Monday, 14 May 2018

‘మహానటి’ని చూశా.. ఒక ఆరాధనను వెంట తెచ్చుకున్నా!ఏదో తెలియని బాధ.. ఓ పక్క గుండెను పిండేస్తూనే.. గొంతు నుంచి బయటకు రానంటోంది.

ఒక జీవితంలో.. నిజానికి ఎవరి జీవితంలోనైనా కష్టసుఖాలు సాధారణమే! కానీ ఆమె ఆనందంలో నవ్వునూ.. కష్టంలో దు:ఖాన్ని సమంగా అనుభవించేలా చేసింది.. సావిత్రి గారి జీవితం/ సినిమా.. ‘మహానటి’.

ఇక్కడ ఆవిడ జీవితం కదిలించిందని చెప్పాలో.. ఆమె జీవితాన్ని సినిమాగా చూపించి చెరగని ముద్ర వేశాడని దర్శకుడు నాగ్ అశ్విన్ ను అభినందించాలో అర్థం కావడంలేదు.

కొందరిని చూస్తే అమ్మ ప్రేమ గుర్తొస్తుంది. మరికొందరిని చూస్తే ప్రేమంతా పోత పోసినట్లు అనిపిస్తుంది. ఇంకొందరు మొండితనానికి నిలువెత్తు రూపంలా అగుపిస్తారు. ఈ లక్షణాలన్నీ కలిపి చేసిన అందమైన బొమ్మ సావిత్రి. Extreme అన్న పదానికి ఒక తార్కాణంలా అనిపిస్తారావిడ.

‘మహానటి’ సినిమా గురించి మొదటగా నేను విన్నపుడు దాని మీద పెద్దగా అభిప్రాయం ఏమీ కలుగలేదు (సావిత్రి గారి మీద కాదు.. సినిమా మీద). కానీ కీర్తి సురేష్ ని సావిత్రిలా పరిచయం చేస్తూ వచ్చిన స్టిల్ మాత్రం నన్ను ఆకర్షించింది. ఎంతలా అంటే.. టీజర్ లో సంభాషణలు వింటే ఒక సినిమాగానే చూస్తానేమో! సావిత్రిగారిని కాదేమో అని భయపడేంతగా. మామూలుగా టీజర్ అంటే ఆసక్తికరమైనవే చూపిస్తారు అని నా అభిప్రాయం. దీంతో సినిమా మొత్తం ఎలా ఉంటుందో అనే భయం. అయితే ‘మహానటి’లో మాత్రం ఆవిడే కనిపించారు.ఒక సినిమాగా దీన్ని నేను ప్రస్తావించలేను కానీ.. పాత్రధారుల గురించి మాత్రం చెప్పాలనుకుంటున్నా.  సావిత్రి గారి గురించి నాకు పూర్తిగా తెలుసు అని చెప్పలేను. కానీ.. మా నాన్న, పెదనాన్న కారణంగా అలవాటైన పాత సినిమాల ద్వారా పరిచయమే. ఇప్పటికీ నాకు నచ్చిన హీరోయిన్ అంటే.. మొదట వచ్చే పేరు సావిత్రినే. కీర్తి సురేష్.. సావిత్రి గారిలా నటించింది అని చెప్పడం కంటే.. జీవించేసింది అని చెప్పొచ్చు. ఒకరకంగా ఒక బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించింది. ఆమె తండ్రి కోసం పడే ఆరాటంలో.. ఉద్వేగాన్నీ, ప్రేమలో ఉన్నపుడు.. ఆనందాన్నీ, తాను మోసపోయానని తెలిసినపుడు.. బాధనీ ఆమెతోపాటు మనమూ అనుభవిస్తాం. అంతలా జీవించిందామె. మొత్తంగా సావిత్రి గారే కనిపించారు అనీ చెప్పలేను.. అక్కడక్కడా కీర్తినే కనిపించినప్పటికీ.. అంత గుర్తించ దగ్గదేం కాదు. అయితే తెరపై సావిత్రికి ఇంకెవరో డబ్బింగ్ చెప్పినట్లనిపిస్తుంది. 

దుల్కర్ సల్మాన్.. జెమినీ గణేశన్ లా కనిపించలేదు (పోలికల పరంగా). కానీ సావిత్రికి సపోర్ట్ గా ఉన్నపుడూ, తరువాత ఆమె ఇతన్ని మించి పోతోందన్నపుడు ఏర్పడిన ఈర్ష్య.. ఈ రెండు వేరియేషన్స్ నూ చక్కగా పోషించారు. అయితే జెమినీ గణేశన్ మీద నాకెపుడూ నెగెటివ్ ఫీలింగే ఉండేది. అయితే సావిత్రిని తన భార్యగా చెప్పిన తీరు మాత్రం నచ్చింది.. దానికి దుల్కర్ కూడా కారణమై ఉండొచ్చు.

పెద్ద పెద్ద డైలాగ్ లు చెబుతూ, యాంగ్రీ మ్యాన్ గా కనిపించే మోహన్ బాబు.. ఎస్.వి. రంగారావు పాత్రకి చక్కగా కుదిరారు. అంత శాంతంగా.. ఆయన్ని ఇంకే సినిమాలోనూ చూడలేదు నేను. 


ఇంకో ముఖ్యమైన పాత్ర సమంత. మొదట్నుంచీ అమాయకంగా, దానికితోడు నత్తితో కనిపిస్తూనే.. చివరికి ఏడిపిస్తుంది. సావిత్రి కథ పరిచయం నుంచి ముగింపు వరకు అన్నీ తనతోనే ముడిపడి ఉంటాయి. మిగతా పాత్రలన్నీ వేటికవే ప్రాధాన్యంతో కూడుకున్నవి. అయితే.. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య కనిపించినపుడల్లా.. ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ చేయలేదే అనిపిస్తుంది. ఇంకెవరినీ ఊహించలేకో ఏమో ఒక్క సీనుకే పరిమితం చేశారు.. అదీ పెద్దాయన ముఖాన్ని గ్రాఫిక్ గా ఉపయోగించి (ఎన్టీఆర్.. చేసుండాల్సింది కదా!).

‘శంకరయ్య ఎవరు?’ ‘సావిత్రితో అతనికున్న సంబంధం ఏంటి?’ అనే ప్రశ్నలతో ప్రారంభమై.. సావిత్రి చిన్నతనం, తండ్రి కోసం పడే ఆరాటం, నువ్వు చేయలేవు.. అని ఎవరైనా అంటే.. ఎందుకు చేయలేననే పట్టుదల, సినిమాల్లోకి వచ్చిన వైనం, ప్రేమ, పెళ్లి, నటిగా ఎదిగిన వైనం, ఆమె జాలి గుణం, భర్తతో విభేదాలు, పతనం.. దానిలోనూ వీడని దాన గుణం.. అన్నిటినీ మనసుకు హత్తుకునేలా, ఒక జీవితాన్ని దగ్గర్నుంచి చూస్తున్నట్టుగా చిత్రీకరించారు నాగ్ అశ్విన్. 

అసలు ప్రేమంటేనే.. సంక్లిష్టమైనది. అప్పటికే పెళ్లి అయినవాడిని/ తగని వారిని ఎంచుకున్నపుడు అది మరింత బాధనే ఇస్తుంది. సావిత్రి లాంటి మనస్తత్వానికి ఆమె జీవితంలో ఆ ప్రేమ ఏయే పరిణామాలను తీసుకొచ్చిందో.. చివరికి ఆమె ఎలా మిగిలిందో.. దర్శకుడు చక్కగా చూపించారు. అందుకు బుర్రా సాయి మాధవ్ సంభాషణలు, చక్కని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోడయ్యాయి. సందర్భానికి తగ్గట్టుగా నేపధ్య సంగీతం కథతోపాటు నడిచింది.  ఒక రకంగా ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక బృందం ఒక సాహసాన్ని ఎంచుకుని, అందరినీ మెప్పించేలా పూర్తిచేయగలిగింది. ఒక మహా అధ్యాయాన్ని అందంగా, నిజాయతీగా అందించడంలో విజయవంతమైంది.

సాధారణంగా ఒక సినిమాను చూసినపుడు దాన్ని ఎంజాయ్ చేయడమో, దాని నుంచి ఏదైనా సందేశం తెలుసుకోవడమో కనిపిస్తుంటుంది. మొదటిసారిగా కథ, కథనాలు, పాత్రలను కాకుండా ఒక వ్యక్తినీ, ఆమె వ్యక్తిత్వాన్నీ అభిమానిస్తున్నాను. 

ఆమె నుంచి ఏదో నేర్చుకోవాలి లేదా ఆమెలా ఇవి చేయకూడదు అని భావించాలని అనిపించట్లేదు. కేవలం.. కేవలం.. ఒక ఆరాధనని వెంట తెచ్చుకున్నాను.

No comments:

ఒక మనసు బాధ.. నా మాటల్లో..

చాలా దగ్గరగా చూసిన ఒక నిజానికి ఇలా అక్షర రూపం ఇచ్చాను.