Wednesday 30 April 2014

మొదటి ఓటు అనుభవం.. ఆహా...



ఈరోజు నా జీవితంలో మొదటిసారిగా ఓటేశాను. తొలిసారి వేయబోతున్నాను కదా.. నిజం చెపొద్దూ? .. కొంచెం భయంగా.. అమిత ఉత్సాహంగా అనిపించింది. రాత్రి కూడా నిద్ర పట్టలేదంటే.. నమ్మండి (అంటే.. కరెంటు కూడా లేదులే).


ఓటింగ్ ఉదయం 7 గంటల నుంచి మొదలవుతుంది కదా!  ఆలస్యమైతే క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వస్తుందని ఉదయాన్నే బయల్దేరాను. అసలే పోలింగ్ బూత్ కూడా తెలియదాయే..

పోలింగ్ బూత్ కనుక్కుని అక్కడకు చేరుకునే సరికి సరిగ్గా 6:50 అయ్యింది. ఉత్సాహంగా వెళ్లి చూద్దునా.. అప్పటికే  క్యూ ఉంది. సరేలే అని వెళ్లి నిల్చున్నాను. 7.10 అయినా క్యూ ఎంతకీ కదలదే. విషయం ఏంటంటే అసలు ఓటింగ్ నిర్వహించే వాళ్లే రాలేదట. ఆహా ఏమి భాగ్యమని అలాగే నిల్చుని ఉంటే, ఒక దంపతులు (వయసు సుమారు 50పైగా ఉంటాయేమో) వచ్చి నా వెనుక నిల్చున్నారు.

ఇక వచ్చినప్పటినుంచీ ఆవిడ నన్ను ముందుకు తోస్తూనే ఉంది. అసలే ఇరుక్కుని నిల్చుని చెమటలు పోస్తోంటే.. ఆవిడ ఇంకా తోస్తోంది. అక్కడ ఓటింగ్ ఇంకా మొదలవలేదాంటీ.. మనం జరిగినా ఇరుక్కోవడమే తప్ప లాభం ఉండదు అంటే.. అయ్యో.. అవునా అమ్మా అంటుంది.. మళ్లీ షరామామూలే!

7.30 అవుతున్నా.. ఇంకా క్యూ కదలడం లేదు. ముందు చూస్తే 15 మంది ఉన్నారేమో.. సంగతేంటబ్బా అని ఆరా తీస్తే అప్పుడు తెలిసింది. ఓటింగ్ నిర్వహించాల్సిన ఏజెంట్లు వాళ్లలో వాళ్లు కొట్టుకుంటున్నారట. అసలు సంగతేంటంటే- వేరే ఓటింగ్ కేంద్రంలో విధులు నిర్వహించాల్సిన అతను ఇక్కడ చేయడానికి వచ్చాడట. అందుకు నేను ఒప్పుకోను అంటాడట ఇంకొకతను. చివరికి ఎవరో వచ్చి సర్ది చెబితే.. అప్పుడు మొదలైంది ఓటింగు.

హమ్మయ్యా.. ఇప్పటికైనా కదిలిందని సంతోషిస్తే.. కరెంట్ పోయింది. మళ్లీ క్యూ ఆపేశారు. ఈసారి పాపం 5 నిమిషాలకే కరెంట్ వచ్చింది. పైగా తొందరగానే నా వంతు కూడా వచ్చింది. ఇక సీరియల్ నెంబర్ తనిఖీ చేసేవాళ్లు నెంబర్ అడిగారు. అక్కడ నలుగురు కూర్చున్నారు. ఒకరేమో ఉందంటారు; ఇంకొకరు లేదంటారు. చివరికి ఇద్దరూ ఉందని తేల్చి లోపలికి పంపారో లేదో మళ్లీ కరెంట్ పోయింది.

నా ముందువాళ్లు అప్పటికే ముగ్గురున్నారు. ఆ ఓటు వేసే గదేమో చిన్నగా ఉంది. కిటికీలు తీయడానికి వీలు లేదు. భయంకరమైన ఉక్కపోత. పనిలోపనిగా ఈవీఎం మెషీన్ ఒకటి పాడైంది. దాన్ని బాగు చేసుకుంటూ మళ్లీ సీరియల్ నెంబర్లు చీకట్లో సెల్ ఫోన్లతో చెక్ చేసుకుంటూ మరో పది నిమిషాలు గడిచింది. అసలే ఊపిరాడక చికాకు పుడుతోంటే.. నా వెనుక ఆంటీ.. తతంగమంతా చూస్తూ కూడా అక్కడా నెడుతూనే ఉంది. ఇకంతే.. చిరాకేసి నా ముందు ముగ్గురే కరెంట్ లేక, మెషీన్ పనిచేయక ఆగిపోయారు.. ఇక నేనెక్కడికి వెళ్లి వేయమంటారాంటీ ఓటు? నాకింకా స్లిప్పు కూడా ఇవ్వలేదు అన్నాను. ఇక అప్పడు ఆవిడ ఏమనుకుందో ఏమో.. కొంచెం దూరంగా నిల్చుంది.

మెషీన్ బాగయ్యేసరికి కరెంట్ వచ్చింది.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటే.. TRS కార్యకర్త ఒకరు వచ్చి మా బటన్ సరిగా పనిచేయడం లేదు అంటూ గొడవకొచ్చాడు. మా మనిషిని ఒకరిని అక్కడ ఉంచాలంటాడు. అన్నీ బాగానే పనిచేస్తున్నాయని చెప్పి ఆయనకు సర్ది చెప్పిపంపాక.. వేశానండీ.. నా మొదటి ఓటు. బయటికి వచ్చే సరికి 8.15 అయ్యింది.

చివరికి మొదటి ఓటు వేశానన్న ఉత్సాహం కంటే.. మొత్తానికి బయటపడ్డానన్న ఆనందమే మిగిలింది. :(

4 comments:

వేణు said...

ఈ తొలి ఓటు అనుభవం ఇలా అసౌకర్యంగా, చికాకుతో ఉండటం అప్పటికి చికాకు పెట్టివుండొచ్చు. కానీ, చిరకాలం గుర్తుండిపోయే విభిన్నమైన అనుభవంగా కూడా అయింది కదా?

అంతా సాఫీగా, త్వరితంగా జరిగిపోతే... దేని గురించి అయినా మనం తల్చుకోవటానికీ, చెప్పుకోవటానికీ ఇక ఏమీ ఉండదు!

By the way, పోస్టు రాసిన తీరు బాగుంది.

anu said...

హా.. మీరన్నదీ కరెక్టే వేణు గారూ.. అసలంతా సవ్యంగా జరిగి ఉంటే.. నేనూ ఆ క్షణాల వరకు ఆనందంగా ఉండి, తరువాత మరచిపోయుండేదాన్ని. అలా జరగలేదు కాబట్టే ఇంకా ఎక్కువగా గుర్తుండిపోయేలా ఉంది.

అనామిక said...

మొత్తానికి గంటన్నర వెయిట్ చేసి ఓటు వేసారన్నమాట.. ఆహ్ నుండి ఆహా అన్నారు ఫైనల్‌గా :)

anu said...

అనామిక గారూ.. మొత్తానికి అనాల్సొచ్చింది మరీ..

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...