Thursday 17 October 2013

బొమ్మ కొంచెం.. భావం అనంతం!

చిన్నప్పటి నుంచి నాకు కార్టూన్లంటే చాలా ఇష్టం.. నాకు గుర్తున్నంత వరకు నేను మొదట చూసిన కార్టూన్ శ్రీధర్ గారిదే.. కార్టూన్ అనగానే గుర్తొచ్చేదీ ఒకటే.. అదే.. ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చే గుండు గాడి కార్టూన్.. దీనిని చూడడానికి వారమంతా వేచి ఉండేదాన్ని.. (మా ఇంట్లో తెప్పించే వారు కాదు కానీ.. పక్కన వాళ్లది తీసుకుని చూసేదాన్ని)



కానీ విచిత్రమేమిటంటే.. అది వేసేది శ్రీధర్ గారేనని నాకు చాలాకాలం వరకు తెలీదు. దీన్ని ఆయన గత 25 సంవత్సరాలుగా వేస్తున్నారు. దేన్నైనా కొంతకాలం చూశాక బోర్ కొట్టడం మామూలే. కానీ, అదేమిటో..  ఇప్పటికీ అదంటే నాకు చాలా ఇష్టం.  ఇప్పుడు ఆ గుండు గాడి వయస్సు పాతిక సంవత్సరాలు. అయినా వాడు ఇప్పటికీ అలానే  నేను చిన్నప్పుడు చూసినట్లుగానే..ఉన్నాడు. అసలు వాడి రూపంలోనే ఉందనుకుంటా మాజిక్.. ఒక గుండు.. గుండు మీద మూడంటే.. మూడే వెంట్రుకలు.. రెండు కళ్లు.. ఒక చిన్న ముక్కు.. నోరు. ఇంకోటి నేను గమనించిందేంటంటే.. వాడెక్కువగా నిక్కరులోనే ఉంటాడు.. చొక్కా ఉండదు.

నా ఎనిమిదో తరగతిలో అనుకుంటా.. తర్వాత నచ్చిన కార్టూన్ బుడుగుది.  బుడుగు గాడిని తెలుగు పాఠంలో భాగంగా చూశా.. వాడూ అచ్చం శ్రీధర్ గారి గుండుగాడిలానే ఉన్నా.... వాడూ అంతే.. విచిత్రమైన సందేహాలు.. అదే నిక్కరు.. కానీ అందగాడు.. జుట్టు కూడా బోలెడుంటుంది.





కార్టూన్లను చూస్తే.. ఆ.. కార్టూనేగా అనుకుంటాం గానీ.. ఒక చిన్న బొమ్మ ద్వారా ఒక పరిస్థితిని హాస్యాత్మకంగా.. విమర్శాత్మకంగా.. వివరించడం కేవలం కార్టూన్ కే సాధ్యమేమో.. పైగా దీనికి వయసుతో సంబంధముండదు. అందరినీ ఆకట్టుకుంటుంది.





పై కార్టూన్ చూడండి.. దీనిని చూస్తే ఎన్టీఆర్ చనిపోయినప్పటిది అని అర్థమవుతుంది. అలాగే ఏ తెలుగువాడి గుండె చీల్చినా ఎన్టీవోడే కనపడతాడని సులువుగా తెలిసిపోతుంది. ఇక్కడ అభిమానం ఆయన నటించిన సినిమాల వల్లా కావచ్చు.. ఆయన పాలన ఫలితమూ అవ్వొచ్చు.





ఈ కార్టూన్ చూస్తే.. మొదటి కార్టూన్ కి కొనసాగింపుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ ప్రజల్లో ఎంతో పేరు తెచ్చుకుంటే.. మిగతా నాయకులు ప్రజలకు మొహం చాటేస్తున్నట్లు.. దోచుకొంటున్నట్లూ ఉంటుంది. ఇందులో కనిపించని విమర్శా దాగుంది!



ఇక ఈ గుండుగాడి కార్టూన్లు సరే సరి.. చిన్న పిల్లలకు వచ్చే సందేహాలూ.. వగైరా.. వగైరా..




స్కూలుకెళ్లడానికి మొరాయించే పిల్లలు అప్పట్లో చేసే పని పలక పగలకొట్టడం.. (ఇప్పటి పిల్లలకు ఆ అవకాశమే లేదు.. అంతా ప్లాస్టిక్ మయం.. లేదా నోట్ పుస్తకాల్లో హోం వర్కూ.. అదీ కాదంటే.. ఉన్నాయిగా కంప్యూటర్లు..) ఆ సమయంలో నాన్న షాపుకు తీసుకెళ్లడం.. కొత్త పలక కొనివ్వడం షరా మామూలే.. సాధారణంగా షాపుకెళ్లినపుడు దుకాణదారుడు ఏ వస్తువునైనా.. దీనికంటే గొప్పది మరోటి లేదని చెబుతుండడం గమనించొచ్చు.. ఈ రెండు సంఘటనలూ ప్రతిబింబించేలా వేసిన బాపు గారి కార్టూనిది.

మరికొన్ని...





2 comments:

నాగరాజ్ said...

శ్రీధర్ గారు గీసే ఆ మూడు వెంట్రుకల గుండుగాడి పేరు బాలు అట. ఇక ముళ్లపూడి బుడుగు గురించి చెప్పనే అక్కర్లేదు. బోల్డంత మందికి ఇష్టమైన ఆ చిచ్చర పిడుగులిద్దరినీ గుర్తు చేయడం బావుంది.

anu said...

నాగరాజ్ గారూ.. థాంక్స్ అండి.. గుండు గాడి పేరు చెప్పారు. అయితే గుండు గాడి పేరు బాలూ ఆ.. బాగుందండి.. పేరు కూడా తెలియకుండా అభిమానించానన్నమాట..

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...