Saturday 26 November 2016

ఎదలోయలో.. ఏ మూలనో!

కాలేజీకి వచ్చాను.. ఎప్పటిలాగే ముందు నేనే. అందరూ వచ్చేలోగా అలా ఒక చుట్టు చుట్టి వద్దామని అడుగులేస్తున్నా. అప్పటిలాగానే ఉంది. పెద్దగా మార్పులేదు. రంగులు మినహా! అయినా నా పిచ్చికానీ.. మూడు సంవత్సరాల్లో పెద్దగా మార్పులేముంటాయి? అయినా ఎందుకు ఉండకూడదు? వారం రోజుల్లోనే ఎన్నో మారుతుంటాయి. మూడు సంవత్సరాలంటే మాటలా మార్పు సహజమే..! ఒక్కసారిగా నవ్వు వచ్చింది. రెండు భిన్నాభిప్రాయాలను నాకు నేనే చెప్పుకున్నందుకు.





అపుడే వచ్చి గంటవుతోంది. ఇంకా ఎవరూ రావట్లేదు. నేనేం మరీ ముందుగా రాలేదు.  కేవలం అరగంట అంతే. చిన్నపుడు ఒక్కనిమిషం ఆలస్యం కారణంగా దెబ్బలు తిన్న సందర్భముంది. ఇక అప్పటినుంచి కనీసం 10 నిమిషాల ముందుగానే చేరుకుంటాను ఎక్కడికైనా.

చెప్పిన సమయం దాటి అరగంట గడుస్తున్నా ఒక్కరి జాడాలేదు.

దగ్గర్లో ఉన్న పచ్చికపై కూర్చున్నా. ఎప్పుడైనా లీజర్ వస్తే నేనూ, అవనీ ఇక్కడే కూర్చుంటాం. ఎన్ని కబుర్లో..! రోజూ పక్కనే కూర్చుని ఉన్నా.. ఇక్కడ కూర్చుంటే మాత్రం ఎక్కడలేని విషయాలన్నీ గుర్తొచ్చేస్తాయి. సమయమే తెలిసేది కాదు. ఆత్మీయ సమ్మేళనం అని అవనినే ఫోన్ చేసింది.

‘అందరూ బిజీ అయ్యారు. ఎవరూ రారు. మొక్కుబడిగా ఓ పదిమంది వచ్చి సెల్ఫీలు తీసుకుని వెళ్లిపోతారు. ఈ మాత్రం దానికి ఎందుకే? నేను రాను’ అన్నాను.
‘అలాంటివేం ఉండవు. సాయంత్రం వరకూ మొబైళ్లు మూగబోవాల్సిందే. వెళ్లబోయే ముందు మాత్రమే ఫోటోలు..’ అంది.
‘అయినా ఎందుకో రావాలనిపించట్లేదే’.
‘నీ ఇష్టం.. అందరూ వస్తున్నారు.. అందరూ..........’ అంటూ నొక్కి చెప్పింది. దాంతో ఇక కాదనలేకపోయాను. తెలియకుండానే పెదవులపై చిరునవ్వు చేరింది.

*******

‘రానన్నావు.. ఇప్పుడేమో అందరికంటే ముందు నువ్వే వచ్చేశావు. పైగా పక్కన వచ్చి కూర్చున్నా పట్టించుకోనంత దీర్ఘాలోచనతో.. ఏంటి సంగతి?’అంటూ కళ్లెగరేసింది.
‘హే.. ఎంతసేపైందే వచ్చి? గమనించలేదు. నీ గురించే ఆలోచిస్తూ కూర్చున్నా’.
‘కొయ్.. కొయ్.. నాకు తెలియదనుకుంటున్నావా?’
‘నిజమే. సర్లే కానీ.. ఇంత ఆలస్యమైందే? నేను వచ్చి గంటకుపైగా అయ్యింది’.
‘మేమూ పొద్దున్నే వచ్చాం తల్లీ. అందరూ అటువైపు ఉంటే.. నువ్వేమో ఇక్కడ కూర్చుని..  పైగా మాటలా?!’
‘అవునా! నేనింకా ఎవరూ రాలేదనుకుంటున్నాను. అయినా నేను కాలేజ్ మొత్తం తిరిగానే!? ఎవరూ కనిపించలేదు’.
‘హ్మ్.. అందరినీ డిస్ర్టబ్ చేయడమెందుకులే అని అటు ఇంజినీరింగ్ బ్లాక్ వైపు ఏర్పాటు చేశాం. రా.. అందరూ వచ్చేశారు.. రా రా..’ అంటూ లాక్కునిమరీ వెళ్లింది.

తనేదో పనుందని నన్ను అక్కడ వదిలేసింది. ఎవరెవరు వచ్చారా అని వెతుకుతూ.. కనిపించిన వాళ్లని పలకరిస్తూ ముందుకు సాగాను. మాట్లాడుతున్నాను కానీ.. నా కళ్లు మాత్రం ఇంకా వెతుకుతూనే ఉన్నాయి.. అసలైన వారి కోసం.

నిరీక్షణ కొనసాగుతోంది కానీ, ఫలితం మాత్రం శూన్యం. కోపం వచ్చింది అవనిపై అబద్ధం చెప్పినందుకు. కోపాన్ని బాధ వెనక్కు నెట్టి కళ్లలో నుంచి వర్షించడానికి సిద్ధమైంది. పక్కనున్నవారు కనిపెట్టేస్తారేమోనని వారి దగ్గర సెలవు తీసుకుని పక్కకు వచ్చేశాను. ఇంతలో అవని వచ్చి.. ‘అనూ.. ఇక్కడున్నవా? నీకోసమే వెతుకుతున్నాను. ఇక్కడేం చేస్తున్నావు?’ అంటూ అటువైపు తిరిగి ఉన్న నన్ను తనవైపు తిప్పుకుంది.

‘ఏంటే? కుళాయి తిప్పేశావ్?’ అని కంగారుపడింది.
‘అందరూ వస్తారని చెప్పావ్?’
‘వచ్చారుగా..!’
‘ఎక్కడ?’
‘ఇంతమంది కళ్లముందు కనిపిస్తుంటే.. రాలేదంటావే?’
కోపంగా ఒకచూపు చూశాను.
‘ఓహ్.. ఇప్పుడర్థమైంది.. నీకు కనిపించకపోతే రానట్లేనా?’
‘అయితే అందరూ నిజంగానే వచ్చారా?’ అంటూ ఆశగా తనవైపు చూశాను.
‘అందరూ.. అని ఎందుకు? కావాల్సినవాళ్లు వచ్చారా అని అడగొచ్చుగా.. అసలు ఇది ఏర్పాటు చేసిందే తను. నీకు సర్.ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు.  అక్కడ కరెంటుకు సంబంధించి ఏదో సమస్య వస్తే వెళ్లారు.. అదిగో.. నువ్వడిగిన అందరు వస్తున్నారు..’ అంటూ చూపించింది.

నా ఎదురుచూపులు ఫలించాయి.. ముఖం మీద సిగ్గుతో కూడిన నవ్వొకటి వచ్చింది.. నా చూపులు ప్రసరిస్తున్నవైపు చూసి, హ్మ్.. అంటూ ఒక నిట్టూర్పు విడిచి..
‘ప్రశాంత్! ఒక్కసారి ఇటురా.. ’ అంటూ పిలిచింది. నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి, పక్కకు వెళ్లబోయాను. తను నా చేయి పట్టుకుని ఆపింది.

తను మా దగ్గరికి వస్తోంటే, గుండె వేగం పెరిగింది. ఇక కదలాలనుకున్నా కదల్లేకపోయాను.
‘హే.. అనూ! ఎలా ఉన్నావ్? ఎంతసేపైంది వచ్చి? సంవత్సరమైంది నీ గురించిన విషయాలే తెలియదు.. ఫేస్.బుక్ లోనూ అందుబాటులో లేవు.. నీ నంబర్ మార్చావా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. కానీ నేను తనవైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నాడో కూడా వినిపించుకోలేదు.
అవనీనే గమనించి..‘తను బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. తెలుసుగా తనకు సోషల్ వెబ్.సైట్స్ లో ఉండడం పెద్దగా ఇష్టముండదని. తన నంబర్ నేను ఇస్తాలే. ఇంతకీ వెళ్లిన పని అయిపోయిందా?’ అని అడిగింది.
‘ఏంటి ఇన్ని సంవత్సరాలైనా తన సమాధానం కూడా నువ్వే చెబుతావా? ఇప్పటికీ మాట్లాడడానికి సిగ్గేనా?’ అన్నాడు.
నిన్నే అడిగేది అన్నట్లు అవనీ గిల్లింది. నేను ‘అబ్బే.. అదేం లేదు’ అన్నాను.
‘హమ్మయ్యా.. మొత్తానికి నోరు విప్పావు. కవితలు చెప్పేటపుడు మాత్రమే విప్పుతావేమో అనుకున్నాన్నేనింకా!’

సర్లే మీరు మాట్లాడుకుంటూ ఉండండి.. నేను ఇప్పుడే వస్తాను అంటూ అవని వెళ్లబోయింది. నేను కంగారుపడి వెళ్లొద్దని వారించాను. ఇంతలో తనే ఎవరో పిలిస్తే ఇప్పుడే వస్తానంటూ వెళ్లిపోయాడు.

‘ఇంకా నీకు ధైర్యం రాలేదానే? ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇదే వరుస. ఇకనైనా చెప్పొచ్చు కదా!’
‘చెప్పడానికేముందే?’
‘ఏమీ లేనిదే కనిపించకపోతే ఆ కంగారెందుకు?’
ఏం చెప్పాలో తెలియక నేను మౌనాన్ని ఆశ్రయించాను. తనేమో విసుగును ప్రదర్శించింది. ఇంతలో స్టేజీ మీద అనౌన్స్.మెంట్ రావడంతో ఇద్దరం ఆ దిశగా కదిలాం.
అందరూ అప్పటి రోజుల్నీ, అనుభవాలనూ చెబుతున్నారు. అందరం  ఆ పాత జ్నాపకాల్లో కి వెళ్లిపోయాం. ఇంతలో రాజు అని మా బ్యాచ్ మేట్.. తన అనుభవాలను చెబుతూ.. ‘అనుపమ (స్నేహితులు అనూ అని పిలుస్తారు) మాత్రం నాకు బాకీ ఉంది అన్నాడు’ నేను షాక్ కు గురై ఏంటన్నట్లు చూశాను. తరువాత తను చెప్పడం మొదలు పెట్టాడు. నేను మాత్రం ఆరోజుల్లోకి వెళ్లిపోయాను.

********

డిగ్రీ వరకూ పక్క ఊర్లోనే చదువుకున్నాను. అదీ తెలుగు మీడియం. పీజీకి మాత్రం హైదరాబాద్ కు రావాల్సి వచ్చింది. అలవాటు ప్రకారం ముందుగానే వచ్చి సర్టిఫికెట్లు, ఫీజు వివరాలు తెలుసుకుని, కాలేజీలో చేరాను. అలా మా కాలేజీలో మొదట చేరింది నేనే అయ్యాను. దాంతో కొందరు సీనియర్లను కలిసే అవకాశమూ వచ్చింది. అపుడే నేనెపుడూ విననీ, పేపర్లలో మాత్రమే చదివిన అనుభవమున్న ర్యాగింగ్ గురించి విన్నాను. కానీ ఇక్కడ అంత భయపడాల్సిన పని లేదని చెప్పడంతో కొంత ఊరట కలిగింది.

కళాశాలలో చేరాల్సిన రోజు రానే వచ్చింది. కళాశాల హాస్టల్ లోనే చేరాను. మొదటిరోజు సీనియర్లందరూ బాగానే పలకరించారు. లెక్చరర్లు వారిని వారు పరిచయం చేసుకుని, సిలబస్ గురించి చెప్పారు. తరువాత మా పరిచయాలు జరిగాయి. ఆరోజు చూశాను.. ప్రశాంత్ ని. కొత్త విద్యార్థి అంటే ఎవరూ నమ్మరేమో! అందరితో అంతలా కలిసిపోయాడు. అమ్మాయిలూ.. అబ్బాయిలూ అందరూ తనతో పరిచయం చేసుకోవాలని చూసేవారే. నాకు మాత్రం ఎవరూ స్నేహితులవలేదు.

మరుసటి రోజు కొత్తగా ఒకమ్మాయి వచ్చింది. తనే అవని. తను మాట్లాడే విధానం నాకు నచ్చింది. అప్పటి నుంచి తనే నా ఫ్రెండ్. అందరితో మాట్లాడినా ప్రతి తరగతిలో ఎందుకో నా మనసుకు ఒక్కరే  దగ్గరయ్యేవారు.

నాకు ఇంకా ఆనందాన్నిచ్చే విషయం- అవని హాస్టల్ లో నా రూమే. మాతో పాటు ఇంకా నలుగురు చేరారు. ఇలా మా పరిచయాలు అయ్యాయో లేదో.. సీనియర్ అమ్మాయిల నుంచి పిలుపు. వెళ్లి అలవాటుగా అక్కా అని పిలిచాం. అంతే.. సీరియస్ అయ్యారు. మేడం అని పిలవాలంటూ.. సీనియర్ల రూల్స్ ను వివరించారు. రోజూ ర్యాగింగ్ పేరుతో పద్యాలు, పాటలు, డాన్సులంటూ చేయించారు. అసలే సిగ్గరి అయిన నేను వారి చేష్టలకు భయపడ్డాను. నాతోపాటు మిగతావారూను..

ఇక పగలేమో అందరూ కలిసి ర్యాగింగ్ చేసేవారు. దానికి ఇంట్రాక్షన్ (పరస్పర పరిచయం) అని పేరు పెట్టారు. దానిలో భాగంగా సెల్యూట్ చేయడం.. పాటలు పాడడం.. ఎవరి గురించి వారు పరిచయం చేసుకోవడం ఉండేది. ఇది బాగానే ఉండేది. కానీ నాకేమో సెల్యూట్ ఎన్నిసార్లు చేసినా వచ్చేది కాదు. విద్యార్థులందరూ గుమ్మం బయట అమ్మాయిలూ, అబ్బాయిలూ చేరో వరుసలో నిలబడి, ఒక్కొక్కరుగా సెల్యూట్ కొడుతూ రావాలన్నమాట. నాకు రాకపోయేసరికి ఒక పక్కన నిలబెట్టేవారు. నాకేమో ఏడుపొచ్చేది.  దాంతో వెళ్లమనేవారు. ఒకసారి మాత్రం అలాగే నిలబెట్టేశారు. తరువాత సీనియర్లు వెళ్లిపోయాక  ఏడ్చేశాను. అప్పుడే ప్రశాంత్ వచ్చి మొదటిసారిగా నాతో మాట్లాడాడు.. సెల్యూట్ ఎలా చేయాలో నేర్పించాడు. అదేంటో అవనీ ఎన్నిసార్లు నేర్పించినా అసలు రాలేదు. కానీ అపుడు వచ్చింది. తరువాతి రోజు కరెక్టుగా కొట్టాను. ఫలితంగా నా చెప్పుకూడా తెగింది. నడుద్దామంటే.. కుంటుకుంటూ వెళ్లాలి. పోనీ చెప్పు చేత్తో పట్టుకుందామంటే.. ఇబ్బంది. దీంతో అందరూ వెళ్లేంతవరకూ ఆగాల్సి వచ్చింది.

‘నువ్విక్కడే ఉండు.. నేనిపుడే ఒక కవరు తీసుకుని వస్తా..’ అంటూ అవనీ వెళ్లింది. కిటికీలో నుంచి బయటికి చూద్దును కదా.. కాలేజీ బస్సులన్నీ వరుసలో ఉంటే.. ఒక్కొకరూ తమ బస్సుల్లో ఎక్కుతున్నారు. నేనేమో సరదాగా తెగిన చెప్పుతోనే నడుస్తూ తరగతంతా కలియతిరుగుతున్నాను.  అపుడే ఒక బెంచీపై పుస్తకం ఉండడం గమనించాను. తీయాలా వద్దా అన్న సంశయం. పోనీలే దాచి రేపు ఎవరిదో కనుక్కుని ఇద్దామని నిశ్చయించుకుని, నా పుస్తకాలతోపాటు పెట్టేశాను.

అవనీ వస్తోందో లేదో చూద్దామని గుమ్మం వరకూ వెళ్తోంటే.. ఒక్కసారిగా ఎవరో దూసుకు వచ్చి బలంగా తాకారు. నేను ఒక్కసారిగా తూలి పడిపోతుంటే ఆ చేయే బలంగా నన్ను తనవైపుకు లాగింది. ఆ చేయి ప్రశాంత్ ది. నేను ఆశ్చర్యంగా తనను అలాగే చూస్తూ ఉండిపోయాను.. తను నా వైపు చూసి కళ్లెగరేసే వరకూ. తమాయించుకుని చూసేసరికి నా ఒక చేయి తన చేతిలోనూ రెండోది అతని భుజంపైనా ఉంది. దూరంగా జరుగుతోంటే.. తెగిన చెప్పు కదా.. కాలు మెలికపడింది.  కాలు నొప్పి. తనే సరిగా నిల్చోవడానికి సాయం చేశాడు. కదల్లేను.. అలానే పట్టుకుని ఉండలేను. మొహమంతా చిరుచెమట, సన్నటి ఒణుకు, భయంతో కూడిన బిడియం..

ఇంతలో అవని వచ్చి నా అవస్థ తెలుసుకుని, తన సాయంతో ఒకచోట కూర్చోబెట్టింది. బెణికిన కాలుని నేను వారిస్తున్నా వినకుండా ప్రశాంతే.. సరిచేశాడు. తను కాలు పట్టుకోవడం చాలా సిగ్గుగా, ఇబ్బందిగా అనిపించింది. తను మాత్రం ఇది చాలా మామూలు విషయమన్నట్టు ఉన్నాడు. ఎందుకో తెలీదు.. అపుడు మాత్రం మనసు చివుక్కుమంది.

‘అవును.. నువ్వేంటి ఇక్కడ?’ అని అడిగింది అవనీ ఏదో గుర్తొచ్చినట్లు..

‘హయ్యా.. మరిచేపోయాను.. పుస్తకం మరచిపోయాను.. దాన్ని తీసుకుందామనే వచ్చా’ అంటూ.. దాన్ని తీసుకుని వెళ్లిపోబోతుంటే.. ఇద్దరం థాంక్స్ చెప్పాం.. తను ఒక నవ్వు నవ్వి పరుగున వెళ్లిపోయాడు. తరువాత చిన్నగా మేమూ హాస్టల్ చేరుకున్నాం.

ఆరోజు రాత్రి  సీనియర్లకు ఎలా తెలిసిందో, క్లాస్ తీసుకున్నారు. చెప్పేది వినకుండా తిట్టేశారు. మామూలుగానే ఎవరితోనూ మాట్లాడేవాళ్లం కాదు. వాళ్లు పలకరించినా ముక్తసరిగా చెప్పేవాళ్లం. అయినా తిట్టడమేకాక ఆరోజు అర్ధరాత్రి 12 గంటల వరకూ నిలబెట్టి ఉంచేశారు. అసలే కాలు నొప్పి, పైగా అంతసేపు నిలబెట్టారు. దీంతో ఏర్పడ్డ  భయానికి నాకు జ్వరం వచ్చింది. మరుసటి రోజు తరగతిలో ఎవరు పలకరించినా పలకలేదు. మధ్యాహ్నం లంచ్ సమయంలో తినకుండా నేనూ, అవని అలానే ఉన్నాం.

 నేనేమో అసలు చదువు మానేసి పోవాలనీ, తనేమో పిర్యాదు చేయాలని. ఇంతలో ప్రశాంత్ వచ్చి పలకరించడంతో నాకు తెలియకుండానే ఏడ్చేశాను. విషయం తెలుసుకుని మా అందరినీ తీసుకుని యాజమాన్యం దగ్గరికి వెళ్లాడు. ఇక అప్పటి నుంచి మాకు హాస్టల్ లో ర్యాగింగ్ బాధ తప్పింది. ఈ సంఘటన తరువాత ప్రశాంత్ పై సహజంగానే ఏర్పడిన ఆత్మీయభావం ఇంకా పెరిగింది.

కానీ కళాశాలలో మాత్రం ఇంట్రాక్షన్ సెషన్ కొనసాగుతూనే ఉండేది. ఇద్దరూ లేదా ముగ్గురు కలిసి ఒక్కొక్కరినీ, ఒక్కోసారి ఇద్దరినీ చేస్తుండేవారు. అపుడపుడూ ఈ అవకాశాన్ని సీనియర్ అమ్మాయిలు మా విషయంలో బాగానే ఉపయోగించుకునేవారు. ఓ సందర్భంలో నిలబెట్టి, ఎవరికైనా ప్రపోజ్ చేయమన్నారు. లేదంటే గంటపాటు నిలబడాలన్నారు. నాకు భయమేసింది. అయినా నిలబడడానికే ఒప్పుకున్నాను. కానీ వాళ్లు బెంచీ మీద అన్నారు. దాంతో ఏం చేయాలో తోచలేదు. ప్రశాంత్ ని కూడా పిలిచారు. కొంచెం ధైర్యమనిపించింది. తనకు పువ్వు ఇచ్చి నాకు ప్రపోజ్ చేయమన్నారు. తను మోకాళ్ల మీద నిల్చుని ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా’అని చెప్పాడు. తెలియదు ఎందుకో.. చాలా ఆనందమేసింది.

‘చూశావుగా.. ఎంత తేలికగా చెప్పాడో.. అతను చెప్పింది మరచిపోయి.. నువ్వు చెప్పు.. తెలుగు మీడియం కదా.. అచ్చ తెలుగులో చెప్పు’అన్నారు.

పేరుకు వాళ్లు చెప్పింది వింటున్నానే కానీ, నా చూపులు మాత్రం ప్రశాంత్ వైపే ఉన్నాయి. తను చెప్పిన మాటలే నా మస్తిష్కంలో తిరుగుతూ ఉన్నాయి. పక్కనెవరూ కనిపించడంలేదు.. ఎక్కడో దూరంగా రణగొన ధ్వనిలా వినిపిస్తున్నాయి మిగతా వారి మాటలు.. నిద్రలో నడుస్తున్నట్టుగా వెళ్లి పువ్వు పట్టుకుని..

‘తెలియదు.. ఈ మాట ఇంత అందంగా ఉంటుందని- నువ్వు చెప్పేంతవరకూ. తెలియదు.. పరిచయం లేని ఈ మాట ఇంత మధురంగా హృదయాన్ని తాకుతుందని! - నీ నుంచి వినేంత వరకూ.  తెలియదు నీ నుంచి ఈ మాట కోసమై నా మనసు ఎన్నో ఏళ్లుగా పరితపిస్తోందని- నీ ద్వారా అనుభవమయ్యేంతరకూ.. నాకు ఈ ఆనందాన్ని రుచి చూపించిన నిన్ను నేనూ ప్రేమిస్తున్నా!’

వాళ్ల చప్పట్లు మోగేంతవరకూ నిజంగానే నాకు తెలియలేదు.. ఆ మాటలను నేను నిజంగానే చెప్పాననీ.. తొలిరోజు చూసినప్పటినుంచే నేను ప్రశాంత్ ను ఇష్టపడుతున్నాననీ!

భలే చెప్పావంటూ అవనీ, ప్రశాంత్, ఇంకా అందరూనూ మెచ్చుకున్నారు. కానీ మనస్ఫూర్తిగా చెప్పానని గ్రహించింది మాత్రం అవనీనే. కానీ మొదట బయటపడలేదు. కానీ అది బయటపడేలా ఇంకో సందర్భమెదురైంది. ఆరోజు మాత్రం అడిగేసింది.
‘అనూ.. ఒకటి అడగాలనుకుంటున్నా.. అడగనా?’
‘వద్దంటే మాత్రం ఆగుతావా ఏంటి? అడుగు..’
‘నీకు ప్రశాంత్ అంటే ఇష్టమా?’
‘ఏ.. నీకు ఇష్టం లేదా?’
‘నేను సీరియస్ గా అడుగుతున్నా.. నువ్వు తనను ప్రేమిస్తున్నావా?’
ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాను..
‘సమాధానం చెప్పమంటే ఎటో చూస్తావేంటి?’
‘నీకేమనిపిస్తోంది?’
‘ప్రేమిస్తున్నావనే అనిపిస్తోంది’
‘అనిపించినపుడు ఇక నన్ను అడగడమెందుకు?’
‘అయితే నిజమేనన్నమాట!’
‘నేనలా అనలేదే?’
‘మరి?!’
‘ప్రేమో.. ఇంకేమిటో! నాకైతే తెలియదు. చూడాలనిపిస్తుంది... మాట్లాడాలనిపిస్తుంది.. తను చూసినా, మాట్లాడినా బొమ్మలా అయిపోతాను. ఏదో భయం. ఎందుకో తెలియదు’.
‘ఎప్పుడు చెబుతావ్?’
‘ఏంటి చెప్పేది?’
‘ప్రేమిస్తున్నానని’
‘చెబితే..’
‘తనకూ తెలుస్తుందిగా.. ’
‘తెలుసుకుని ఏం చేస్తాడు?’
‘తనకీ ఇష్టమైతే ప్రేమిస్తాడు..’
‘ఇష్టం కాకపోతే?’
‘అయితే ఎప్పటికీ ఇలాగే మనసులోనే ఉంచుకుంటావా?’
‘బాగుంది కదా..! ఉండనీ’.
‘అంతేకానీ చెప్పనంటావ్’
‘ఊహూ..’
‘పోనీ నేను  చెప్పనా?’
‘ఇదేమైనా రికమండేషనా?’
ఇలా సాగేది మా సంభాషణ. కానీ, విషయం ఎక్కడికీ సాగేది కాదు.. ఎప్పుడూ జట్టుగా ఉండే మేము.. ఈ ఒక్కవిషయంలో మాత్రం తీవ్రంగా వాదులాడుకునేవాళ్లం. ప్రశాంత్ తనకి మంచి స్నేహితుడు.. నేను మాట్లాడుతానంటుంది తను. కుదరదంటాను నేను..




ఇలా నా ఆలోచనల్లో నేనుంటే.. దానికి భంగం కలిగిస్తూ.. కవిత కానీ, పాటకానీ పాడాలంటూ.. నన్ను పిలిచారు. నేను ససేమిరా అన్నాను. వాళ్లేమో బలవంతం చేస్తున్నారు. నావల్ల కాదు.. నన్ను వదిలేయమని మృదువుగా చెప్పాను. దాంతో అందరూ ఇంక బలవంతం చేయలేకపోయారు. కానీ అవని మాత్రం తన బదులు నేను చేస్తానంటూ వెళ్లింది. నా స్నేహితురాలు అని కాదు కానీ, అవని పాట పాడినా, డాన్స్ చేసినా అలా చూడాలనిపిస్తుంది. కానీ, తను ఆ రెండూ కాక కవిత చెబుతానంది. దాంతో నాకు నవ్వాగలేదు. అది ఉడుక్కుంటున్నా.. అందరూ నావంక చిత్రంగా చూస్తున్నా.. ఈసారి ఆపుకోలేకపోయాను. అలా ఉంటుంది మరి దాని కవిత్వం.

నేను నవ్వడం ఆపాక మొదలుపెట్టింది..

తొలిచూపు ప్రేమంటే ఏమిటో అనుకున్నాను.. ఎంత త్వరగా అర్థమైందో అది నీవేనని.
ప్రేమించడమంటే తెలియదనుకున్నాను.. నీ పరిచయమయ్యేవరకూ..
నిరీక్షణ కూడా బావుంటోంది.. నీకోసం వేచి చూస్తున్నపుడు..
దు:ఖంలోనూ ఆనందమేస్తోంది.. నీవు ఎదురుగా ఉన్నపుడు.
భయంలోనూ ధైర్యపు ఛాయలు కనిపిస్తున్నాయి.. నీవు జతగా ఉన్నపుడు.
ఏదైనా చేయగలను.. నీవు నేర్పించినపుడు.
ఎంతసేపైనా ఎదురుచూడగలను.. నీ నోటి నుంచి వచ్చే పలుకు కోసం.
కానీ, చెప్పలేను నీవు ఎదురుగా ఉన్నపుడు ప్రేమిస్తున్నాని.. చూడలేను ఎదురుగా ఉన్నపుడు నీ కళ్లలోకి..
ఎందుకు చెప్పవంటే.. ఏం చెప్పను. ఇష్టమైతే మాటల్లో చెప్పగలను. ప్రేమ కదా..! కళ్లతోనే పలికించగలను.
బాధ లేదు.. నీకు చెప్పలేకపోతున్నానని.. కానీ, భయమేస్తోంది.. నువ్వు కాదంటావేమోనని.
నువ్వు దూరంగా ఉన్నా బతికేయగలను కానీ.. దూరమైతే మాత్రం కాదు..
ప్రశాంతమైన నీ నవ్వునూ, స్నేహాన్ని అనుపమానంగా ప్రేమిస్తూ.. నీ........

అంటూ వేదిక దిగింది.

అందరూ చప్పట్లు కొడుతోంటే, నా కళ్లలో ఆశ్చర్యంతోపాటు సన్నని నీటిపొర చూపును కమ్మేస్తూ.  కానీ, నాలుగు కళ్లు నా వైపే చూస్తుండడం మాత్రం తెలుస్తోంది..
రెండు అవనివీ.. 
మరో రెండేమో...!!

Wednesday 14 September 2016

ఆనందమే జీవిత మకరందం!

నందానికీ, జీవిత కాలానికీ నేరుగా సంబంధం లేకపోయినా జీవితం సాఫీగా సాగడానికి మాత్రం ఆనందం తప్పనిసరి. మరి ఇదెక్కడ దొరుకుతుంది?


మనిషి జీవితం నూరేళ్ళు. కానీ నిజమైన సంతోషంతో జీవించే సమయం మాత్రం చాలా తక్కువ. ఎవరినైనా సరే.. మీరు రోజంతా చాలా సంతోషంగా గడిపిన సందర్భం గురించి చెప్పమంటే తప్పకుండా ఆలోచించి తీరుతారు. ఎందుకంటే అలా చెప్పడం దాదాపు కష్టం. కానీ అలా జీవించగలగడం అసాధ్యం మాత్రం కాదు.

మనిషికి నిజమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రకృతే. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకూ మనిషికి అవసరమైన ఆనందాలన్నింటినీ రుచి చూపిస్తుంది. ప్రేమను అందిస్తుంది. వెతికే మనసుండాలే కానీ ఆనందం మన చుట్టూనే తిరుగుతుంటుంది. మనమే దాన్ని పట్టించుకోం. నిజానికి మనిషి అల్పసంతోషి. చిన్న చిన్న విషయాలకే సంబరపడిపోతాడు. కానీ సమస్యేంటంటే.. ఆనందం ఎక్కడ దొరుకుతుందో సరిగా గుర్తించలేకపోవడం. కానీ ఒకసారి చుట్టూ పరికించి చూస్తే చాలు.. మన చుట్టూ అల్లుకుని ఆనందం స్వాగతిస్తుంది.

సహజ సౌందర్యంతో... 

 
ఉదయాన్నే హాయిగా తాకే చల్లగాలి.. దానికి లయగా పలకరిస్తున్నట్లు తలలూపే చెట్లు.. పక్షుల కిలకిలారాగాలు తోడై అందించే ఆహ్లాదం ఏ కవి వర్ణనకు అందుతుంది? అనుభవించే మనసుకు తప్ప! ఏ స్నేహితులూ అందించలేని హాయి అది. ఏ వాద్యానికీ సాటిరాని సంగీతమది. ఆ చల్లగాలిని గుండెల నిండా నింపుకుంటూ.. పక్షుల కువకువల సంగీతాన్ని ఆస్వాదిస్తూ.. మంచుబిందువులను శిరసున అలంకరించిన పచ్చిక మీద నడుస్తుంటే.. అవేమో అరికాలికి చక్కిలిగింతలు పెడుతూ ఉల్లాసాన్నందిస్తుంటే.. ఆ అనుభూతి స్వర్గపుటంచుల్లో విహరిస్తున్నట్టుండదూ?

ప్రకృతిలో ఎన్నో రంగులు. ఒక్కో రంగుకు ఒక్కో ధర్మమున్నా.. అవి మనిషితో విడదీయని బంధంగా పెనవేసుకున్నాయి. ప్రతి రంగూ ఒక ఆశ్చర్యమే! ఉదయాన్నే.. కొండల మధ్యనుంచి నక్కి బయటికి వస్తూ లోకమంతా వెలుగును ప్రసరించే సూర్యుడు రంగులన్నీ తన సొంతం చేసుకున్నట్టు కనిపిస్తాడు. లేత పసుపు, నారింజ వర్ణాన్ని కలిపి పోత పోసినట్టుండే సూర్యుని లేతకిరణాలు చక్కని ఉదయానికి స్వాగతం పలుకుతున్నట్టూ.. వెచ్చని తమ స్పర్శతో ముద్దాడుతున్నట్టూ ఉంటుంది. ఇలా రోజంతా సూర్యుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే అనేక రంగులతో కనువిందు చేస్తాడు. అప్పుడే చిగురులు వేస్తున్న మొక్క, పండిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆకు.. హరివిల్లు, నీలాకాశం.. మన చుట్టూనే ఎన్నో రంగుల ప్రపంచాన్ని అల్లాయి.

ప్రకృతిలో గమ్మత్తైన వాటిల్లో పూలది ప్రత్యేక స్థానం. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ.. చూసేవారి మనసుకు ప్రశాంతతను ప్రసాదిస్తాయి. అవి పంచే సువాసనలు ఎంతటి చిరాకులో ఉన్నవారికైనా హాయినిస్తాయి.

వీటిని మనస్ఫూర్తిగా పట్టించుకుంటే సరి!

చిరునవ్వు వెల ఎంత?


కర్కశపు మనసునైనా వెన్నలా కరిగించగల శక్తి చిన్నపిల్లల బోసి నవ్వుకే ఉంది. కల్మషం లేని వారి చిరునవ్వు చూడగానే ఎవరికైనా మనసంతా హాయితో నిండిపోతుంది. చిరాకుగా ఉన్నపుడు వారినలా చూస్తూ గడిపితే మనసులో ఉండే ఏ ఆందోళనైనా చేత్తో తీసేసినట్టు చెరిగిపోతుంది. అసలు చిరునవ్వుకున్న శక్తే అది! ఈ హడావుడి ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ పలకరించడం దాదాపు కష్టం. ఆత్మీయులు, దూరంగా ఉండే వాళ్లంటే సరే, కానీ కనీసం పక్కన ఉన్నవాళ్లనైనా పలకరించాలంటే.. వారితో బంధం ఎల్లప్పుడూ కొనసాగేలా చూడాలంటే..? చెరగని చిరునవ్వే మార్గం.

పిల్లల బాల్యమంతా తమ భవిష్యత్తును నిర్మించుకోవడంలో సాగిపోతుంటే.. పెద్దలు వారికి అన్నీ సమకూర్చడంలో మునిగిపోతున్నారు. ఫలితంగా ప్రేమలు తగ్గుతాయి. చిన్నప్పటి నుంచే వారికోసమంటూ కొంత సమయం కేటాయిస్తూ.. మాట్లాడుకోవడం చేస్తుంటే.. అదే అలవాటుగా మారి వారు పెద్దయ్యాక కూడా కొనసాగుతుంది. ప్రేమ పదిలంగా ఉంటుంది.

ఏ స్థాయిలో ఉన్నా ప్రతి ఒక్కరూ కోరుకునేది చిన్న ప్రశంస. ద్వేషాన్ని సైతం ప్రేమగా, అసాధ్యాన్ని సాధ్యంగా మార్చగల శక్తి చిన్న మెచ్చుకోలుకు ఉంది. ఇది కోపాన్నైనా స్నేహంగా మార్చగలదు. ఇది కొండనైనా పిండిచేయగలమన్న ధైర్యాన్నీ, ఏదైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసాన్నీ ఇస్తుంది.

వీటిని తెలుసుకుని ఆచరిస్తే మేలు!

ప్రేమను ప్రకటిస్తే ...

 

ఎవరికైనా ప్రేమ అపురూపమే! ప్రేమంటే ఇదని చెప్పే సరైన మాటను వర్ణించడం కష్టం. దాన్ని చరిత్రలో చదవలేం.. కవిత్వాల్లోనూ పలికించలేము. అలాంటి భావాన్ని గుండెల్లోనే దాచుకుంటే ఆత్మీయులపై మన అనురాగాన్ని ఎలా తెలియజేయగలం? వెతకాలే కానీ ఎన్ని మార్గాల్లేవు!

వారంలో కొంతసేపు కుటుంబానికి కేటాయించండి. జీవితభాగస్వామితో, పిల్లలతో, తల్లిదండ్రులతో సరదాగా గడపండి. వారితో అలా దూరప్రాంతాలకు విహారానికి వెళ్లిరండి. మానసికోల్లాసంతోపాటు.. కుటుంబానికి మీరిచ్చే ప్రాధాన్యమూ తెలుస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కూడా!

ఏ ఆదివారమో.. సెలవు దినం రోజో గంట కేటాయించి బంధువులు, స్నేహితులతో ఫోన్లో మాట్లాడండి. వారి యోగక్షేమాలు కనుక్కోండి. వారితో గడిపిన కాలాన్ని గుర్తుచేయండి. మనసు గాల్లో తేలుతుంది. ఇంత చిన్న సంభాషణలో ఎంత ఆనందం దాగుందో అర్థమవుతుంది. ఎంత ఆస్వాదించామో.. అంతా పంచినట్టవుతుంది. పైగా బంధం కూడా బలపడుతుంది.

మీ ఆత్మీయుల, స్నేహితుల ప్రత్యేకమైన రోజును గుర్తుండిపోయేలా చేయండి. బజారులో దొరికే వస్తువులపై ఆధారపడకుండా.. కిందటేడాది వారు ఈ రోజును ఎలా జరుపుకున్నారో గుర్తు చేస్తూ ఒక ఉత్తరం రాయండి. వారి కోసం ప్రత్యేకంగా మీరే ఏదైనా తయారు చేసి ఇవ్వండి. ఏదీ కుదరదనుకుంటే.. ఒక రంగు కాగితాన్ని తీసుకుని మీ చేతిరాతతో అభినందనలు రాసి అందించండి. ఏదైనా సరే.. సొంతంగా చేయండి. మీ ద్వారా పొందిన ఆనందాన్ని బహుశా వారు కూడా వర్ణించలేరేమో!

ఎంత అందిస్తే అంతా వెనక్కు వచ్చేది ప్రేమొక్కటే. అందుకు చక్కని ఉదాహరణ జంతువులూ.. పక్షులూ. నగరమైనా.. పల్లెటూరైనా.. పక్షులు కనిపించని చోటుండదు. అవి కనిపించగానే వాటికి కొన్ని గింజలు చల్లండి. వాటికోసం ప్రత్యేకంగా చిన్న గిన్నెల్లో నీరు ఉంచండి. తీరికగా ఉన్నపుడు ప్రయత్నించి చూస్తే.. అది అందించే తృప్తి.. అనుభవించడమే.. వర్ణించడం కష్టం.

కొద్దిగా ఆలోచిస్తే.. ఆనందం అరచేతిలోనే!

క్షమ, సాయం... 

 
గట్టు దాటి ప్రవహించిందని నదిని కోపగించుకోగలమా? లేదు కదా. ప్రవాహాన్ని మళ్లించి సరైన దిశగా సాగేలా చేస్తాం. అలాగే చిన్న చిన్న తప్పులు చేయడం మానవ సహజం. వాటిని పెద్ద మనసు చేసుకుని క్షమించేస్తే! అది ఎందుకు తప్పో ప్రేమగా వివరిస్తే.. ఆ తప్పు పునరావృతమయ్యే అవకాశమే ఉండదు. చిన్న చిన్న తడబాట్లు.. పొరబాట్లు జీవితంలో తప్పనిసరే.. వాటిని సరిచేస్తూ నడిపేవారుంటేనే కదా.. నడకల్లోని చిన్న తడబాటైనా నాట్యంగా మారేది!

ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయం చేయడం, అవసరానికి ఆదుకోవడంలో ఉన్నంత తృప్తి ఏ సిరి సంపదలు ఇవ్వగలవు? అవసరమంటూ ఎవరు అడిగినా.. మీకు చేతనైనంత సాయం చేయండి. కుదరకపోతే.. సాయం పొందగల దారినైనా చూపించండి. ఇలా నా అన్నవాళ్లు అన్నవారిని నలుగురిని సంపాదించుకుంటేనే కదా జీవితానికి అసలైన అర్థమూ.. పరమార్థమూనూ..!

మనసు పెడితే సరి!

మనకోసం మనం...


మన చేత్తో ఒక విత్తనాన్ని నాటి, అది మొలకెత్తడం కోసం చూసే ఎదురుచూపులో ఎంతో ఆనందముంటుంది. భూమిని చీల్చుకుంటూ మొలక బయటికి వచ్చి.. తరువాత చిన్న చిన్న చిగుళ్లు వేస్తుంటే.. దాన్ని చూసి మురిసిపోని మనసుంటుందా! చిన్నపిల్లలను సాకినట్లు దానిని నిరంతరం రక్షించడంలో ఉండే సంతృప్తి మాటల్లో వర్ణించలేనిది.

పుస్తకం మంచి నేస్తం. ఒక్కసారి పరిచయం చేసుకోవాలిగానీ.. ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ఎన్నో సంస్కృతులను పరిచయం చేస్తుంది. ఒక పుస్తకం చదవడం ద్వారా ఎన్నో మంచి విషయాలను తెలుసుకోవడంతోపాటు.. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. భాషపై పట్టు సాధించడానికీ తోడ్పడుతుంది.

హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం- కనగలిగిన మనసుంటే బ్రతుకే అనురాగమయం’ అనే పాట వినేవుంటారు. ఎంతటి మొరటువారినైనా కదిలించగల శక్తి సంగీతానికికుంది. పాట వింటూ తాళమేయకుండా ఉండేవారు బహుకొద్దిమంది. ఒంటరిగా ఉన్నపుడో.. చిరాకుగా ఉన్నపుడో ఒక మంచి పాట వినండి. దానితోపాటు మీరూ శ్రుతి కలపండి. కుదిరితే లయకు తగ్గట్టుగా చిందేయండి. మీ ఒంటరితనం.. చిరాకు అలా అల్లంత దూరాన పారిపోవడం మీరే చూడొచ్చు.

పున్నమి వెన్నెలను చూస్తే.. ఎవరికైనా కవిత్వం పొంగుకు రావడం ఖాయం. ఆరుబయట.. పండు వెన్నెల్లో కూర్చుని స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆటలాడుకుంటూ.. ముచ్చట్లు చెప్పకుంటూ గడిపితే ఆ ఆనందం రుచి అనుభవించే వారికే తెలుస్తుంది.

తెలిసిన అంశాలే... పాటిస్తే సరి!



మంచి పంట చేతికందాలంటే.. పదునైన నాగలి పోటుకు నేల తలవంచాల్సిందే. అందమైన స్వర్ణాభరణం తయారవాలంటే.. కొలిమి వేడికి తట్టుకోవాల్సిందే. ఇనుము అందమైన వస్తువుగా వంగాలంటే.. సమ్మెట పోట్లను ఆహ్వానించాల్సిందే. అలాగే జీవిత నిర్మాణం అందంగా సాగాలంటే.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సిందే. జీవితంలో పైకి రావాలని అందరూ కోరుకుంటారు.. ఆశిస్తారు. తప్పులేదు. దానికి కృషి కూడా అవసరమే. కానీ దానికి ఆనందాన్ని పణంగా పెట్టాల్సిన పనిలేదు. ఆనందం మనలోనే ఉంటుంది. అనుభవించే మనసులో ఉంటుంది. మన చుట్టూ ఉంటుంది. సరిగా గమనిస్తే.. మనతోనే ఎల్లప్పుడూ ఉంటుంది. కృషికి ఆనందం తోడైతేనే కదా.. నిజమైన విజయం.. సంతృప్తి!

పువ్వు.. గడ్డిపోచ.. చిగురాకు.. పంటమొక్క... వీటి జీవితకాలాలు తక్కువే. కానీ జీవితాన్ని ఎలా ఆనందంగా గడపొచ్చో చెబుతాయి. తృప్తిగా ఎలా జీవించాలో కూడా నేర్పిస్తాయి. వీటిని ఆదర్శంగా తీసుకుంటే నిజమైన జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో.. అనుభవించవచ్చో తెలుసుకోవచ్చు.

Tuesday 6 September 2016

హీరోయిజం కాదు.. గ్యారేజీ కనిపించింది! (జనతా గ్యారేజ్ రివ్యూ)




సూపర్ హిట్.. యావరేజ్.. 76%.. ఇంకాస్త ఉండాలి.. కామెడీ లేదు.. హీరోయిన్లదేం లేదు.. ఇదీ జనతా గ్యారేజ్ సినిమా గురించి వినిపిస్తున్న విభిన్న కామెంట్లు.. మరి నా కామెంటేంటి..?


ముందు కథ విషయానికొస్తే.. నేను కొత్తగా చెప్పేదేముంది! కొరటాల శివ అదే- డైరెక్టర్ తన టీజర్ ద్వారానే మొత్తం కథను చెప్పేశాడు. ఇక మొత్తం చెప్పేసేశాక సినిమా చూసేదేముందంటే- ఒక ప్రకృతి ప్రేమికుడికీ, కష్టాల్లో ఉన్నవాళ్లకీ సాయపడే వ్యక్తికీ మధ్య లింక్ ఎలా కుదిరిందనేదే!

సినిమాకి వెళ్లే ప్రతీ ఒక్కరూ ఈ విషయాన్ని ఎలా చూపించారా? ఇద్దరి హీరోయిన్ల పాత్రేమిటా అని తెలుసుకోవడానికే వెళతారు. టీజర్ అనేది తెలియని వాళ్లు ఇక్కడ ఎక్సంప్షన్. ఇక తారక్ అభిమానులైతే.. ఇంకో సెంటిమెంట్ ను కూడా పెట్టుకున్నారు. గత పుష్కరాలపుడు సింహాద్రి, ఇపుడూ అలాగే ఉంటుందని!

ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. మాస్ హీరోగా పేరున్న జూనియర్ ఎన్.టి.ఆర్ గత రెండు సినిమాలు- టెంపర్, నాన్నకు ప్రేమతోలతో తన పంథాను మార్చుకున్నాడు. మాస్ ఇమేజ్ చట్రం నుంచి కొంచెం పక్కకు వచ్చాడు. కాబట్టి ఇక దీనిలో ఏం చేశాడా అని!

కథ తెలిసిపోయింది. ఇక ఎవరెలా చేశారు అనేదే చెప్పుకోవాలి.. తారక్.. ఇప్పుడున్నయంగ్ జనరేషన్ హీరోల్లో ఎవరు బాగా చేస్తారు అని ఎవరినడిగినా చెప్పే పేరు. హీరోయిన్లు- సమంత, నిత్యామేనన్.. ఎవరినడిగినా వాళ్ల పరిధిమేరకు బాగానే చేశారని. మోహన్ లాల్.. పెద్ద నటుడు, నేషనల్ అవార్డు గ్రహీత. ఇక ఆయన నటనను నేను అంచనా వేయగలనా?

మరి మ్యూజిక్..! దేవిశ్రీ ప్రసాద్.. పాటలంటే మాటలా.. అవి సూపర్. డైరెక్షన్- కొరటాల శివ.. చేసింది రెండే.. కానీ మంచి పేరుంది. కొత్త అంటే కెమెరామెన్- తిరు. ఎవరికివారు చాలా బాగా చేశారు
 

ఇక మరి సినిమా గురించి చెప్పేదేముంది! తిరిగి నటీనటుల దగ్గర్నుంచే రావాలి. ఎన్టీఆర్.. ఏ పాత్రలోనైనా జీవించేయగలడు.. ఎన్ని షేడ్స్ అయినా చూపించగలడు. తెలిసిన విషయమే అయినా.. పక్కన ఉన్నది నేషనల్ అవార్డు గ్రహీత- మోహన్ లాల్. ఒక సీన్ నుంచి వేరే సీన్ కు మారేటప్పటికి భావోద్వేగాల్లో ఎన్నో మార్పులుంటాయి. కానీ ఆనంద్ పాత్ర వేరు. సినిమా మొత్తం కూల్ గా ఉంటాడు. తారక్ ను ఇలా ఏ సినిమాలోనూ చూపించలేదు. ఎంతలా నటించాడంటే- సినిమా అంతటినీ ఏకబిగిన తీశారా అన్నట్టు దాన్ని మెయింటెయిన్ చేశాడు. ఇంతవరకూ తనలో చూడని కొత్తదనం కనిపిస్తుంది. మోహన్ లాల్, తారక్ మధ్య వచ్చే సన్నివేశాల్లో అయితే, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక హీరోయిన్లు పాత్ర పరిధి చిన్నది కానీ, ఉన్నంతవరకూ బాగా చేశారు. అలా అని అలా వచ్చిపోయే పాత్రలు మాత్రం కాదు. దీనిలో రాజీవ్ కనకాల ఒక పాత్ర పోషించాడు. చిన్నదే కానీ పాత్రను తీర్చిదిద్దిన విధానం అక్కడి సంభాషణలూ ఆకట్టుకుంటాయి.

పాటలు దేవిశ్రీ బాగా రూపొందించాడు. కానీ, అన్నింటినీ రామజోగయ్యశాస్త్రే రాశారంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రణామం.. ప్రణామం రాసి, పక్కా లోకల్.. రెండూ ఒకరే రాయగలిగారంటే మరి ఆశ్చర్యమే కదా!

మైనస్ లు చెప్పగలిగేంత సినిమా పరిజ్ఞానమైతే లేదు కానీ.. ఒక్కటి చెప్పగలను. ఇది కేవలం హీరోను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ మాత్రం కాదు. హీరోని మాత్రమే ఎత్తి చూపుతూ.. మిగతా వాళ్లను చిన్న వాళ్లగా చూపించే రోటీన్ చిత్రమూ కాదు. చూస్తున్నంతసేపూ ఎక్కడో నిజంగా జరుగుతున్నదాన్ని మనం చూస్తున్నామన్న భావన మాత్రం కలుగుతుంది. సంభాషణలు కూడా హీరో ఇమేజ్ కు తగ్గట్టుగా కావాలని రాసినట్టుండవు. చాలా సాధారణంగా, మనసుకు హత్తుకునేలా రాశారు రచయిత. తారక్ డాన్సులు కూడా చాలా ఆకట్టుకుంటాయి. వాటికి అనుబంధంగా వెనుక బ్యాక్ గ్రౌండ్ కళ్లకు విందే..

ఒక పోటాపోటీ నటన చూడాలనుకుంటే జనతా గ్యారేజ్ ను చూడాల్సిందే. ఎంతలా అంటే సాయికుమార్ కూడా కనిపించలేదు.. తారక్, మోహన్ లాల్ ల ముందు

 

కామెడీ లేదు.. హీరోయిన్ పాత్ర తగ్గింది.. ఇలా నాకేమీ అనిపించలేదు. ఎందుకంటే.. నా వరకైతే తారక్, మోహన్ లాల్ కనిపించలేదు.. ఆనంద్, సత్యం.. వాళ్ల మనుషులు, వాళ్ల జీవితాలు ఇలాగే అనిపించింది!

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...