Tuesday 2 August 2016

బుజ్జాయికి ప్రేమతో.. అమ్మ!

హాయ్ బుజ్జాయి..

 

  నువ్వు కడుపులో పడ్డ మొదటి నెలలోనే నేను కనిపెట్టేశాను. నాన్నకి చెప్పాను కూడా. కానీ నమ్మితేగా! డాక్టర్ ఆంటీ కన్.ఫాం చేశాక నమ్మారు. ఆశపడి తరువాత అది భ్రమ అని నిరాశపడాల్సి వస్తుందేమో అనుకుని ఉంటారు పాపం. కానీ నిజమని తెలిశాక మాత్రం ఎంత సంతోషించారో తెలుసా?

  ఎప్పుడెపుడు నా ఒడిలోకి వస్తావా అని ఆతృతగా ఉంది. కొంత టెన్షన్, భయం కూడా ఉందనుకో! ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి, నువ్వు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నావని తెలుసుకున్నాక కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. రోజురోజుకీ నువ్వెలా పెరుగుతున్నావో అని ఒకటే ఆందోళన. కానీ, మాకు అందుబాటులో నెట్ ఉందిగా.. దాని సాయంతో నీ ఎదుగుదల ఎలా ఉందో తెలుసుకుంటున్నాను. అమ్మమ్మ వాళ్లపుడు ఇవన్నీ లేవుగా.. ‘మీరైతే ముందే తెలుసుకుంటున్నారు.. మా అపుడివన్నీ ఏం లేవు’ అంటుంటుంది అమ్మమ్మ
 


  
హాస్పిటల్ కి ఎవరైనా పిల్లలను ఎత్తుకుని వస్తే నేనెపుడు నీతో వస్తానా అని అనిపిస్తుంటుంది. అపుడపుడు ఊహించుకుంటుంటాను కూడా. ఆ ఆలోచన ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా. ఒక్కోసారి పిచ్చి అనిపిస్తుంది, ఇంకోసారి తమాషాగా అనిపిస్తుంటుంది. మొత్తానికి ఆనందంగా ఉంటుంది.

  అయిదో నెల నుంచే పిల్లలు అమ్మ బొజ్జలో నుంచి వింటుంటారట. మరి నేను నీ కోసం పాటలు పాడుతున్నాను. నాన్న, అమ్మమ్మ మాటలు చెబుతున్నారు. మరి నువ్వు వింటున్నావా? వింటూనే ఉండుంటావులే! లేదంటే సమాధానం అడిగినప్పుడల్లా నువ్వు కదులుతూ ఎలా ఉంటావ్? నువ్వు కదిలినప్పుడల్లా నేను వింటూనే ఉన్నా అమ్మా అని నాకు నువ్వు సమాధానం చెబుతున్నట్లనిపిస్తుంటుంది. ఎన్ని ఊహలో..!

  మరిచిపోయా బుజ్జాయీ.. నాకైతే నువ్వు పాప కావాలని ఉంది. తాతకేమో బాబు. ఎందుకంటే అమ్మమ్మ తాతయ్యకి నేను, పిన్ని ఇద్దరం అమ్మాయిలమే కదా! రోజూ ఈ విషయంగా తాతా, నేనూ ఒకటే గొడవ. అయ్యో బుజ్జాయి.. నువ్వు బాబైనా నేను ప్రేమగానే పెంచుకుంటాను నాన్నా.. కానీ ముందు అలా మాట్లాడుకుంటామంతే. నువ్వు వాటన్నింటినీ సీరియస్ గా తీసుకుని అమ్మ మీద అలక పెంచుకోకే.. సరేనా..!

  ఇవన్నీ సరే కానీ.. త్వరగా వచ్చేయమ్మా.. ఇంక ఎదురుచూడడం నావల్ల కావడంలేదు. అందరు పాపలు, బాబులూ వచ్చేస్తున్నారు. త్వరత్వరగా వచ్చేయి. నువ్వు వచ్చాక ఇంకా బోలెడు విషయాలు చెప్పాలి.. నిరీక్షిస్తుంటాను. గుర్తుంచుకో.. ఇక ఉండనా..

బై బై...

No comments:

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...