Tuesday 26 June 2018

లేలేత రెక్కల రంగుల కల!




అదిగో.. అల్లంత దూరాన సీతాకోకచిలుక. నాకైతే కనిపించడం లేదు. నా ప్రియ నేస్తానికి కూడానూ. కానీ ఉంది. ఇద్దరికీ అదే భావన. భావన కాదు.. ఉనికి తెలుస్తోంది. కేవలం మా ఇద్దరికే పరిమితమైన ఆనందం తాలూకు భావన. ఆతురతగా ఉంది.. త్వరగా వెళ్లి అందుకోవాలని. మనసంతా ఇదని  చెప్పలేని భావోద్వేగాల మిశ్రమంతో నిండిపోయింది. నేను వడివడిగా అడుగులు వేస్తున్నా. నా గమ్యాన్ని త్వరగా చేరుకోవాలనీ, ఆ ఆనందాన్ని చేజిక్కించుకోవాలనీ!

అరే! ఏమైంది? నా అడుగులు, నా పాదాల మువ్వల సవ్వడి మినహా ఏం వినిపించడం లేదే! వెనక్కి తిరిగి చూద్దునా? అమ్మో! ఆ లిప్తపాటు కాలం వృథా అవుతుందేమో? లేదు లేదు నేను త్వరత్వరగా వెళ్లాలి. ముందుకు సాగాలి. వెళ్లాలని తనువు తొందర పెడుతూనే ఉంది కానీ, మనసు కదలని మొరాయిస్తోంది. వెనక్కి తిరగక తప్పలేదు.

నిజమే.. గమనించలేదు కానీ.. ఏడి? నా ప్రియనేస్తం జాడ కనిపించడం లేదే.. కాస్త తీక్షణంగా చూద్దునా..! ఆ.. అడిగో అల్లంత దూరాన ఉన్నాడు. అలా ఆగిపోయాడే? ఏమైంది? కళ్లతోనే సైగ చేశా.  ఏమీలేదు.. నువ్వు ముందుకు సాగు. క్షణంలో నీ పక్కనుంటాను. .కలిగి సాగుతాను అన్నాడు. సరేనంటూ మునుపటి ఉత్సాహంతో పయనం ప్రారంభించాను. ఇప్పటిదాకా వేగంగా కదిలిన కాలం.. ఏమైందో మరి నత్తనడక సాగిస్తోంది. కాలమా? నేనా? బహుశా నేనేనేమో!

అవును నా వేగమే తగ్గింది. అడుగులు భారంగా పడుతున్నాయి. మరి నా నేస్తం సంగతేంటి? ఈసారి కనుచూపు మేరలో కూడా కనపడటం లేదు. ఇంత కాలంపాటూ తను ఇంకా నన్ను చేరతాడనే చూస్తున్నా. ఆనందం మాటున తనని అశ్రద్ధ చేశానని అలగలేదు కదా! లేదులే.. తనే కదా నన్ను ముందుకు సాగమంది. ఇప్పటివరకూ కొనసాగించగలిగాను. కానీ.. ఇప్పుడు ఆసరా కావాలనిపిస్తోంది. గమ్యం చాలా చేరువగా ఉంది. చుట్టూ చాలామందే ఉన్నారు. కానీ నేస్తం.. నువ్వే కావాలి. నీతోనే నడవాలి. అందుకోనున్న ఆనందాన్ని నీతోనే పంచుకోవాలి.. ఈ మాటలన్నీ తనతో పంచుకోవాలనుంది. నా ఉద్వేగాన్ని తన ముందు పరచాలనుంది. కానీ.. ఎక్కడ? ఎలా?

కాలం సాగుతూనే ఉంది. అల్లంత దూరాన అప్పుడప్పుడు కనిపించే నీ జాడ మినహా.. నీతో ఊసులాడే వీలేది. ఎందుకంత తీరిక లేకుండా సాగుతున్నావు? అరె.. ఏంటీ నొప్పి అకస్మాత్తుగా! అత్యంత ఆనంద సమయాన్ని అనుభవించడానికి ముందు కొంత బాధ తప్పదంటారు. కానీ.. ఒళ్లంతా చట్రంలో నలిపేస్తున్నంత బాధా? ఎముకలన్నీ ఒక్కసారిగా విరిచేస్తున్నంత నొప్పా? భరించగలనా? లేనేమో! చచ్చిపోతానేమో అన్నంత భయం.. ఒళ్లంతా చెమటలు. నేస్తమా.. ఒక్కసారి రావా? ఎందుకో నిన్ను బాగా చూడాలనిపిస్తోంది. అటుగా ఎవరో వస్తే చెప్పిపంపాను.

ఒక్కసారిగా ఏం జరిగిందో తెలీదు.. పళ్లు బిగుసుకున్న ఊహ మినహా.. !అయితే.. చిన్నగా రెక్కలు విప్పుకున్నసీతాకోకచిలుక అలికిడి. సంతోషం.. ఒక్కసారిగా! ఇప్పటిదాకా పడిన బాధ తాలూకూ ఆనవాళ్లే లేని ఆనందం. కంటిలో నీరే.. అయితే దు:ఖంతో కూడుకున్నది కాదు. పెదవులపై చిరునవ్వు ఆ విషయాన్ని రూఢీ చేస్తోంది. పంచుకోవాలనుకుని చుట్టూ చూశానా..! నువ్వే. అదే ఆనందంతో. కోపమొచ్చింది.. అడిగేశా.. ఇప్పటిదాకా ఎక్కడని? ఏం చెప్పావ్? ఈ చిన్నారి సీతాకోక చిలుకకు అన్నీ సమకూర్చడానికి వెళ్లానని. పట్టలేని ఆనందం. అయితే.. మరి నేను అనే ప్రశ్న మనసులో పొరల్లో ఏర్పడింది. ఆ సమయంలో గుండెల్లో చివుక్కుమన్నబాధ. గుండుసూదితో గుచ్చినట్టుగా!

సీతాకోక చిలుక పెరుగుతోంది. బాగా ఎగురుతోంది. మాతో ఆడుతోంది. తనతోపాటు ఆనందమూ హెచ్చుతోంది. అయితే గాయం తాలూకూ మచ్చ మాత్రం అప్పుడప్పుడూ ఏదో లోటును గుర్తు చేస్తూనే ఉంది.

Sunday 17 June 2018

హాయిగా.. ‘సమ్మోహనం’గా!



అనగనగా ఓ తార.. నీలాకాశంలో మెరిసేది కాదు. సినిమా తార.
అనగనగా ఓ బొమ్మలబ్బాయి.. అమ్మేవాడు కాదు. గీసే అబ్బాయి.

అబ్బాయికేమో ఆ లోకమే పడదు (సినిమా లోకం). తనదంతా పిల్లలూ, వాళ్లకోసం గీసే బొమ్మలు.. ఇదే లోకం. అమ్మాయికేమో సినిమానే లోకం.  అమ్మాయి షూటింగ్ కోసం అబ్బాయి వాళ్లింటికి వస్తుంది. అలా అనుకోకుండా కలిశారు. స్నేహితులయ్యారు. అప్పటిదాకా సినీలోకంలో అందరూ  నటించేవారే ఉంటారనుకునే అబ్బాయికి ఈ ‘తార’లా మంచివారూ, సున్నితమనస్కులూ ఉంటారని అర్థమైంది. ఇంకేముంది తారపై ప్రేమ కలిగింది. కానీ తార నాకు ఆ ఉద్దేశం లేదంటుంది. అబ్బాయి బాధ పడతాడు. అమ్మాయి చేసిన ఒక పని కారణంగా కోపం తెచ్చుకుంటాడు. తరువాత ఏమైంది? ఒక బూచి కారణంగా తార అలా చేసిందని తెలుసుకుంటాడు. ‘సారీ’ చెబుతాడు. తారతో మళ్లీ కలిసిపోతాడు. అలా కథ కంచికి చేరుతుంది.

- స్థూలంగా ఇదీ ‘సమ్మోహనం’ సినిమా కథ.

ఒక సింపుల్, చిన్నపుడు విన్న కథలా అనిపించే సినిమా.  ఆ అనుభూతిని కొనసాగిస్తూ టైటిళ్ల దగ్గర్నుంచి, సినిమా పూర్తయ్యే వరకూ ఎక్కడోచోట దర్శనమిచ్చే కార్టూన్లు. మొత్తంగా ఒక్కసారి అలా చిన్నతనంలోకి తీసుకెళ్తాయి.  సినిమాలో చెప్పుకోడానికి పెద్ద కథా లేదు.. కంటినీరు తెప్పించే భావోద్వేగాలూ లేవు. అయితే ఒక మ్యాజిక్ మాత్రం మొదట్నుంచీ మనతో ప్రయాణిస్తుంది. చాలాసార్లు తరువాత వచ్చే సీన్లను అంచనా వేసేస్తాం. అయినప్పటికీ నచ్చేస్తోందంటే మ్యాజిక్ అనే చెప్పాలిగా! 

రెండు సీన్లు మినహాయించి.. పెద్దగా గుర్తిండిపోయే డైలాగులుండవు. అలాగని బాలేవనీ కాదు.  మామూలుగా మాట్లాడుకున్నట్టుగానే ఉంటాయి.. కానీ ప్రతీది ఆకట్టుకుంటుంది. పాటలు బాగున్నాయి. చెప్పమంటే.. ఒక లిరిక్ కూడా గుర్తుండదు. కథలో చొచ్చుకుని పోయుంటాయి కదా..! హాయిగా అనుభవించగలం.. కానీ గుర్తుంచుకోలేం. బలమైన భావోద్వేగాలు లేవు కానీ.. బంధాల మధ్య ప్రేమ, ఆత్మీయత నచ్చుతాయి. సెటైర్లున్నాయి.. ఆలోచించేలా, నవ్వుకునేలా. సందేశమూ ఉంది.. కానీ అంతర్లీనంగా. చాలా సాధారణంగా.. ఒకసారి ఆలోచించేలా.. పాటించి చూడాలనిపించేలా!

హాయిగా నవ్వించే కామెడీ, అందంగా కనిపించే ఫ్రేములూ.. అసభ్యత కనిపించని మాటలూ. అలరించే నేపథ్య సంగీతం, పాటలు. రోజువారీ ఒత్తిళ్లకీ దూరంగా.. కాస్త కొత్తదానాన్ని ఆస్వాదించా.

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...