Thursday 25 August 2016

స్వాగతం బుజ్జాయి..



హాయ్ బుజ్జాయి.. తొమ్మిదో నెల వచ్చిన తరువాత ఎపుడైనా ప్రసవం అవుతుందని చెప్పారు అమ్మమ్మ వాళ్లు (అంటే మా అమ్మ). అప్పటి దాకా తొమ్మిదోనెల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన నేను, వచ్చాక నువ్వు నా ఒడిలోకి ఎప్పుడొస్తావా అని ఎదురు చూడడం మొదలుపెట్టా. గడిచే ఒక్కోరోజును లెక్కపెట్టుకుంటూ.. ఇక వస్తావ్.. ఇక వచ్చేస్తావ్ అని నేను అనుకోవడమే కానీ.. నువ్వు మాత్రం బొజ్జలోనే బాగుందని హాయిగా ఉండిపోయావ్.

ప్రతివారం డాక్టర్ దగ్గరికి వెళ్లేటపుడు నాతోపాటు ఎవరో ఒకరు తొమ్మిదో నెల ఉన్నవారు వచ్చేవారు. మరుసటి వారం చెకప్ కోసం వెళ్లేసరికి వాళ్లేమో పాపతో వచ్చేవారు. నేనేమో చెకప్ కోసం వచ్చేదాన్ని. ఒకసారైతే ఏకంగా ఎనిమిదో నెల అమ్మాయి వచ్చింది. హమ్మయ్యా ఈసారి నేనే పాపతో ముందు వస్తాను అనుకుంటే.. షాక్! ఆ అమ్మాయికి కూడా డెలివరీ అయ్యింది. త్వరగా నొప్పులొచ్చేశాయట ఆ ఆంటీకి.

అలా చూస్తూ చూస్తూ ఉండగానే పదో నెల కూడా వచ్చేసింది. పదో నెల వచ్చిన వారం డాక్టర్ దగ్గరికి వెళితే, అప్పుడు ఇచ్చింది డాక్టర్ ఆంటీ.. నువ్వొచ్చే తారీఖు వివరాల్ని అదే- ఏప్రిల్ 27. అప్పుడు కూడా ఒక ఆవిడ వచ్చింది నాతో.. కానీ ఆమె కంటే ముందురోజు నా డెలివరీ రోజు. ఎంత ఆనందమేసిందో కన్నా ఈసారి మాత్రం.

ఏప్రిల్ 27 పొద్దున్నే 7 కల్లా హాస్పిటల్ లో చేరమన్నారు. ముందురోజు రాత్రి కరెంట్ లేకపోవడం, ఫలితంగా నీళ్లు రాకపోవడంతో వెళ్లేసరికి 8 అయ్యింది. దీంతో డాక్టర్ మరుసటి రోజుకు డెలివరీ వాయిదా వేసింది. నాకైతే ఎంత ఏడుపు వచ్చిందో.. ఇక 28 ఉదయం 8 గంటలకు నొప్పులకి అని చెప్పి ఒక ఇంజక్షన్ ఇచ్చారు. 10 నుంచి నొప్పులు మొదలైతే.. 2.18 గం.లకు నువ్వు బయటికి వచ్చావు.

కానీ బంగారూ.. ఎంత నొప్పో తెలుసా? అసలు తట్టుకోలేకపోయాను. కానీ నీకోసం ఎలా అయినా తట్టుకోవాలనుకున్నాను. నాకు నేనే ఎన్నిసార్లు చెప్పుకున్నానో.. నేను ఓర్చుకోగలను.. ఓర్చుకోగలను అని. నిన్ను చూసిన క్షణంలో మాత్రం నాకెపుడూ పరిచయంలేని ఒక భావన పరిచయం అయ్యిందిరా. అదే- ఆనందబాష్పాలు. నిన్ను చూడగానే నా కళ్లలో అప్పటిదాకా లేని నీరు.. నా పెదవులపై చిరునవ్వు. ఎంత బాగుందో కన్నా.

నీ వల్ల నాకు మాతృత్వం పరిచయమైంది. దాంతోపాటు మా అమ్మ గొప్పతన్నాన్నీ తెలియజేశావు. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ అంటే నాకు ఇష్టమే కానీ, చిన్న చిన్న కోపాలుండేవి. నీవల్ల అవీ పోగా.. అమ్మపై ఇంకా గౌరవం పెరిగింది.

ఇప్పుడు నాకు మా అమ్మ.. అదే మీ అమ్మమ్మ ఎంత ఎత్తున కనిపిస్తోందో తెలుసా! ఒకేసారి డబుల్ ధమాకా అందించిన నీకు థాంక్స్ బంగారూ.. ఇక నీకేం పేరు పెట్టాలా అని ఆలోచిస్తుంటా.. సరేనా?!

4 comments:

COMMON MAN said...

Amma manasuku abhinandanalu

anu said...

Thank you..

Anonymous said...

లేబర్ పెయిన్స్. దాని గురించి ఎవరైనా మాట్లాడితేనే ఎక్కడో బాధగా, ఇబ్బందిగా ఉంటుంది. కేవలం ఊహకే ఆ అనుభవం అంత కష్టంగా ఉంటే, స్వానుభవం ఎంతటి కష్టమో. అంత కష్టాన్ని కలిగించి నేలమీదకి వచ్చిన బిడ్డలంటే ఎంత ప్రేమ, అమ్మలందరికీ జోహార్లు.

anu said...

Thank you.. muralidharnamala గారూ..

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...