Wednesday 19 July 2017

ఆమె..




           

         చిన్నికళ్లు.. కొంచెం బొద్దుగా.. నిండైన చిరునవ్వుతో ఉండే తనను చూడగానే నా మనసు చేజారిపోయింది. చిన్న చిన్న విషయాలను కూడా అపురూపంగా చూస్తూ.. ఆశ్చర్యానికి గురయ్యే ఆ కళ్లు.. వాటిలోని మెరుపులను చూడటానికి నా మనసు తహతహలాడుతుండేది.


            రోజు కారు మొరాయించడం, క్యాబ్ కోసం ప్రయత్నిస్తున్నపుడు వర్షం కారణంగా నిలిచిన నీటిగుంటలో ఫోను పడటం వెరసి.. తప్పక అడుగులు బస్టాండ్ వైపుకు పడ్డాయి. ఎంతో అసహనంతో, చిరాకుగా ఉన్న నాకు తారసపడిందామె. రోడ్డుమీద చిన్న కొలనులా నిలిచిన నీటిలో అడుగుపడకుండా, పక్కగా ఉన్న కొద్ది స్థలంలో అడుగులో అడుగు వేసుకుంటూ, అప్పుడప్పుడూ గెంతుతూ వస్తోంది. కానీ, పక్కగా వచ్చిన బండి వేగంగా వెళ్లడంతో నీళ్లు చింది ఆమెపై పడ్డాయి. ఎవరికైనా కోపం వస్తుంది. కానీ ఆమెలో అదేం లేదు. పైగా ఆపిన బండి అతన్ని చూసి ఫర్వాలేదంటూ వెళ్లమంది. అతనిలో కృతజ్ఞతతో కూడిన చిరునవ్వు. మరి ఆమెలో.. అర్థం కాలేదు. ఆ చర్యే ఆమెను నేను మళ్లీ మళ్లీ చూసేలా ప్రేరేపించింది.

             ప్రతీ చిన్నవిషయానికీ ఆశ్చర్యంగా చూసే చూపు, లోకంలోని సంతోషమంతా తనకే సొంతమన్నంత ప్రశాంతత నన్ను అమితంగా ఆకర్షించాయి. అప్పటిదాకా నాలో దాగిఉన్న చిరాకు, మీటింగ్ కు సమయం మించిపోతోందన్న ఆందోళనను దూరం చేశాయి. బస్సు వస్తోంటే భయమనిపించింది.. ఆమె దూరమవుతుందేమోనని. అది వెళ్లిపోయింది కానీ ఆమె ఉంది. నాలో సంతోషం. ఇలా బస్సు వస్తున్న ప్రతీసారి అదే తంతు. ఈసారి మాత్రం ఆమె ఎక్కే బస్సే.. ఎక్కడానికి ఆమె సన్నద్ధమవుతున్న తీరే ఆ విషయాన్ని నాకు తెలియజేసింది. నాలో నిరాశ బస్సు వైపు చూశాను. నేను ఎక్కాల్సిన బస్సే.. ఆనందంతో ఆమె వైపు చూశాను. నవ్వింది.. అరె.. నన్ను చూసే నవ్వింది. సందేహమొచ్చింది. నిర్ధారించుకోవడానికి మళ్లీ నవ్వాను. అదే నవ్వు. నవ్వేసి బస్సెక్కింది. నేనూ హడావుడిపడుతూ ఎక్కేశాను.

             ఎక్కగానే నేను చేసిన పని.. ఆమె ఎక్కడ ఉందో వెతకడమే. .. అదిగో కనిపించింది. డ్రైవర్ వెనకగా ఉన్న సీట్లో అందరికీ ఎదురుగా ఉండే సీటులో కూర్చొనుంది తను. నేను మాత్రం నిల్చొనే ఉన్నాను. మళ్లీ నావేపు చూస్తుందేమనని ఆశగా చూస్తున్నాను. కానీ ఆమె నావైపు చూడను కూడా చూడట్లేదు. ఎందుకో నాకర్థం కాలేదు. అప్పుడే ఎవరో ఒకావిడ బ్యాగు తగిలితే.. మళ్లీ అదే నవ్వు. ఎవరిని చూసినా అదే నవ్వు. ఈసారి నా మనసు చివుక్కుమంది. తను నన్ను ప్రత్యేకంగా చూడలేదు.. అందరితోపాటే నేనూ. బాధనిపించింది. కొంచెం బాధగా ఆమె వైపు చూశాను.

              చుట్టూ ఎంతో మంది అమ్మాయిలు.. మోడ్రన్. ఎప్పుడూ పని విషయం మినహాయించి వారి వైపు ఆసక్తిగా చూసిందే లేదు. ఎంత ఆలోచించినా నన్ను చూసి నవ్వలేదు అని నేను బాధపడటానికి కారణమేంటో తట్టలేదు. నేను నా ఆలోచనలో ఉంటే.. తను మాత్రం పక్కనున్న పాపాయితో ఆడుతోంది. మళ్లీ అదే అందమైన నవ్వు.. కళ్లలో మెరుపు. నేను దిగాల్సిన గమ్యం వచ్చింది. మరోసారి ఆమెను చూసి దిగేశాను.

              ఆరోజు మొదలు .. మొదట చిరాగ్గా పడిన నా అడుగులు ఆసక్తిగా బస్టాండ్ వైపుకు సాగుతున్నాయి. .ఆ నవ్వు కోసం
 
              నాలో ఏదో మార్పు.. అందరూ అంటున్న మాట ఇది. నాకూ తెలియదు ఏం మార్పో! ఒకటి మాత్రం తెలుసు.. నేను ఆనందంగా ఉన్నాను. .ఇంటర్ లో స్టేట్ ర్యాంకు వచ్చినప్పటికన్నా.. క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో ఉద్యోగం సంపాదించినప్పటికన్నా.. సొంతంగా కంపెనీ పెట్టినప్పటికన్నా. ఫలానా భావన అని నాకు తెలీదు. కానీ నేర్చుకున్నా.. నవ్వడం, నవ్వుతూ పలకరించడం.

             చెప్పాలనిపించింది ఆమెకు ఈ విషయాలన్నీ.. చెబితే ఏమనుకుంటుందో నని ఆగిపోయాను. పోనీ ప్రయత్నమైనా చేద్దామనుకున్నాను.. కానీ ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే రాస్తున్నా ఆమె గురించి.. దాచుకోవాలనిపించి!


No comments:

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...