ఆనందంతో. కోపమొచ్చింది.. అడిగేశా.. ఇప్పటిదాకా ఎక్కడని? ఏం చెప్పావ్? ఈ చిన్నారి సీతాకోక చిలుకకు అన్నీ సమకూర్చడానికి వెళ్లానని. పట్టలేని ఆనందం. అయితే.. మరి నేను అనే ప్రశ్న మనసులో పొరల్లో ఏర్పడింది. ఆ సమయంలో గుండెల్లో చివుక్కుమన్నబాధ. గుండుసూదితో గుచ్చినట్టుగా!

సీతాకోక చిలుక పెరుగుతోంది. బాగా ఎగురుతోంది. మాతో ఆడుతోంది. తనతోపాటు ఆనందమూ హెచ్చుతోంది. అయితే గాయం తాలూకూ మచ్చ మాత్రం అప్పుడప్పుడూ ఏదో లోటును గుర్తు చేస్తూనే ఉంది.

Sunday 17 June 2018

హాయిగా.. ‘సమ్మోహనం’గా!



అనగనగా ఓ తార.. నీలాకాశంలో మెరిసేది కాదు. సినిమా తార.
అనగనగా ఓ బొమ్మలబ్బాయి.. అమ్మేవాడు కాదు. గీసే అబ్బాయి.

అబ్బాయికేమో ఆ లోకమే పడదు (సినిమా లోకం). తనదంతా పిల్లలూ, వాళ్లకోసం గీసే బొమ్మలు.. ఇదే లోకం. అమ్మాయికేమో సినిమానే లోకం.  అమ్మాయి షూటింగ్ కోసం అబ్బాయి వాళ్లింటికి వస్తుంది. అలా అనుకోకుండా కలిశారు. స్నేహితులయ్యారు. అప్పటిదాకా సినీలోకంలో అందరూ  నటించేవారే ఉంటారనుకునే అబ్బాయికి ఈ ‘తార’లా మంచివారూ, సున్నితమనస్కులూ ఉంటారని అర్థమైంది. ఇంకేముంది తారపై ప్రేమ కలిగింది. కానీ తార నాకు ఆ ఉద్దేశం లేదంటుంది. అబ్బాయి బాధ పడతాడు. అమ్మాయి చేసిన ఒక పని కారణంగా కోపం తెచ్చుకుంటాడు. తరువాత ఏమైంది? ఒక బూచి కారణంగా తార అలా చేసిందని తెలుసుకుంటాడు. ‘సారీ’ చెబుతాడు. తారతో మళ్లీ కలిసిపోతాడు. అలా కథ కంచికి చేరుతుంది.

- స్థూలంగా ఇదీ ‘సమ్మోహనం’ సినిమా కథ.

ఒక సింపుల్, చిన్నపుడు విన్న కథలా అనిపించే సినిమా.  ఆ అనుభూతిని కొనసాగిస్తూ టైటిళ్ల దగ్గర్నుంచి, సినిమా పూర్తయ్యే వరకూ ఎక్కడోచోట దర్శనమిచ్చే కార్టూన్లు. మొత్తంగా ఒక్కసారి అలా చిన్నతనంలోకి తీసుకెళ్తాయి.  సినిమాలో చెప్పుకోడానికి పెద్ద కథా లేదు.. కంటినీరు తెప్పించే భావోద్వేగాలూ లేవు. అయితే ఒక మ్యాజిక్ మాత్రం మొదట్నుంచీ మనతో ప్రయాణిస్తుంది. చాలాసార్లు తరువాత వచ్చే సీన్లను అంచనా వేసేస్తాం. అయినప్పటికీ నచ్చేస్తోందంటే మ్యాజిక్ అనే చెప్పాలిగా! 

రెండు సీన్లు మినహాయించి.. పెద్దగా గుర్తిండిపోయే డైలాగులుండవు. అలాగని బాలేవనీ కాదు.  మామూలుగా మాట్లాడుకున్నట్టుగానే ఉంటాయి.. కానీ ప్రతీది ఆకట్టుకుంటుంది. పాటలు బాగున్నాయి. చెప్పమంటే.. ఒక లిరిక్ కూడా గుర్తుండదు. కథలో చొచ్చుకుని పోయుంటాయి కదా..! హాయిగా అనుభవించగలం.. కానీ గుర్తుంచుకోలేం. బలమైన భావోద్వేగాలు లేవు కానీ.. బంధాల మధ్య ప్రేమ, ఆత్మీయత నచ్చుతాయి. సెటైర్లున్నాయి.. ఆలోచించేలా, నవ్వుకునేలా. సందేశమూ ఉంది.. కానీ అంతర్లీనంగా. చాలా సాధారణంగా.. ఒకసారి ఆలోచించేలా.. పాటించి చూడాలనిపించేలా!

హాయిగా నవ్వించే కామెడీ, అందంగా కనిపించే ఫ్రేములూ.. అసభ్యత కనిపించని మాటలూ. అలరించే నేపథ్య సంగీతం, పాటలు. రోజువారీ ఒత్తిళ్లకీ దూరంగా.. కాస్త కొత్తదానాన్ని ఆస్వాదించా.

Monday 14 May 2018

‘మహానటి’ని చూశా.. ఒక ఆరాధనను వెంట తెచ్చుకున్నా!



ఏదో తెలియని బాధ.. ఓ పక్క గుండెను పిండేస్తూనే.. గొంతు నుంచి బయటకు రానంటోంది.

ఒక జీవితంలో.. నిజానికి ఎవరి జీవితంలోనైనా కష్టసుఖాలు సాధారణమే! కానీ ఆమె ఆనందంలో నవ్వునూ.. కష్టంలో దు:ఖాన్ని సమంగా అనుభవించేలా చేసింది.. సావిత్రి గారి జీవితం/ సినిమా.. ‘మహానటి’.

ఇక్కడ ఆవిడ జీవితం కదిలించిందని చెప్పాలో.. ఆమె జీవితాన్ని సినిమాగా చూపించి చెరగని ముద్ర వేశాడని దర్శకుడు నాగ్ అశ్విన్ ను అభినందించాలో అర్థం కావడంలేదు.

కొందరిని చూస్తే అమ్మ ప్రేమ గుర్తొస్తుంది. మరికొందరిని చూస్తే ప్రేమంతా పోత పోసినట్లు అనిపిస్తుంది. ఇంకొందరు మొండితనానికి నిలువెత్తు రూపంలా అగుపిస్తారు. ఈ లక్షణాలన్నీ కలిపి చేసిన అందమైన బొమ్మ సావిత్రి. Extreme అన్న పదానికి ఒక తార్కాణంలా అనిపిస్తారావిడ.

‘మహానటి’ సినిమా గురించి మొదటగా నేను విన్నపుడు దాని మీద పెద్దగా అభిప్రాయం ఏమీ కలుగలేదు (సావిత్రి గారి మీద కాదు.. సినిమా మీద). కానీ కీర్తి సురేష్ ని సావిత్రిలా పరిచయం చేస్తూ వచ్చిన స్టిల్ మాత్రం నన్ను ఆకర్షించింది. ఎంతలా అంటే.. టీజర్ లో సంభాషణలు వింటే ఒక సినిమాగానే చూస్తానేమో! సావిత్రిగారిని కాదేమో అని భయపడేంతగా. మామూలుగా టీజర్ అంటే ఆసక్తికరమైనవే చూపిస్తారు అని నా అభిప్రాయం. దీంతో సినిమా మొత్తం ఎలా ఉంటుందో అనే భయం. అయితే ‘మహానటి’లో మాత్రం ఆవిడే కనిపించారు.



ఒక సినిమాగా దీన్ని నేను ప్రస్తావించలేను కానీ.. పాత్రధారుల గురించి మాత్రం చెప్పాలనుకుంటున్నా.  సావిత్రి గారి గురించి నాకు పూర్తిగా తెలుసు అని చెప్పలేను. కానీ.. మా నాన్న, పెదనాన్న కారణంగా అలవాటైన పాత సినిమాల ద్వారా పరిచయమే. ఇప్పటికీ నాకు నచ్చిన హీరోయిన్ అంటే.. మొదట వచ్చే పేరు సావిత్రినే. కీర్తి సురేష్.. సావిత్రి గారిలా నటించింది అని చెప్పడం కంటే.. జీవించేసింది అని చెప్పొచ్చు. ఒకరకంగా ఒక బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించింది. ఆమె తండ్రి కోసం పడే ఆరాటంలో.. ఉద్వేగాన్నీ, ప్రేమలో ఉన్నపుడు.. ఆనందాన్నీ, తాను మోసపోయానని తెలిసినపుడు.. బాధనీ ఆమెతోపాటు మనమూ అనుభవిస్తాం. అంతలా జీవించిందామె. మొత్తంగా సావిత్రి గారే కనిపించారు అనీ చెప్పలేను.. అక్కడక్కడా కీర్తినే కనిపించినప్పటికీ.. అంత గుర్తించ దగ్గదేం కాదు. అయితే తెరపై సావిత్రికి ఇంకెవరో డబ్బింగ్ చెప్పినట్లనిపిస్తుంది. 

దుల్కర్ సల్మాన్.. జెమినీ గణేశన్ లా కనిపించలేదు (పోలికల పరంగా). కానీ సావిత్రికి సపోర్ట్ గా ఉన్నపుడూ, తరువాత ఆమె ఇతన్ని మించి పోతోందన్నపుడు ఏర్పడిన ఈర్ష్య.. ఈ రెండు వేరియేషన్స్ నూ చక్కగా పోషించారు. అయితే జెమినీ గణేశన్ మీద నాకెపుడూ నెగెటివ్ ఫీలింగే ఉండేది. అయితే సావిత్రిని తన భార్యగా చెప్పిన తీరు మాత్రం నచ్చింది.. దానికి దుల్కర్ కూడా కారణమై ఉండొచ్చు.

పెద్ద పెద్ద డైలాగ్ లు చెబుతూ, యాంగ్రీ మ్యాన్ గా కనిపించే మోహన్ బాబు.. ఎస్.వి. రంగారావు పాత్రకి చక్కగా కుదిరారు. అంత శాంతంగా.. ఆయన్ని ఇంకే సినిమాలోనూ చూడలేదు నేను. 


ఇంకో ముఖ్యమైన పాత్ర సమంత. మొదట్నుంచీ అమాయకంగా, దానికితోడు నత్తితో కనిపిస్తూనే.. చివరికి ఏడిపిస్తుంది. సావిత్రి కథ పరిచయం నుంచి ముగింపు వరకు అన్నీ తనతోనే ముడిపడి ఉంటాయి. మిగతా పాత్రలన్నీ వేటికవే ప్రాధాన్యంతో కూడుకున్నవి. అయితే.. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య కనిపించినపుడల్లా.. ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ చేయలేదే అనిపిస్తుంది. ఇంకెవరినీ ఊహించలేకో ఏమో ఒక్క సీనుకే పరిమితం చేశారు.. అదీ పెద్దాయన ముఖాన్ని గ్రాఫిక్ గా ఉపయోగించి (ఎన్టీఆర్.. చేసుండాల్సింది కదా!).

‘శంకరయ్య ఎవరు?’ ‘సావిత్రితో అతనికున్న సంబంధం ఏంటి?’ అనే ప్రశ్నలతో ప్రారంభమై.. సావిత్రి చిన్నతనం, తండ్రి కోసం పడే ఆరాటం, నువ్వు చేయలేవు.. అని ఎవరైనా అంటే.. ఎందుకు చేయలేననే పట్టుదల, సినిమాల్లోకి వచ్చిన వైనం, ప్రేమ, పెళ్లి, నటిగా ఎదిగిన వైనం, ఆమె జాలి గుణం, భర్తతో విభేదాలు, పతనం.. దానిలోనూ వీడని దాన గుణం.. అన్నిటినీ మనసుకు హత్తుకునేలా, ఒక జీవితాన్ని దగ్గర్నుంచి చూస్తున్నట్టుగా చిత్రీకరించారు నాగ్ అశ్విన్. 

అసలు ప్రేమంటేనే.. సంక్లిష్టమైనది. అప్పటికే పెళ్లి అయినవాడిని/ తగని వారిని ఎంచుకున్నపుడు అది మరింత బాధనే ఇస్తుంది. సావిత్రి లాంటి మనస్తత్వానికి ఆమె జీవితంలో ఆ ప్రేమ ఏయే పరిణామాలను తీసుకొచ్చిందో.. చివరికి ఆమె ఎలా మిగిలిందో.. దర్శకుడు చక్కగా చూపించారు. అందుకు బుర్రా సాయి మాధవ్ సంభాషణలు, చక్కని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోడయ్యాయి. సందర్భానికి తగ్గట్టుగా నేపధ్య సంగీతం కథతోపాటు నడిచింది.  ఒక రకంగా ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక బృందం ఒక సాహసాన్ని ఎంచుకుని, అందరినీ మెప్పించేలా పూర్తిచేయగలిగింది. ఒక మహా అధ్యాయాన్ని అందంగా, నిజాయతీగా అందించడంలో విజయవంతమైంది.

సాధారణంగా ఒక సినిమాను చూసినపుడు దాన్ని ఎంజాయ్ చేయడమో, దాని నుంచి ఏదైనా సందేశం తెలుసుకోవడమో కనిపిస్తుంటుంది. మొదటిసారిగా కథ, కథనాలు, పాత్రలను కాకుండా ఒక వ్యక్తినీ, ఆమె వ్యక్తిత్వాన్నీ అభిమానిస్తున్నాను. 

ఆమె నుంచి ఏదో నేర్చుకోవాలి లేదా ఆమెలా ఇవి చేయకూడదు అని భావించాలని అనిపించట్లేదు. కేవలం.. కేవలం.. ఒక ఆరాధనని వెంట తెచ్చుకున్నాను.

Friday 27 April 2018

ప్రేమంటే..?



మౌనంలో గుసగుసలు..
గుండెల్లో పదనిసలు..
భాష కూడా పోల్చలేని కొంగొత్త భావం..
నిన్న మొన్న ఎప్పుడూ చూడని కొత్త లోక పరిచయం..
యుగాలైనా క్షణాలుగా మార్చేయగల మాయాజాలం..
ఇదేగా ప్రేమ ఇంద్రజాలం..!

అసలు ప్రేమంటే..?
నిఘంటువులకు అందని అర్థం.
కవులు సైతం వర్ణించలేని భావం.
మునుపెన్నడూ పలకరించని అనుభవం.
గతంలో పరిచయమేలేని అనుబంధం.
‘తను’ మాత్రమే అందించగల ఆత్మీయ హస్తం.

కళ్లతోనే భావప్రసరణ...
ఒక చిన్న చిరునవ్వు కోసం తపన.
లోకంలో మాటలే తక్కువైన భావన.
కొత్త కొత్తగా సాగే ఆలోచన..
నీడ కూడా కొత్తదై పోయిందన్న భావన.
ప్రేమలో ఉన్నారనడానికి ఇవేగా తార్కాణాలు..

అలాంటి ప్రేమకోరోజు.. ప్రేమికులకో పండుగ రోజు.

ఏదో మెయిల్ వెతుకుతుంటే.. కనపడిందిది. రెండు, మూడేళ్ల క్రితం ప్రేమికులరోజుకు సంబంధించి సరదాగా రాసింది. ఇప్పుడిలా నా బ్లాగుకు చేరింది.

Sunday 1 April 2018

తెలుగు వెలుగులో నా లేఖ

ఏదో చదువుతుంటే ఒక ఆలోచన వచ్చింది. దాన్ని వ్యాసంగా మలిచాను. అయితే ఒక అబ్బాయి, అమ్మాయి ఇలా దృష్టిలో పెట్టుకోకుండా.. ఇద్దరు వ్యక్తుల ఎడబాటుగా రాశాను. తెలుగు వెలుగు వారికి పంపాను. వారికి నచ్చి ఈ మార్చి సంచికలో ప్రచురించారు. దాన్ని కింద జత చేస్తున్నాను..


‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...