Tuesday 21 August 2018

సింపుల్ కథ.. వేసింది బలమైన ముద్ర (చి.. ల.. సౌ..)







‘అనగనగా ఒక రాజకుమారుడు.. రెక్కల గుర్రం ఎక్కి వచ్చి పెళ్లి చేసుకుని నిన్ను తీసుకెళతాడు..’ చిన్నపుడు ఎక్కడో  ఎవరికో చెబుతున్నపుడు విన్నాను. కథ మొత్తం విన్నానా లేదా గుర్తులేదు. కానీ విన్నపుడు పెద్దగా నవ్వుకున్నట్లు గుర్తు. ఆ వయసులో నాకంతగా నవ్వు తెప్పించేలా ఏం అనిపించిందో తెలియదు. ఈ మాటలు తరువాత సినిమాల్లోనూ, బయటా చాలాసార్లు విన్నాను. ఇప్పటికీ నవ్వు వస్తుంది. సమాధానం మాత్రం ఇప్పటికీ తెలియదు.

                            ‘‘చి.. ల.. సౌ..’’ చూశాక మాత్రం ఒక ఆలోచన తట్టింది. 
చిన్నప్పటి నుంచే అమ్మాయిని పెళ్లి అనే విషయానికి మానసికంగా సిద్ధం చేస్తున్నారేమో అని!

సినిమాలో హీరోయిన్ ఒక మధ్యతరగతి అమ్మాయి. తండ్రి లేడు. పైగా ఇంట్లో పెద్ద కూతురు.. ఆపై బాధ్యతలు, పెళ్లి ఒత్తిడి! ప్రతి ఒక్కరూ పెళ్లంటే ఎంతో కొంత ఒత్తిడికి గురవుతారు. కానీ మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్లికి సంబంధించి అమ్మాయిపై  ఊహ తెలిసినప్పటి నుంచే మానసికంగా తెలియకుండానే ఒక భారం ఉంటుందని నేను ఫీలవుతుంటాను. నిజానికి నమ్ముతుంటాను. అందుకు చుట్టూ చూసిన సంఘటనలూ కారణమై ఉండొచ్చు. చిన్నపుడే ఇంత మెచ్యూరిటీ ఉందనుకోను.. అప్పుడేదో ఊహించుకుని నవ్వొచ్చుండొచ్చు. కానీ పెద్దయ్యాక మాత్రం ఈ సంఘటనలే కారణమయ్యాయి.

ఇక సినిమా విషయానికొస్తే.. ప్రేమ పెళ్లిళ్లను మినహాయిస్తే.. పెళ్లి, పెళ్లిచూపులు ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణ అంశమే! పెళ్లిచూపుల పేరుతో ఒక గంటలో అవతలి వ్యక్తి ఎలా నచ్చేస్తారు? పైగా జీవితాంతం కలిసుండాలి అనిపించేంతగా! ఆ వ్యక్తే తనకు సరైన వ్యక్తి అని ఎలా తెలుస్తుంది? ఇలా సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో. అయినా విజయవంతమైన పెళ్లిళ్లు, మన వివాహ వ్యవస్థను చూస్తే మాత్రం అందులో ఏదో మ్యాజిక్ ఉందనిపిస్తుంది. ఆ మ్యాజిక్ ను ఆధారంగా చేసుకుని అల్లిన కథే.. ‘చి..ల.. సౌ’.

ఇంతకంటే ఫలానా కథ ఉందని చెప్పలేం. అలాగని సినిమాలో ఏమీ లేదనీ కాదు. రెండు భిన్న మనస్తత్వాలు, కుబుంబ నేపథ్యాలు.. వారి మధ్య భావోద్వేగాలు. రెండున్నర గంటలు కూర్చునేలా చేస్తాయి. మొదట్లో కొంచెం అనాసక్తిగా అనిపించడం వాస్తవమే అయినా తరువాత ఎక్కడా ఆ భావన ఉండదు. మొత్తంగా ఓ ఇద్దరి జీవితాల్లో ముఖ్యమైన కొన్ని గంటల సమయాన్ని దగ్గరగా చూసిన భావన కలుగుతుంది. అలాగే కొన్నిచోట్ల ముఖ్యంగా ఎక్కువమంది అమ్మాయిలకు.. తమను తామేచూసుకుంటున్నట్టూ అనిపిస్తుంది. ఎక్కువమంది కనెక్ట్ అవ్వడానికి కారణం-హీరోయిన్ పాత్రే! బలమైన మనస్తత్వం ఉన్న అందమైన అమ్మాయి. తల్లి ఆరోగ్యం కారణంగా ఆమెను తిరస్కరిస్తుంటారు. ఆ సన్నివేశాలు, అప్పుడు వచ్చే సంభాషణలు ఆలోచింపజేస్తాయి.

రిచ్  ఫ్రేములూ, లోకేషన్లూ లేవు, మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు లేవు, భారీ డైలాగులూ లేవు. కానీ.. అందంగా అనిపించే సన్నివేశాలున్నాయి. కథకు అందంగా జతకట్టే సంగీతం ఉంది. మనసుకు హత్తుకునే సంభాషణలుంటాయి. వాటి అందాన్ని మాటల్లో చెప్పాలంటే.. కష్టమే.
‘ప్రేమ కంటే అలవాటు బలమైంది‘
‘నువ్వు మళ్లీ మళ్లీ రావడం నాకు నచ్చుతోంది. ఆ నచ్చడం నాకు నచ్చట్లేదు’
‘నా కోసం హత్య చేసి, జైలుకైనా వెళ్తావు కానీ.. నన్ను పెళ్లి మాత్రం చేసుకోవు’
వినడానికి ఎంత చిన్న డైలాగులు.. ఆయా సన్నివేశాలకే ప్రాణం పోశాయి. ఇలా ఎన్నో ఉన్నాయి. చూడటానికి చిన్న సినిమాగా,  చెప్పడానికి సింపుల్ కథగా అనిపిస్తుంది. కానీ మనసుపై బలమైన ముద్ర వేస్తుంది. ఎమోషన్స్ తో కట్టిపడేస్తుంది.

                         కాస్త విరామం తీసుకోవాలనో, ఆ పాత జ్ఞాపకాలను అందంగా నెమరేసుకోవాలనో      
                                               అనుకునేవారు  ఎంచుకోదగ్గ సినిమా. 

నా వరకూ నేనైతే.. సినిమా కంటే.. ఓ చిన్న ప్రేమకథను దగ్గర్నుంచి చూసినట్టుగా ఫీలయ్యాను. మాటల్లో చెప్పలేని కొన్ని అనుభూతులనూ, కొన్ని జ్ఞాపకాలనూ  అనుభవించాను.

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...