Sunday 17 June 2018

హాయిగా.. ‘సమ్మోహనం’గా!



అనగనగా ఓ తార.. నీలాకాశంలో మెరిసేది కాదు. సినిమా తార.
అనగనగా ఓ బొమ్మలబ్బాయి.. అమ్మేవాడు కాదు. గీసే అబ్బాయి.

అబ్బాయికేమో ఆ లోకమే పడదు (సినిమా లోకం). తనదంతా పిల్లలూ, వాళ్లకోసం గీసే బొమ్మలు.. ఇదే లోకం. అమ్మాయికేమో సినిమానే లోకం.  అమ్మాయి షూటింగ్ కోసం అబ్బాయి వాళ్లింటికి వస్తుంది. అలా అనుకోకుండా కలిశారు. స్నేహితులయ్యారు. అప్పటిదాకా సినీలోకంలో అందరూ  నటించేవారే ఉంటారనుకునే అబ్బాయికి ఈ ‘తార’లా మంచివారూ, సున్నితమనస్కులూ ఉంటారని అర్థమైంది. ఇంకేముంది తారపై ప్రేమ కలిగింది. కానీ తార నాకు ఆ ఉద్దేశం లేదంటుంది. అబ్బాయి బాధ పడతాడు. అమ్మాయి చేసిన ఒక పని కారణంగా కోపం తెచ్చుకుంటాడు. తరువాత ఏమైంది? ఒక బూచి కారణంగా తార అలా చేసిందని తెలుసుకుంటాడు. ‘సారీ’ చెబుతాడు. తారతో మళ్లీ కలిసిపోతాడు. అలా కథ కంచికి చేరుతుంది.

- స్థూలంగా ఇదీ ‘సమ్మోహనం’ సినిమా కథ.

ఒక సింపుల్, చిన్నపుడు విన్న కథలా అనిపించే సినిమా.  ఆ అనుభూతిని కొనసాగిస్తూ టైటిళ్ల దగ్గర్నుంచి, సినిమా పూర్తయ్యే వరకూ ఎక్కడోచోట దర్శనమిచ్చే కార్టూన్లు. మొత్తంగా ఒక్కసారి అలా చిన్నతనంలోకి తీసుకెళ్తాయి.  సినిమాలో చెప్పుకోడానికి పెద్ద కథా లేదు.. కంటినీరు తెప్పించే భావోద్వేగాలూ లేవు. అయితే ఒక మ్యాజిక్ మాత్రం మొదట్నుంచీ మనతో ప్రయాణిస్తుంది. చాలాసార్లు తరువాత వచ్చే సీన్లను అంచనా వేసేస్తాం. అయినప్పటికీ నచ్చేస్తోందంటే మ్యాజిక్ అనే చెప్పాలిగా! 

రెండు సీన్లు మినహాయించి.. పెద్దగా గుర్తిండిపోయే డైలాగులుండవు. అలాగని బాలేవనీ కాదు.  మామూలుగా మాట్లాడుకున్నట్టుగానే ఉంటాయి.. కానీ ప్రతీది ఆకట్టుకుంటుంది. పాటలు బాగున్నాయి. చెప్పమంటే.. ఒక లిరిక్ కూడా గుర్తుండదు. కథలో చొచ్చుకుని పోయుంటాయి కదా..! హాయిగా అనుభవించగలం.. కానీ గుర్తుంచుకోలేం. బలమైన భావోద్వేగాలు లేవు కానీ.. బంధాల మధ్య ప్రేమ, ఆత్మీయత నచ్చుతాయి. సెటైర్లున్నాయి.. ఆలోచించేలా, నవ్వుకునేలా. సందేశమూ ఉంది.. కానీ అంతర్లీనంగా. చాలా సాధారణంగా.. ఒకసారి ఆలోచించేలా.. పాటించి చూడాలనిపించేలా!

హాయిగా నవ్వించే కామెడీ, అందంగా కనిపించే ఫ్రేములూ.. అసభ్యత కనిపించని మాటలూ. అలరించే నేపథ్య సంగీతం, పాటలు. రోజువారీ ఒత్తిళ్లకీ దూరంగా.. కాస్త కొత్తదానాన్ని ఆస్వాదించా.

1 comment:

anu said...

Thank you Sam garu..

but na peru anusha.. ammayini.

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...